………మంత్రి కందుల
విశాలాంధ్ర – నిడదవోలు :
నాణ్యమైన వైద్య సేవలు అందినప్పుడే ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని, అందుకు అనుగుణంగా ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ కూటమి ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు లోని నెహ్రూనగర్-1 లో రూ. 1.36 కోట్ల నిర్మించిన ఆయుష్మాన్ఆరోగ్యమందిర్ ను మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, రూ.1 కోటి 1 లక్ష నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ నిధులు, రూ.35 లక్షల మున్సిపల్ సాధారణ నిధులను వెచ్చించి ఆసుపత్రిని నిర్మించామన్నారు. వైద్యావసరం ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో పట్టణ అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభించుకోవడం తద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తుండటం సంతోషకరంగా ఉందన్నారు. స్థానిక ప్రజలు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వైద్య నిపుణులు, అర్హులైన ల్యాబ్ టెక్నీషియన్, నాణ్యమైన మందులు ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ ను అందుబాటులోకి తెచ్చామన్నారు.గత ప్రభుత్వం అర్బన్ హెల్త్ సెంటర్ ను పూర్తి చేయలేకపోవడం వల్ల చాలా మంది పేద ప్రజలు వైద్యం అందుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అంశాలను నిరంతర ప్రక్రియగా గత ప్రభుత్వం ఎందుకు భావించలేదని ప్రశ్నించారు. ఈ నిర్మాణాలను పూర్తి చేసి ప్రారంభించుకోవాల్సిన కర్తవ్యాన్ని ఎందుకు నిర్వర్తించలేకపోయారని గత వైకాపా ప్రభుత్వాన్ని నిలదీశారు. పూర్తికాని బిల్డింగ్ లకు పేర్లు పెట్టుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. పేద ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చినప్పుడే కర్తవ్యం నెరవేరినట్లని తెలిపారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట వేసి మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చిందన్నారు.
త్వరలోనే నిడదవోలులో క్రీడా మైదానం, 100 పడకల ఆస్పత్రి, చిన్నకాశిరేవు బ్రిడ్జి………….మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలులో క్రీడా మైదానం, 100 పడకల ఆస్పత్రి, చిన్నకాశిరేవు బ్రిడ్జులను పూర్తి స్థాయి అనుమతులతో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు మంత్రి దుర్గేష్. కేంద్ర ప్రభుత్వం తొలి నుంచి రాష్ట్రానికి సాయం అందిస్తుందని తెలిపారు.
ఇప్పటికే నిడదవోలులోని 30 పడకల ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా రూపాంతరం చెందేందుకు తాము పెద్ద ఎత్తున కృషి చేస్తున్నామన్నారు.గత ప్రభుత్వం ఆస్పత్రి మంజూరు చేయించామని చెప్పి కొబ్బరికాయ కొట్టి చేతులు దులుపుకుందన్నారు. అవసరమైన వైద్యులు, వైద్య సిబ్బంది, వారి వేతనాలు, పరికరాలు, మౌలిక సదుపాయాల ఏర్పాటు, ఆర్థిక అనుమతుల అంశాన్ని పట్టించుకోలేదాన్నారు. దాంతో ఆసుపత్రి అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న మాదిరిగా ఆగిపోయాయని విమర్శించారు. సీఎం చంద్రబాబునాయుడుకు, ఆరోగ్యశాఖ మంత్రి, హెల్త్ సెక్రటరీలను కలిసి పరిస్థితిని వివరించి అన్ని అనుమతులతో వంద పడకల ఆసుపత్రిని అభివృద్ధి పరచడం జరుగుతుందన్నారు.
చిన్నకాశిరేవు బ్రిడ్జి విషయంలో గత ప్రభుత్వ వైఖరిని మంత్రి దుర్గేష్ వివరించారు. ఆర్థిక శాఖ మంజూరు అనుమతులు లేకుండా కొబ్బరికాయ ఎలా కొట్టారని గత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ప్రజలను మసిపూసి మారేడు కాయ చేశారే తప్ప కించిత్ అభివృద్ధి కూడా చేయలేదన్నారు. అభివృద్ధి చేయాలంటే పూర్తి స్థాయి అనుమతులు తప్పనిసరి అన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్ని అనుమతులు వచ్చాకనే పనులు ప్రారంభించి పూర్తి చేసి ప్రజలకు చిన్న కాశీ రేవు వంతెనను అందుబాటులోకి తెస్తుమన్నారు.ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజలకు అందుబాటులోకి తెచ్చినప్పుడే ఫలితం ఉంటుందని మంత్రి దుర్గేష్ వివరించారు. గతంలో 2014 తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించిన అనేక బిల్డింగులకు వైకాపా ప్రభుత్వం కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించిందన్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో రోగులను పలకరించి ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ, కౌన్సిలర్లు, స్థానిక కూటమి నాయకులు, అధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు


