– తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి
విశాలాంధ్ర – రాజానగరం : విద్యార్ధుల్లో అంతర్లీనంగా దాగిన నైపుణ్యాలను,ఆత్మవిశ్వాసాన్ని సైతం ర్యాగింగ్ అనే మహమ్మారి దెబ్బతిస్తుందని ,విద్యార్దులు ర్యాగింగ్ కి పాల్పడవద్దనీ తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు.మండలంలోనీ ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం నందు వర్సిటీ ఉపకులపతి ఆచార్య సత్తుపాటి ప్రసన్నశ్రీ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు జరగనున్న ర్యాగింగ్ వ్యతిరేక వారోత్సవ వేడుకలకు గురువారం ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ప్రశాంతి తొలుత నన్నయ విగ్రహానికి పూలమాలవేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యా సంస్థల్లో ర్యాగింగ్ కు భయపడి విద్యకు దూరమైన విద్యార్థులు అనేక మంది ఉన్నారని, విద్యార్థులు ర్యాగింగ్ జోలికి పోవద్దని ఆనందంగా విద్యాభ్యాసాన్ని పూర్తి చేయాలని
కోరారు.విద్యాలయాల్లో అధ్యాపకుల సమక్షంలో ఏ విధంగా ప్రవర్తిస్తారో బయటకు వెళ్ళిన తరువాత అదే ప్రవర్తనను కలిగి ఉండాలన్నారు. విశ్వవిద్యాలయాల గౌరవం, పేరు ప్రఖ్యాతలు విద్యార్థుల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందన్నారు.సీనియర్ విద్యార్థులు తమ జూనియర్లు పట్ల స్నేహపూర్వకంగా మెలగాలని, జూనియర్ విద్యార్థులకు మార్గనిర్దేశకులుగా సీనియర్లు నిలవాలన్నారు.తాను చదువుకొనే రోజుల్లో ర్యాగింగ్ కు భయపడి సెలవు పెట్టిన సందర్భాలు ఉన్నాయని, అటువంటి పరిస్థితులు ఏ విద్యార్థికి రాకూడదని వ్యక్తిగత సంఘటనలను విద్యార్దులతో పంచుకున్నారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన నన్నయ వర్సిటీ ఉపకులపతి ఆచార్య సత్తుపాటి ప్రసన్నశ్రీ మాట్లాడుతూ ప్రముఖ వ్యక్తులను వర్సిటీకి తీసుకు రావడం ద్వారా విద్యార్థుల కు స్ఫూర్తి కలుగుతుందన్నారు. తమ వర్సిటీ విద్యా నైపుణ్యం పట్ల మాత్రమే కాకుండా గౌరవం,దయ, కరుణతో మెలిగే సంస్కృతి క్యాంపస్ ల ఉండడం ఆనందంగా ఉందన్నారు. ర్యాగింగ్ ఒక వ్యక్తి మనస్సును మచ్చగా మార్చుతుందని , వారి కలలను పూర్తిగా నాశనం చేసే హానికరమైన చర్య అని అభివర్ణించారు.విశ్వవిద్యాలయం యొక్క నిజమైన గుర్తింపు భవనాలలో లేదని, దాని సభ్యులు పంచుకునే సంబంధాలలో ప్రతిబింబమవుతుందని చెప్పారు. దీనిలో భాగంగా స్త్రీశక్తి యాప్, సైబర్ నేరాలపై రాజానగరం ఎస్ఐ పి.నారాయణమ్మ విద్యార్థులకు అవగాహన కల్పించారు.అనంతరం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ని వీసీ ప్రసన్నశ్రీ సన్మానించి నన్నయ జ్ఞాపికను అందజేసి అభినందించారు.విద్యార్థులు కలెక్టర్ ప్రశాంతి, వీసీ ప్రసన్నశ్రీ లతో సెల్ఫీలు దిగారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కె.వి.స్వామి, స్టూడెంట్ ఆఫైర్స్ డీన్ ఆచార్య ఎన్. ఉదయ్ భాస్కర్,
మరియు విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


