రైతుల మధ్య చిచ్చు రేపుతున్న యూరియా కొరత
–
– ప్రైవేటు వ్యాపారులు అదునుగా రైతుల నుంచి దోపిడి
విశాలాంధ్ర – సీతానగరం: రైతుల మధ్య చిచ్చు రేపుతున్న యూరియా కొరత. మండల వ్యాప్తంగా గల 13 సొసైటీల పరిధిలో రైతులకు పూర్తి స్థాయిలో అందని యూరియా ఎరువు. గురువారం మండలంలో రాపాక గ్రామ సొసైటీకి వచ్చిన యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున సొసైటీకి చేరుకొని తమకు యూరియా కావాలని కోరడంతో వచ్చిన కొద్ది మొత్తం యూరియా పై రైతులు వాగ్వివాదం చోటుచేసుకుంది. దీనితో కాసేపు సొసైటీ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మండల మొత్తం మీద సుమారు 4500 ఎకరాల్లో వరి సాగు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనికి అనుగుణంగా అధికారులు ముందస్తుగా రైతులకు యూరియా అందుబాటులో ఉంచక పోవడం వల్లనే ఈ పరిస్థితులు ఏర్పడాయి అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులను ప్రయివేటు వ్యాపారులు ఒకో బస్తా 300 నుండి 400 రూపాయలకు విక్రయిస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని అని రైతులు వాపోతున్నారు. ఈ వ్యాపారులు పై ప్రతీ సంవత్సరo ప్రారంభంలో తూతూ మంత్రం తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు అని దీని వల్ల వ్యాపారులు తాము ఏమిచేసినా అడిగే నాధుడు లేడు అనే చందాన తయారు అయ్యారు అని రైతులు ఆరోపిస్తున్నారు. ఇది ఇలాగ ఉంటే యూరియా రైతులు మాత్రమే కాకుండా సారా వ్యాపారులు సైతం వాడుతున్నారు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా అదికారులు, నాయకులు సత్వరమే యూరియా రైతులకు అందుబాటులోకి తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు ముక్త కంఠంలో కోరుతున్నారు.


