. 22 కేసుల్లో 15మంది ముద్ధాయిలు అరెస్టు
. సత్యనారాయణపురంలో సీసీ కెమెరాలతో నిరంతర నిఘా…
విశాలాంధ్ర-విజయవాడ(క్రైం): నగరంలోని సత్యనారాయణపురం పోలీస్టేషన్ పరిధిలో ఈ ఏడాది ఇప్పటివరకు చోరీకి గురైన ద్విచక్ర వాహనాలను సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు ఆదేశాల మేరకు ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణ సూచనలతో నార్త్ ఏ.సి.పి. స్రవంతి రాయ్ పర్యవేక్షణలో , క్రైమ్ సిబ్బందితో కలిసి ద్విచక్ర వాహన దొంగతనాలపై ప్రత్యేక దృష్టిసారించారు. ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన పోలీసు స్టేషన్ పరిధిలో సీసీటీవీ ఫుటేజీలను ఆధారంగా చేసుకుని అనుమానితుల కదలికలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివారం ఇద్దరు ద్విచక్ర వాహనాలను దొంగతనానికి పాల్పడినట్లు పక్కా సమాచారం రావడంతో సత్యనారాయణపురం స్టేషన్ సర్కిల్ ఇన్స్ప్పెక్టర్ ఎస్వివి లక్ష్మీనారాయణ సిబ్భందితో కలిసి బాలురులను అదుపులోకి తీసుకుని వాహనానాలు స్వాధీనం చేసుకున్నారు.
సాంకేతిక పరిజ్ఞానంతో ఫలితాలు…
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని గట్టి బందోబస్తుతో పాటు నిఘా ఏర్పాట్లును నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. స్టేషన్ పరిధిలో ఈ సంవత్సరం 30 బైక్ కేసులు నమోదు అయ్యాయని, ఈ 30 కేసుల్లో మొత్తం 39 బైకులు చోరీకి గురవటంతో ప్రత్యేక దృష్టి సారించి విజయవాడ సిటీ కమాండ్ అండ్ కంట్రోల్ ఏర్పాటుచేసిన కెమెరాలు, డ్రోన్ల పహారా, స్టేషన్ లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మినీ కమాండ్ అండ్ కంట్రోల్ రూంలో ఉన్న వీడియో సర్వైలెన్స్ ద్వారా ద్విచక్ర వాహనాల దొంగలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. సీసీ కెమెరాలు ద్వారా 22 కేసులను ఛేదించి, సుమారు 32 బైక్ లను రికవరీ చేయడం జరిగిందని తెలిపారు.
సీసీ కెమెరాలు
స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ , పూర్ణానందంపేట, ఖుద్దూస్ నగర్, గాంధీనగర్, గాంధీనగర్ లోని అన్ని సినిమా హాల్స్ ఉండే ప్రాంతాల్లో ని రోడ్లు, సాంబమూర్తి రోడ్డు, బి ఆర్ టి ఎస్ రోడ్, గవర్నమెంట్ ప్రెస్, అంబేద్కర్ కాలనీ బావాజి పేట,శ్రీనగర్ కాలనీ,లక్ష్మీ నగర్ కాలనీ, ముత్యాలంపాడు, పసుపు తోట ఏరియాలలో ఏర్పాటుచేసిన కెమెరా ద్వారా ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ ప్రాంతాల్లో ఎటువంటి చోరీలు అసాంఘిక కార్యకలాపాలు జరిగినా వెంటనే పసిగట్టగలిగే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్టేషన్ పరిధిలో అన్ని ప్రాంతాల్లోనూ గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.. అసాంఘిక కార్యకలాపాలు, చోరీలు చేసే వారిపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నామని,. నేరస్తులను వెంటనే పట్టుకునేందుకు వీలుగా చర్యలు చేపట్టామన్నారు. ఎవరైనా తమ స్టేషన్ ప్రాంత పరిధిలో నేరాలు చేయడానికి పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


