ఇటీవల కత్తిపోట్లకు గురై కోలుకుంటున్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కు మరో భారీ షాక్ తగిలింది. సైఫ్ కుటుంబానికి చెందిన రూ. 15 వేల కోట్ల విలువైన ఆస్తులు మధ్యప్రదేశ్ ప్రభుత్వం అధీనంలోకి వెళ్లబోతున్నాయి. ఈ ఆస్తులు భోపాల్ లో ఉన్నాయి. వివరాల్లోకి వెళితే… సైఫ్ అలీ ఖాన్ రాజవంశీయుల కుటుంబానికి చెందిన వ్యక్తి అనే విషయం తెలిసిందే. వీరిది పటౌడీ రాజవంశీయుల కుటుంబం. సైఫ్ ముత్తమ్మమ్మ అబీదా సుల్తాన్ 1947లో భారతదేశ విభజన జరిగినప్పుడు తన ఆస్తులను ఇక్కడే వదిలేసి పాకిస్థాన్ కు వెళ్లిపోయారు. ఆ సమయంలో ఎవరైతే దేశాన్ని వదిలి పాకిస్థాన్ కు వెళ్లిపోయారో… వారి ఆస్తులు ఃఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ 1968ః కిందకు వస్తాయని అప్పటి భారత ప్రభుత్వం ప్రకటించింది. అప్పుడు అబీదా వదిలి వెళ్లిన ఆస్తుల విలువ ఇప్పుడు అక్షరాలా రూ. 15 వేల కోట్లు. 2014లో సైఫ్ కు ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. ఆ ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీగా ప్రకటిస్తూ ఎనిమీ ప్రాపర్టీ డిపార్ట్ మెంట్ నోటీసులు జారీ చేసింది. ఃఎనిమీ చట్టంః ప్రకారం ఈ ఆస్తి మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి చెందుతుంది. కానీ, సైఫ్ మాత్రం అది తమ వారసత్వపు ఆస్తి అని… అది తమకు చెందుతుందని మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ ఆస్తిపై సర్వహక్కులు తనకు ఉన్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు. పిటిషన్ ను విచారించిన హైకోర్టు అప్పట్లో స్టే విధించింది. అయితే 2024 డిసెంబర్ 13న ఆ స్టేను ఎత్తివేసింది. సైఫ్ పిటిషన్ ను కొట్టివేసింది. అయితే, 30 రోజుల్లోగా తమ తీర్పుపై అప్పీలేట్ ట్రైబ్యునల్ లో అప్పీల్ చేసుకోవచ్చని హైకోర్టు వెసులుబాటు కల్పించింది. అయితే, కోర్టు ఉత్తర్వులపై సైఫ్ కుటుంబ సభ్యులు ఎవరూ స్పందించలేదు. దీంతో, రూ. 15 వేల కోట్ల ఆస్తి మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి దక్కబోతోంది. ఆ ఆస్తులను స్వాధీనం చేసుకునే పనులను మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించినట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును సైఫ్ ఆశ్రయిస్తారా? లేక ఆస్తిని వదిలేస్తారా? అనేది వేచి చూడాలి.
సైఫ్ కుటుంబానికి చెందిన రూ. 15 వేల కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకోబోతున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం
RELATED ARTICLES