– సంప్రదాయ నాట్య, తోలుబొమ్మలాట ప్రదర్శనలతో కళకళలాడిన ధర్మవరం కాలేజ్ గ్రౌండ్
విశాలాంధ్ర ధర్మవరం; సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ కాలేజ్ గ్రౌండ్‌లో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు కార్యక్రమం సంప్రదాయ నాట్య ప్రదర్శనలు, తోలుబొమ్మలాట ప్రదర్శనలు, రైతుల జీవితాన్ని ప్రతిబింబించే నృత్యాలతో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ హాజరై, సంప్రదాయ కళలకు ప్రోత్సాహం అందించారు. నాట్య ప్రదర్శనలు, తోలుబొమ్మలాట ప్రదర్శనలను మంత్రి ఆసక్తిగా, తీక్షణంగా వీక్షించారు. మానసా నృత్య కళానికేతన్ వారి ఆధ్వర్యంలో వినాయక సాంగ్, భస్మాసుర నృత్యం, మహిషాసుర మర్ధిని వంటి పలు అద్భుతమైన సంప్రదాయ నాట్య ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అదేవిధంగా శ్రీలక్ష్మి చెన్నకేశవ సొసైటీ వారి ఆధ్వర్యంలో భక్తి గీతాలు, సుందరకాండ ఇతివృత్తంతో రూపొందించిన తోలుబొమ్మలాట ప్రదర్శనలు ప్రేక్షకులను ఆధ్యాత్మికంగా అలరించాయి. ఇదే సందర్భంలో చందు డాన్స్ గ్రూప్ వారి ఆధ్వర్యంలో వినాయక సాంగ్‌కు నృత్యం, అలాగే రైతుల జీవితం, వారి కష్టాలను ప్రతిబింబించే పాటకు ప్రత్యేక నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ నృత్యాలు ప్రేక్షకుల హృదయాలను తాకగా, మంత్రి సత్య కుమార్ యాదవ్ కూడా ఈ ప్రదర్శనలను ఆసక్తిగా వీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ మన భారతీయ సంప్రదాయ కళలు, నృత్యాలు, తోలుబొమ్మలాట వంటి ప్రజా కళారూపాలు మన సంస్కృతికి ప్రాణం. నేటి యువత ఈ కళలను తెలుసుకుని, నేర్చుకుని, భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిదీ అని తెలిపారు. ప్రభుత్వం సంప్రదాయ కళాకారులను ప్రోత్సహించేందుకు ఎల్లప్పుడూ ముందుంటుంది అని అన్నారు.కళాకారుల ప్రతిభను అభినందిస్తూ, నాట్య ప్రదర్శనలు మరియు తోలుబొమ్మలాట ప్రదర్శనలు చేసిన కళాకారులకు మంత్రి సత్య కుమార్ యాదవ్ మొమెంటోలు బహుమతిగా అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా కళాకారుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది.ఈ కార్యక్రమం ద్వారా ధర్మవరం పట్టణంలో సంక్రాంతి పండుగ వాతావరణం మరింత ఉత్సాహభరితంగా, సంప్రదాయ వైభవంతో అత్యంత ఉత్సాహభరితంగా ఈ వేడుకలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
ధర్మవరం పట్టణంలో సంక్రాంతి సంబరాలు
- Advertisement -
RELATED ARTICLES


