విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం డివిజన్లోని రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నేకొత్తపల్లి గ్రామానికి చెందిన శివమ్మ జీవితం అనేక కష్టాలతో జీవనం కొనసాగిస్తూ ఉంది. వెంకట తిమ్మాపురానికి చెందిన సాకే రామాంజనేయులు, వృత్తిరీత్యా న్యాయవాదిగా పనిచేస్తున్న వ్యక్తితో ఆమెకు వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.అయితే భార్యపై అనుమానాలు పెంచుకున్న భర్త, ఆమెను చాలా కాలంగా మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది. ఈ వేధింపులను తట్టుకోలేక శివమ్మ గత ఏడాది నుంచి తన ముగ్గురు పిల్లలతో కలిసి చెన్నేకొత్తపల్లిలోని పుట్టింట్లో ఆశ్రయం పొందుతూ జీవిస్తోంది.పిల్లలకు మంచి చదువు అందించాలనే ఉద్దేశంతో గతంలో ధర్మవరంలోని సాధన ప్రైవేట్ పాఠశాలలో చదివించేది, కానీ ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో వారిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ల కోసం పాఠశాలకు వెళ్లిన సమయంలో, భర్త సాకే రామాంజనేయులు అక్కడికి వచ్చి ఆమెపై దాడి చేసి, మెడలో ఉన్న మంగళసూత్రం, బంగారు గొలుసును లాక్కెళ్లాడని బాధితురాలు ఆరోపిస్తోంది.
న్యాయాన్ని కాపాడాల్సిన వృత్తిలో ఉన్న సాకే రామాంజనేయులు ఇటువంటి చర్యలకు ఉపక్రమించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చట్టాన్ని గౌరవించి, న్యాయాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఉన్న న్యాయవాదిపై ఇలాంటి ఆరోపణలు రావడం బాధాకరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఒకవైపు భర్త వేధింపులు, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా పిల్లల చదువు కోసం పోరాడుతున్న శివమ్మకు న్యాయం జరగాలని స్థానికులు కుటుంబ సభ్యులు లే కాక స్థానికులు కోరుకుంటున్నారు. ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలికితీసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
భర్త వేధింపులకు బలవుతున్న శివమ్మ..
- Advertisement -
RELATED ARTICLES


