నేడు గుంటూరులో అంతిమయాత్ర
విశాలాంధ్ర – గుంటూరు కలెక్టరేట్ : సీపీఐ సీనియర్ నాయకులు, విద్యార్థి, యువజనోద్యమ మాజీ నేత బొప్పూడి స్టాలిన్ బాబు (78) శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యతో బాధపడుతున్న విషయం విదితమే. స్వాతంత్య్ర సమరయోధుడు బొప్పూడి కోటయ్య కుమారుడు స్టాలిన్ బాబు. గుంటూరు ఏసీ కళాశాలలో బీఏ చదివి, 1968లో కొడాలి మరుద్వతిని వివాహమాడారు. వీరికి మధుభారతి, కవిత ఇద్దరు కుమార్తెలు. స్టాలిన్ విద్యార్థి దశ నుంచే ఏఐఎస్‌ఎఫ్‌లో చురుకైన పాత్ర పోషించారు. సీపీఐ నాయకులు డాంగే, మీనాజ్ కర్, పెరవలి కృష్ణయ్య, సుధాకర్ రెడ్డి, నారాయణకు అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. వీరు అనేక దశాబ్దాలుగా కమ్యూనిస్టు పార్టీతో ఎంతో అనుబంధం కలిగి ఉండి వివిధ కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషించారు. 1970లో గుంటూరులో జరిగిన ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) సదస్సును విజయవంతంగా నిర్వహించారు. సీపీఐ అగ్ర నేత చండ్ర రాజేశ్వరరావుతో వీరికి బలమైన అనుబంధం ఉంది. కనపర్తి నాగయ్య, వల్లూరు గంగాధరరావు, మల్లయ్యలింగం, వేములపల్లి శ్రీకృష్ణ వంటి ఆనాటి ప్రముఖ నాయకులతో కలిసి ఆయన పని చేశారు. 1975లో విజయవాడలో జరిగిన సీపీఐ 10వ జాతీయ మహాసభల్లో జనసేవా దళ్ రాష్ట్ర ఉప కమాండర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఏఐవైఎఫ్ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులుగా, ఏఐఎస్‌ఎఫ్ నాయకునిగా జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎన్నో పోరాటాలు నిర్వహించారు. కొన్ని వేల మంది విద్యార్థి, యువజన నాయకులకు 70వ దశకంలో మార్గదర్శిగా ఉన్నారు. సీపీఐ జాతీయ నాయకులు కె.నారాయణ, రాష్ట్ర నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు ఎంతో మంది ఆయన శిష్యులుగా ఎదిగి సీపీఐ ఉద్యమంలో కొనసాగుతున్నారు. ఆల్ ఇండియా ఎల్‌ఐసీ ఏజెంట్స్ అసోసియేషన్ సెక్రటరీ కూడా స్టాలిన్ బాబు పని చేశారు. స్టాలిన్ బాబు భార్య మరుద్వతి శ్రీవెంకటేశ్వర బాల కుటీర్ వారి అనుబంధ సంస్థ చేతన ఛారిటబుల్ ట్రస్ట్ కార్యనిర్వహకురాలిగా ఎన్నో వసంతాలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. స్టాలిన్ బాబు కళ్లను పెదకాకానిలోని శంకర్ కంటి ఆసుపత్రికి దానం చేశారు. శనివారం ఉదయం పది గంటలకు గుంటూరు శ్యామలనగర్ 7వ లైనులోని వారి స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుందని, స్తంభాలగరువులోని స్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.


