–హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరిక
అర్ధరాత్రి హోటళ్లు, రెస్టారెంట్ల వద్ద సెటిల్‌మెంట్లు, కుటుంబ తగాదాలు, భూ వివాదాల్లో తలదూర్చి బెదిరింపులకు పాల్పడుతున్న వారి భారతం పడతామని సిపి సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. హద్దులు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బిహార్, యూపీ నుంచి ఆయుధాలు కొనుగోలు చేసి ప్రత్యర్థులకు సవాళ్లు… ఇదీ శివారు ప్రాంతాల్లోని రౌడీషీటర్ల జులుం. కొందరు వ్యభిచార గృహాలు, జూద స్థావరాలు, డ్రగ్స్ దందాలు దర్జాగా నిర్వహిస్తున్నారు. సైబరాబాద్ పరిధిలోని పాత నేరస్థులు పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు బోరబండ, రహ్మత్‌నగర్, చాంద్రాయణగుట్ట, బండ్లగూడ, ఫలక్‌నుమా ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నారు. భవానీనగర్‌లో రౌడీషీటర్ల మధ్య ఆధిపత్య పోరు హత్యకు దారితీసింది. వరుస ఘటనలతో రౌడీషీటర్లపై నిఘా పెంచాలని సీపీ సజ్జనార్ ఆదేశించారు. హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు డీసీపీలు సిద్ధమయ్యారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న రౌడీషీటర్ల జాబితా రూపొందించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నాలుగు పోలీసు కమిషనరేట్ల పరిధిలో నగరంలో 2వేల వరకు రౌడీషీటర్లున్నారు. నగరంలో కరడుగట్టిన 70 మంది రౌడీషీటర్లలో 10 మంది ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరిలో ఒకరిద్దరు విదేశాలకు చేరినట్టు, కొందరు బీదర్‌లో ఉంటూ ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నట్టు సమాచారం. వీరిని గుర్తించేందుకు ఆకస్మిక తనిఖీలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. రౌడీషీటర్లు, పాతనేరస్థులు నేరాల్లో భాగం పంచుకున్నట్టు గుర్తిస్తే ఎస్‌హెచ్‌వోలపై చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం.నగరం, శివారులో పలు హోటళ్లు, పాన్‌దుకాణాలు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్టు సీపీ సజ్జనార్ గుర్తించారు. ఇటీవల పలు ప్రాంతాల్లో పర్యటించిన సీపీ అర్ధరాత్రి దాటాక తెరచి ఉంచిన హోటల్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కొన్ని పోలీస్‌స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలు చూసీచూడనట్టు వదిలేయటంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. చాంద్రాయణగుట్ట సమీపంలోని హోటల్‌లో ఇటీవల యువకులు గొడవపడినట్టు సమాచారం. రాత్రి విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటున్న ముగ్గురు ఇన్‌స్పెక్టర్లపై సీపీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.


