
….ఎంపీ పురంధరేశ్వరి
విశాలాంధ్ర – దేవరపల్లి : విద్యార్థులు తల్లిదండ్రుల త్యాగాలు, ఆశయాల అనుగుణంగా వ్యవహరించి జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని అప్పుడే భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు ఇమిడింపబడతాయని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. దేవరపల్లిలో ఆనందం ఎడ్యుకేషనల్ జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ విద్యార్థులు కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అని పిలుపునిస్తూ ప్రతి విద్యార్థి విద్యలో క్రమశిక్షణ అలవర్చుకొని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ విద్యార్థుల పైనే ఉందని, ప్రతి విద్యార్థి కృషి పట్టుదలతో చదివి దేశానికి మీ జన్మస్థానానికి, గురువులకు, తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని అన్నారు. భారతదేశాన్ని విశ్వ గురువుగా తీర్చటానికి మీ పాత్ర ఎంతో అవసరమని ఆమె అన్నారు. ముఖ్యంగా భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం నాలుగవ స్థానంలో ఉందని, త్వరలో మూడవ స్థానంలోకి వస్తుంది అన్నారు. గత పది సంవత్సరాల క్రితం భారతదేశం ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానంలో ఉందని ఆమె గుర్తు చేశారు. భారత ప్రధానమంత్రి భారత దేశ ప్రజలకు ముఖ్యంగా బడుగు బలహీన వర్గ ప్రజలకు రైతులకు వారి కొనుగోలు శక్తి పెరగటానికి ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచడానికి దసరా కానుకగా జిఎస్టి ని 18 శాతం ను ఐదు శాతానికి తగ్గించారని ఆమె అన్నారు. జిఎస్టి తగ్గింపు వలన 36 రకాల వస్తువుల పై ధరలు తగ్గాయని అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆరోగ్య పరిరక్షణకు మందులు రేట్లు ముఖ్యంగా ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటి మందులకు జీఎస్టీ రేట్లు తగ్గటం వలన వారికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. సోలార్ విద్యుత్ పై కూడా జిఎస్టి తగ్గటం వలన సోలార్ విద్యుత్తు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఇదేవిధంగా ఇన్సూరెన్స్ లో కూడా జిఎస్టి తగ్గింపు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఇటీవల ప్రపంచంలో జరుగుతున్న కొన్ని పరిణామాల వలన అమెరికా దేశం భారతదేశంపై కొన్ని ఆంక్షలు విధించిందని ఆమె అన్నారు. ప్రపంచ దేశాల ఆంక్షలు నుండి మనం పరిరక్షించుకోవడానికి మన దేశంలో తయారైన ఉత్పత్తులను వినియోగించాలని ఆమె పిలుపునిచ్చారు. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలను విద్యార్థులు ఎప్పటికప్పుడు గుర్తించి అనుగుణంగా వ్యవహరించాలని ఆమె అన్నారు. ప్రతి విద్యార్థి సామాజిక స్పృహ కలిగి దేశానికి గ్రామానికి, తల్లిదండ్రులకు ఉపయోగపడాలని అన్నారు. దేవరపల్లిలో గత 32 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన కళాశాల అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రస్తుతం విద్యార్థులకు అనేక మౌలిక సదుపాయాలు కల్పిస్తూ విద్యా ప్రమాణాలు పెంపొందించడానికి కృషి చేస్తున్న కళాశాల వ్యవస్థాపకుడు దొడ్డికర్ల సువర్ణ రాజును ఎంపీ పురందేశ్వరి అభినందించారు ఈ సందర్భంగా విద్యలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అధ్యాపకులకు జ్ఞాపికలు, మెమెంటోలు అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా బిజెపి జిల్లా అధ్యక్షుడు విక్కీ నాగేంద్ర మాట్లాడుతూ విద్యార్థులు కలలుకని సహకారం పొందాలని ముఖ్యంగా మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని విద్యలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. కళాశాల కరస్పాండెంట్ వ్యవస్థాపకుడు డి సువర్ణ రాజు మాట్లాడుతూ 1994లో మెట్ట ప్రాంతమైన దేవరపల్లిలో డిగ్రీ అండ్ పీజీ కళాశాలను ఏర్పాటు చేసి అంచెలంచెలుగా 2017లో జూనియర్ అండ్ ఒకేషనల్ కోర్సులు తీసుకురావడం జరిగిందని అన్నారు 1994లో కళాశాల ప్రారంభంలో కేవలం 24 మందితో కళాశాల ప్రారంభించామని ప్రస్తుతం 1600 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. 32 సంవత్సరాల లో 14,000 మంది విద్యార్థులు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడ్డారని గుర్తు చేశారు. రైతులు వివిధ గ్రామాల ప్రజలు, రాజకీయ నాయకులు, సామాజిక వేత్తల సహకారంతో కళాశాల అభివృద్ధి చెందిందని వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. దేవరపల్లి మాజీ ఎంపీపీ మురళి అజిత్ కుమార్ మాట్లాడుతూ మెట్ట ప్రాంతంలో సువర్ణ రాజు కళాశాలను ప్రారంభించి ఈ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకు ఉన్నత విద్యను అందించటానికి కృషి చేస్తున్నారని అన్నారు. పొగాకు పంటపై గత సంవత్సరం ఎంపీ పురందేశ్వరి కృషి వలన చెస్ కేంద్ర ప్రభుత్వం తగ్గించిందని ఈ సంవత్సరం కూడా పురందేశ్వరి సహకారం అందించాలని అన్నారు. అనంతరం రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరిని ఘనంగా సత్కరించి జ్ఞాపికలను కళాశాల చైర్మన్ డి మేరీ కమల, కరస్పాండెంట్ సువర్ణ రాజు, అధ్యాపకులు ఏవో ఆనంద ప్రసాద్ జ్ఞాపికలు అందజేశారు. అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకురాలు ముద్రగడ క్రాంతి, దేవరపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆండ్రు అనిల్, గోపాలపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొర్లపాటి రాము, దేవరపల్లి సొసైటీ అధ్యక్షుడు ఉప్పులూరి రామారావు, సుంకర దుర్గారావు, యాగంటి సాయిబాబా, బల్ల సూర్య, కాటు భీమరాజు, ఓరుగంటి లక్ష్మీపతి రాజు , కాకర్ల రామ తులసి, బలుసు సత్యనారాయణ, జనసేన నేతలు కంబాల సత్తిబాబు, పసుపులేటి శివ నాగ ప్రసాద్, సూరిశెట్టి బాలు, మాధవరపు వెంకటేశ్వరరావు, అడబాల మణికంఠ, పోసిన గణపతి , అచ్యుత సత్యనారాయణ , బల్ల రాము, ద్వారకాతిరుమల మండల జనసేన పార్టీ అధ్యక్షుడు దాకారపు నరసింహమూర్తి, బిజెపి నాయకులు దున్న సుమన్ బాబు, శెట్టిపల్లి శివ నాగరాజు, దేవరపల్లి మండల బిజెపి అధ్యక్షుడు కోలా రామకృష్ణ, గళ్ళ శ్రీను, మండా జనార్ధన రావు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బి డి ఎన్ కుమార్ , జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం విక్రమ్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినిలు, విద్యార్థులు, గోపాలపురం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన కూటమి నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. అనంతరం కళాశాల విద్యార్థులు, విద్యార్థినిలు నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి.


