పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు.
ఇరాన్‌తో కాల్పుల విరమణ పొడిగింపు, అలాగే హర్మూజ్ జలసంధిలో దిగ్బంధనాన్ని ఎత్తివేయడానికి సంబంధించిన తాత్కాలిక ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయకపోవడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగే పరిస్థితి నెలకొంది. ఇరాన్‌తో కుదరబోయే తాత్కాలిక ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకునేందుకు ట్రంప్ శ్వేతసౌధంలోని సిచ్యువేషన్ రూమ్‌లో తన సలహాదారులతో సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించినప్పటికీ, ఎలాంటి స్పష్టమైన పురోగతి సాధించలేకపోయారు.
అమెరికాతో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి
చివరకు ట్రంప్ ఆ ఒప్పందంపై సంతకం చేయకుండానే సమావేశం ముగించారు.
ఈ పరిణామాలపై స్పందించిన వైట్‌హౌస్ అధికారి, ఇరాన్‌తో కుదిరే ఏ ఒప్పందమైనా అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని ట్రంప్ భావిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా టెహ్రాన్‌పై విధించనున్న ఆంక్షలు, నిబంధనల విషయంలో అధ్యక్షుడు పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాతే ఒప్పందంపై సంతకం చేస్తారని చెప్పారు. అలాగే ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను కలిగి ఉండకూడదనే అమెరికా వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. మరోవైపు ఒప్పందానికి సంబంధించి అమెరికాతో చర్చలు కొనసాగుతున్నాయని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తెలిపారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి తుది ఒప్పందం ఖరారు కాలేదని ఆయన పేర్కొన్నారు.
ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం
ఇదే సమయంలో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే ఇరాన్‌తో యుద్ధాన్ని మళ్లీ ప్రారంభించే సామర్థ్యం అమెరికాకు ఉందని ఆయన అన్నారు. తమ ఆయుధ నిల్వలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా అమెరికా సెంట్రల్ కమాండ్ కూడా పశ్చిమాసియాలో తమ దళాలు అప్రమత్తంగా ఉన్నాయని వెల్లడిస్తూ కీలక సందేశాన్ని విడుదల చేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఎప్పుడైనా పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.


