పట్ట నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం ఆదుకుంటుంది.
విశాలాంధ్ర – కడియం : మొంథా తుఫాన్ వలన వరిపంట నష్టపోయిన ప్రతి రైతుని ప్రభుత్వం ఆదుకుంటుందని టిడిపి వైద్య విభాగ కార్యదర్శి గోరంట్ల రవిరాం కిరణ్ అన్నారు. మంగళవారం రాత్రి సంభవించిన ఈదురుగాలులకు కడియం ఆవలో నేలకొరిగిన వరి పొలాలను బుధవారం ఉదయం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో రెండు రోజులపాటు వాన కురిసే అవకాశం ఉందని, పంట నష్టం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. పంట నష్టాన్ని పూర్తిగా అంచనా వేసి, ప్రభుత్వం నుంచి ప్రకటించే నష్టపరిహారాన్ని అందరికీ అందేవిధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సాధ్యమైనంత వరకు తుఫాను నష్టాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలిపారు. తుఫాను కారణంగా నిరాశ్రయులైన వారికి పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి భోజనాలు సమకూర్చిన స్థానిక నాయకులకు, అధికారులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సునీల్ కుమార్, ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్య ప్రసాద్, ఉపసర్పంచ్ వెలుగుబంటి నాని, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


