-108 నూతన వాహనం ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల
విశాలాంధ్ర – రాజానగరం : పేదల ఆరోగ్య సంరక్షణే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామ కృష్ణ అన్నారు.భవ్య హెల్త్ సర్వీస్ సంస్థ సారధ్యంలో సుమారు 40లక్షల వ్యయంతో అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ (ఏఎల్ఎస్) ఆధునిక సాంకేతికత వైద్య పరికరాలతో స్తానిక ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ చొరవతో ఏపీ ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన 108 వాహనాన్ని ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ సోమవారం సాయంత్రం ప్రారంభించారు.మండల కేంద్రమైన రాజానగరంలోనీ ఎంపిడివో కార్యాలయం ప్రాంగణంలో పచ్చజెండ ఊపి 108 వాహనాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా వాహనాన్ని నడిపి అందరిలో జోష్ నింపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. సీతానగరం మండలంలో 108 వాహనం అవశ్యకత ఉందని, సంబంధిత అధికారులు ఆ మేరకు దృష్టి సారించి ప్రజలకు సేవలందించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల బారిన పడ్డవారిని,ఆపదలో ఉన్నవారిని, క్షతగాత్రులను ,రోగులను,అత్యవసర వైద్య సేవలు నిమిత్తం 108 ద్వారా ఆసుపత్రికి చేరవేస్తున్న సిబ్బంది సేవలను కొనియాడారు. ధన్యవాదాలు తెలిపారు.108 సంస్థ తూర్పు గోదావరి జిల్లా మేనేజర్ దాసరి రాజు, ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ జిల్లా హెడ్ పి.కపిల్ మాట్లాడుతూ భవ్య హెల్త్ సర్వీసు లిమిటెడ్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా సుమారు 198 వాహనాలు మంజూరు చేయగా, తూర్పు గోదావరి జిల్లాకు ఆరు వాహనాలు కేటాయించినట్లు చెప్పారు. వాటిలో రాజమహేంద్రవరం,రాజానగరం,కొవ్వూరు, దేవరపల్లి మండలాలకు ఇప్పటికే 108 వాహనాలు అందించామన్నారు.రాజానగరం నియోజకవర్గంలో సీతానగరం,కోరుకొండ మండలాలకు త్వరలో వాహనాలు సమకూరుస్తామని హామీ ఇచ్చారు. స్తానిక ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ కృషితో పాత వాహనం బదులు నూతన వాహనం మంజూరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో జె.ఏ.ఝాన్సీరాణి, తహశీల్దార్ జి.అనంత లక్ష్మీ సత్యవతి దేవి, ఎంఎస్వో గొలుగూరి బాపిరాజు, 108 సిబ్బంది నాతిపం శ్రీనివాస్, అబ్దుల్లా, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


