4 వ నెంబర్ పై తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి
విశాలాంధ్ర , కళ్యాణదుర్గం.. న్యాయవాదుల సంక్షేమం, హక్కుల పరిరక్షణే ధ్యేయంగా పోరాడతామని బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అభ్యర్థి, ఐఏఎల్ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అధ్యక్షులు చలసాని అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఫిబ్రవరి 13న రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న బార్ కౌన్సిల్ ఎన్నికల్లో తనకు తొలి ప్రాధాన్యత ఓటు వేసి కౌన్సిల్ సభ్యుడిగా గెలిపించాలని ఆయన న్యాయవాదులను కోరారు. ఈ సందర్భంగా గురువారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం బార్ అసోసియేషన్ పరిధిలో న్యాయవాదులతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 40,000 మంది న్యాయవాదులు 27 మంది సభ్యులను ఎన్నుకోనున్నారని, అందులో ఏడుగురు మహిళా సభ్యులు ఉండనున్నట్లు తెలిపారు. మొత్తం 143 మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఈ ఎన్నికల్లో న్యాయవాదుల హక్కుల కోసం నిజాయితీగా పోరాడే వారికే తొలి ప్రాధాన్యత ఓటు వేయాలని పిలుపునిచ్చారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులు ఆందోళనకరమని, వారి భద్రత, రక్షణ కోసం ప్రత్యేక చట్టం అవసరమని ఆయన డిమాండ్ చేశారు. లైబ్రరీ సదుపాయాల కొరత, గదుల సమస్య, న్యాయమూర్తుల కొరత, పెండింగ్ కేసుల భారం వంటి సమస్యలతో న్యాయవాదులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. న్యాయవాదులకు హెల్త్ ఇన్సూరెన్స్, హౌసింగ్ స్కీమ్, కుటుంబ సభ్యుల పరిరక్షణ వంటి అంశాలపై గతంలో కార్యాచరణతో నిరూపించామని, భవిష్యత్తులో కూడా న్యాయవాదుల వెన్నంటే ఉంటామని అజయ్ కుమార్ భరోసా ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఐఏఎల్ మాజీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ.రవీంద్రనాథ్, ఐఏఎల్ జిల్లా అధ్యక్షుడు రసూల్, జిల్లా కార్యదర్శి ఎం.వేణుగోపాల్, జిల్లా ఉపాధ్యక్షులు కరణం తిప్పేస్వామి, కార్యవర్గ సభ్యులు ఎం.డి.సంజీవప్ప, సభ్యులు మల్లికార్జున, రమేష్, న్యాయవాదులు హరి చక్రవర్తి, ఎర్రిస్వామి, పట్టాభి తదితరులు పాల్గొన్నారు.


