Homeజిల్లాలుఅనంతపురంవేపరాళ్ళ చెరువులో మట్టి మాఫియా పంజా..

వేపరాళ్ళ చెరువులో మట్టి మాఫియా పంజా..

- Advertisement -

మట్టి మాఫియా లో వైసీపీ టీడీపీ నేతల కుమ్మక్కు?

అధికారుల సహకారంతో కోట్ల రూపాయల దోపిడీ….?

విశాలంద్ర -రాయదుర్గం: రాయదుర్గం మండలం వేపరాళ్ళ గ్రామంలోని చెరువును ప్రభుత్వ అనుమతులు లేకుండా యథేచ్ఛగా తవ్వుతూ, ప్రతిరోజూ వందలాది ట్రిప్పుల మట్టిని కర్ణాటక రాష్ట్రం మొలకల్మూరు ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్న ఘటనపై బహుజన సమాజ్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అక్రమ మట్టి తవ్వకాల ద్వారా ప్రతిరోజూ లక్షల రూపాయలు, మొత్తంగా కోట్ల రూపాయల ప్రజాధనం దోచుకుంటున్నారని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి, రాయలసీమ జోనల్ కన్వీనర్ చిందనూరు నాగరాజు ఆరోపించారు. ఈ అక్రమ మట్టి దందా వెనుక వైసీపీకి చెందిన నాయకులు మట్టి తవ్వకాలను నిర్వహిస్తుండగా, తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు డబ్బుల వసూలు, వ్యవహార నిర్వహణ చేపడుతున్నారనే సమాచారం కలకలం రేపుతోందన్నారు. రాజకీయంగా పరస్పర ప్రత్యర్థులమని చెప్పుకునే వైసీపీ టీడీపీ నేతలు అక్రమ సంపాదన కోసం రాజ్యాంగం, చట్టాలు, నైతికతను తుంగలో తొక్కి కలిసి పనిచేస్తుండటం అత్యంత ఆందోళనకరమన్నారు. ఇది కేవలం రాజకీయ అక్రమమే కాకుండా ప్రభుత్వ భూముల దోపిడీ, పర్యావరణ నాశనం, చిన్నతరహా నీటిపారుదల వనరుల ధ్వంసం, రాష్ట్ర ఆదాయానికి గండివంటివి కలిగించే తీవ్రమైన నేరాలకు సమానమని పేర్కొన్నారు. అయినప్పటికీ రెవెన్యూ, పోలీసు, చిన్నతరహా నీటిపారుదల శాఖలకు చెందిన కొందరు అధికారులు చట్టబద్ధమైన చర్యలు తీసుకోకుండా ఈ అక్రమ దందాకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు ప్రజల నుంచి వస్తున్నాయన్నారు. స్థానికంగానే కాక జిల్లా స్థాయి ఉన్నతాధికారులు కూడా పట్టించుకోకపోవడం పట్ల అనేక అనుమానాలకు తావిస్తోందని, . వేపరాళ్ళ చెరువులో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు, తరలింపులను తక్షణమే నిలిపివేయాలని బీఎస్పీ డిమాండ్ చేసింది. ఈ అక్రమ దందాలో పాల్గొన్న రాజకీయ నాయకులు, సహకరించిన అధికారులు, మౌనం పాటిస్తున్న ఉన్నతాధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, అవసరమైతే న్యాయపోరాటానికి కూడా వెనుకాడబోమని చిందనూరు నాగరాజు హెచ్చరించారు. అక్రమ మట్టి దందాలను అడ్డుకునేందుకు రాబోయే రోజుల్లో ప్రజా ఉద్యమాలు, ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. ప్రజాధనం, సహజ వనరుల దోపిడీని బీఎస్పీ ఎట్టి పరిస్థితుల్లో సహించదని ఆయన తేల్చిచెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు