సహకరించిన అందరికీ వనజాక్షి ధన్యవాదాలు…..
విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) :- మండలంలో నిర్వహించిన ఓటరు సర్వే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా గూగూడు కుళ్లాయస్వామి టెంపుల్ డైరెక్టర్, తెలుగుదేశం పార్టీ మహిళా సీనియర్ నాయకురాలు పొన్నతోట వనజాక్షి హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల వ్యాప్తంగా సర్వే కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు అహర్నిశలు శ్రమించిన ప్రతి బూత్ స్థాయి అధికారి సేవలు ప్రశంసనీయమని అన్నారు. నకిలీ ఓటర్లకు తావులేకుండా పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేసి, నార్పల మండలానికి మంచి గుర్తింపు తీసుకొచ్చిన స్పెషల్ ఆఫీసర్ శ్రీమతి ఓబులమ్మ, తహసీల్దార్, ఎంపీడీఓలను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.
అలాగే సర్వే కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసే ఓటరు జాబితా సర్వే వంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించడం అభినందనీయమని వనజాక్షి పేర్కొన్నారు.


