విశాలాంధ్ర-రాప్తాడు : కళ్యాణమ్మ ఆశయ సాధనకోసం సమాజ సేవకు నిరంతరం కృషి చేస్తామని ఎండి కృష్ణ భరత్ కరస్పాండెంట్ కృష్ణ సమీరా అన్నారు. మాంటిస్సోరి పాఠశాలల వ్యవస్థాపకురాలు స్వర్గీయ కళ్యాణమ్మ వర్ధంతిని పురస్కరించుకుని మండలంలోని గొల్లపల్లి మాంటిస్సోరి ఎలీట్ పాఠశాల ఆవరణలో సోమవారం మెగా వైద్య, రక్తదాన శిబిరాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. వారు మాట్లాడుతూ సమాజ శ్రేయస్సే ధ్యేయంగా, ప్రజలకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించడమే లక్ష్యమన్నారు.
మన చుట్టూ ఉన్న సాటి మనుషులకు, సమాజానికి నిస్వార్థంగా సేవ చేయాలన్నదే వ్యవస్థాపకురాలు కళ్యాణమ్మ గారి ఆకాంక్ష అని, ఆమె ఆశయాలను నిజం చేయడమే సమాజానికి మనం ఇచ్చే నిజమైన గౌరవమన్నారు. సమాజంలో ఉన్న నిరుపేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు దరిచేర్చడంతో పాటు, ప్రాణాపాయంలో ఉన్నవారిని ఆదుకునేందుకు రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. రక్తదానం అనేది సాటి మనిషికి మనం చేయగలిగే అత్యున్నత సామాజిక సేవ అని, ఆరోగ్యకరమైన ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇంతటి సామాజిక ప్రయోజనకరమైన కార్యక్రమానికి ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయడం సంతోషకరమన్నారు.
ఈ మెగా శిబిరంలో పలువురు ప్రముఖ వైద్య నిపుణులు పాల్గొని ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. అలాగే పాఠశాల సిబ్బంది, స్థానిక యువత సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి రక్తదానం చేశారు.
కళ్యాణమ్మ ఆశయ సాధన.. సమాజ సేవలో మాంటిస్సోరి ఎలీట్ విలక్షణ ముద్ర!
- Advertisement -


