నేరాలపై అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు పిలుపు
విశాలాంధ్ర – అనంతపురం టౌన్మ : హిళల భద్రత, బాలల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సోమవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సఉన్నత పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలతో పాటు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ‘మహిళలపై జరుగుతున్న నేరాలు’, ‘పోక్సో చట్టం’, ‘సైబర్ మోసాలు’ అనే అంశాలపై విద్యార్థినులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సుల్లో పోలీసు అధికారులు మాట్లాడుతూ.. సమాజంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టేందుకు చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమన్నారు. ముఖ్యంగా మైనర్లపై జరిగే లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించే పోక్సో చట్టంలోని కఠిన నిబంధనలను, అలాగే ప్రస్తుత డిజిటల్ యుగంలో యువతను వేధిస్తున్న సైబర్ నేరాల ముప్పును విద్యార్థులకు వివరించారు. సామాజిక మాధ్యమాల్లో తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవద్దని, లోభాలు, మోసపూరిత లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. విద్యార్థినులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా తమకు ఎదురయ్యే వేధింపులపై తక్షణమే స్పందించాలి. ప్రతి ఒక్కరూ చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండి, తమ దృష్టికి వచ్చిన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలనైనా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలి. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంచబడతాయని ఆయా పోలీసులు కోరారు.
విద్యార్థినులకు రక్షణగా ‘పోక్సో’, ‘సైబర్’ చట్టాలపై చైతన్యం
- Advertisement -


