పరిటాల శ్రీరామ్, పరిటాల సునీత
క్యాంపు కార్యాలయంలో శివమ్మను సత్కరించిన పరిటాల సునీత, శ్రీరామ్
విశాలాంధ్ర- ధర్మవరం : తోలుబొమ్మల కళాకారిణి డి.శివమ్మ ధర్మవరం ఖ్యాతిని దేశమంతా తెలుసుకునేలా చేశారని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ తెదేపా ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరం మండలం, నిమ్మలకుంట గ్రామానికి చెందిన తోలుబొమ్మల కళాకారిణి డి.శివమ్మ , ప్రఖ్యాత జాతీయఁశిల్పగురుఁ అవార్డును అందుకున్నారు. 2025, డిసెంబర్ 9వ తేదీన న్యూడిల్లీ లోని, విజ్ఞాన్ భవన్ లో జరిగిన హస్తకళల జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో శివమ్మ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. ఈ నేపథ్యంలో పరిటాల శ్రీరామ్, పరిటాల సునీత అనంతపురం క్యాంప్ కార్యాలయంలో శివమ్మని సత్కరించారు. స్థానిక నాయకులతో కలిసి శాలువాతో సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తోలుబొమ్మలాట అన్నది మన సంస్కృతిలో ఒక భాగం అన్నారు. అయితే కాలక్రమంలో ఈ కళ అంతరించిపోయే ప్రమాదంలో పడిందన్నారు. ఇలాంటి సమయంలో నిమ్మలకుంట వాసులు ఈ కళను మళ్లీ బ్రతికించి ప్రాణం పోశారన్నారు. వంశపారంపర్యంగా దీనిని ఆదాయ వనరుగా చూడకుండా వారు కొనసాగించడం అభినందనీయమన్నారు. ఇప్పటికే తోలుబొమ్మలాటకు జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చారన్నారు. ఇప్పుడు శివమ్మ ప్రతిష్టాత్మకమైన శిల్ప గురు అవార్డు అందుకోవడం ధర్మవరం ప్రాంతానికి గర్వకారణంగా ఉందన్నారు.


