డ్రోన్ ఎగురవేయడానికి కూడా నో పర్మిషన్
సభాస్థలి, గన్నవరం విమానాశ్రయం చుట్టూ 5 కి.మీ. పరిధిలో నో ఫ్లై జోన్ అమలు
లక్షల మంది కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటన నేపథ్యంలో అధికారులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల దృష్ట్యా భద్రతను మరింత కఠినతరం చేశారు. ఇందులో భాగంగా ప్రధాని సభ జరిగే ప్రాంతానికి, గన్నవరం విమానాశ్రయానికి 5 కిలోమీటర్ల పరిధిని ఃనో ఫ్లై జోన్‌ఃగా ప్రకటించారు. ఈ మేరకు డ్రోన్ కార్పొరేషన్ అధికారులు స్పష్టం చేశారు. ప్రధాని పర్యటన ముగిసే వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని, ఈ పరిధిలో కనీసం డ్రోన్లను, బెలూన్లను ఎగురవేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాకుండా, భద్రతా కారణాల దృష్ట్యా ఎక్కడా బెలూన్లు కూడా ఎగరేయవద్దని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సీసీ కెమెరాల సహాయంతో నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోంది. ప్రధాని తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో అమరావతి సభాస్థలికి వస్తారు. ఇందుకోసం నాలుగు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. ఒకవేళ వాతావరణం అనుకూలించని పక్షంలో ప్రధానిని రోడ్డు మార్గంలో విజయవాడ మీదుగా అమరావతికి తీసుకువచ్చేందుకు రెండు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా సిద్ధం చేశారు. ఈ మార్గాల్లో కాన్వాయ్ ట్రయల్ రన్‌ను కూడా నిర్వహించారు. సభకు హాజరయ్యే లక్షలాది మంది ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. సుమారు 100 మంది ఆర్డీవోలు, 200 మంది తహసీల్దార్లు, ఇతర సిబ్బందికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. అత్యవసర వైద్య సేవల కోసం 30 వైద్య బృందాలు, 21 అంబులెన్స్‌లు, తాత్కాలిక ఆసుపత్రులను సిద్ధం చేశారు. మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర సభా ఏర్పాట్లను పర్యవేక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ అమరావతి పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
RELATED ARTICLES