Wednesday, January 22, 2025
Homeఅంతర్జాతీయంప్రమాణ స్వీకారం అనంతరం సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్!

ప్రమాణ స్వీకారం అనంతరం సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్!

అమెరికా ఇకపై గుర్తించేది స్త్రీ, పురుషులను మాత్రమే..
త్వరలోనే లింగ సమానత్వాన్ని గుర్తించే డీఈఐపై వేటు

అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పలు సంచలనాత్మక ఆదేశాలు విడుదల చేస్తూ సంతకాలు చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ మరో దానిపై గురిపెట్టారు. త్వరలోనే లింగ వైవిధ్యానికి ముగింపు పలికే ఉత్తర్వులపై సంతకం చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. ఇకపై అమెరికన్ ఫెడరల్ ప్రభుత్వం స్త్రీ, పురుషులను మాత్రమే గుర్తిస్తుందని ప్రకటించారు.

అమెరికాలో ఇటీవలి కాలంలో ట్రాన్స్‌జెండర్ హక్కుల విషయం వివాదాస్పద రాజకీయ అంశంగా మారింది. గత ఎన్నికల ప్రచారంలో చాలామంది రిపబ్లికన్లు లింగమార్పిడి చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాణ స్వీకారానికి ముందు రోజు నిర్వహించిన ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ మహిళా క్రీడల నుంచి పురుషులందరినీ దూరంగా ఉంచేలా చర్యలు తీసుకుంటానంటూ చెప్పడం ఇందులో భాగమేనని అంటున్నారు. ఈ నిర్ణయం జెండర్ టెర్రరిజం (లింగ తీవ్రవాదం) నుంచి మహిళలను దూరంగా ఉంచుతుందని చాలామంది విశ్వసిస్తున్నారు. డీఈఐ… అంటే డైవర్సిటీ (వైవిధ్యం), ఈక్విటీ (సమానత్వం), ఇన్‌క్లూజన్ (కలుపుకోవడం)పై ట్రంప్ ప్రభుత్వం త్వరలోనే చర్యలు తీసుకుంటుందని అధికారి ఒకరు తెలిపారు. అంతేకాదు, ఇకపై లింగ భావజాలాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎలాంటి నిధులు ఖర్చు చేయదని ఆయన పేర్కొన్నారు.

లింగ సమానత్వం విషయంలో ట్రంప్ మొదటి నుంచీ అసంతృప్తిగానే ఉన్నారు. అమెరికా అధ్యక్షుడిగా మొదటిసారి ఎన్నికైనప్పుడే ఈ విషయంలో తన ఉద్దేశాన్ని స్పష్టంగా చాటారు. సైన్యంలో పనిచేస్తున్న లింగమార్పిడి దళాలపై నిషేధం విధించారు. దీంతో ట్రాన్స్‌జెండర్ సిబ్బంది రిక్రూట్‌మెంట్ నిలిచిపోయింది. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జో బైడెన్ దీనిని పునరుద్ధరించారు. ట్రంప్ ఇప్పుడు మళ్లీ దీనిపై కత్తి దూస్తున్నారు. అంతేకాదు, ఇకపై పాస్‌పోర్ట్ వంటి ప్రభుత్వ గుర్తింపు పత్రాలలో జీవసంబంధమైన వాస్తవికత ఆధారంగా లింగాన్ని ఎంచుకునేలా స్త్రీ, పురుషుడు అని మాత్రమే కాలమ్‌లు ఉండనున్నాయి.

అయితే, ట్రంప్ తీసుకోనున్న ఈ సాహసోపేత నిర్ణయం విషయంలో పౌర, మానవ హక్కుల సంఘాల నుంచి నిరసన వెల్లువెత్తే అవకాశం ఉంది. లింగసమానత్వాన్ని ప్రోత్సహించేందుకు దీర్ఘకాలంగా చేస్తున్న ప్రయత్నాలకు ఇది గండికొడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, యాపిల్, కోస్టో వంటి సంస్థలు మాత్రం డీఐఈని అమలు చేస్తున్నాయి. తమ సంస్థల్లో ట్రాన్స్ జెండర్లను నియమించుకుంటున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు