- Advertisement -
- ఈ నెల 19న బహుమతుల ప్రదానం, ఫొటోగ్రాఫర్లకు సత్కారం
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విశాలాంధ్ర`విజయవాడ: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురష్కరించుకుని నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీలకు ఫొటోగ్రాఫర్ల నుంచి అనూహ్య స్పందన లభించిందని, అత్యుత్తమ ఛాయాచిత్రాలతో ఎంట్రీలు పంపడం, ఫొటోగ్రాఫర్ల కళాత్మక ప్రతిభకు నిదర్శనమని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.ఫొటోగ్రఫీ పోటీలకు వచ్చిన ఎంట్రీల్లో విజేతలను నిర్ణయించేందుకు న్యాయ నిర్ణేతల బృందం శనివారం విజయవాడ రాష్ట్ర ప్రభుత్వ అతిథిగృహంలో ఎంట్రీలను పరిశీలించి, అనంతరం విజేతలను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఫొటోలను పరిశీలించేందుకు విచ్చేసిన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మాట్లాడుతూ ఫొటోగ్రాఫర్లను మరింత ప్రోత్సహించి వారిలో ప్రతిభను వెలికితీసేందుకు ఫొటోగ్రఫీ పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో మొదటి విభాగం కింద జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ ఎన్‌టీఆర్, యోగాంధ్ర అంశాలకు సంబంధించి ఫొటో ఎంట్రీలు పంపారన్నారు. రెండో విభాగంలో తల్లికి వందనం,విద్య, ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్లు, దీపం – 2 ఉన్నాయని, మూడో విభాగంలో అత్యుత్తమ న్యూస్ ఫొటో ఎంట్రీలను పంపారన్నారు. ఎంట్రీలకు వచ్చిన ప్రతి చిత్రం ఫొటోగ్రాఫర్ల కళాత్మకతను స్పృశిస్తోందన్నారు. ప్రతి విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ, ప్రోత్సాహక బహుమతులకు విజేతలను నిర్ణయించేందుకు ఫొటోలను పరిశీలించి ఎంపిక చేయడం జరిగిందన్నారు. విజేతలకు ప్రతి విభాగంలో ప్రథమ (రూ. 10 వేలు), ద్వితీయ (రూ. 7,000), తృతీయ (రూ. 4 వేలు) బహుమతులతో పాటు రూ. 2 వేలు చొప్పున ఆరుగురికి ప్రోత్సాహక బహుమతులను అందజేస్తామన్నారు. ఈ నెల 19వ తేదీన ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఫొటోగ్రాఫర్లను సత్కరించి బహుమతులను ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. ఐ అండ్ పీఆర్ అధికారి కె.రవి, అంతర్జాతీయ ఫొటో జర్నలిస్టు, హిందూ రిటైర్డ్ ఫొటోగ్రాఫర్ సీహెచ్ విజయభాస్కర్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అసోసియేటెడ్ ప్రొఫెసర్ జి.అనిత, ఎఫ్‌ఆర్‌పీఎస్ జాతీయ అవార్డు ఫొటో జర్నలిస్టు టి.శ్రీనివాసరెడ్డి, విజయవాడ ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె.రవికుమార్, ఆంధ్రజ్యోతి మాజీ సీనియర్ ఫొటో జర్నలిస్టు డి.సీతారాంలు న్యాయనిర్ణేత బృందంలో సభ్యులుగా వ్యవహరించారు.


