న్యూదిల్లీ: ఓటరు జాబితాలో పేరు తొలగించినంత మాత్రాన పౌరసత్వం కోల్పోయినట్లు కాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో జాబితా నుంచి తొలగించబడిన వ్యక్తులకు సంక్షేమ పథకాలను నిరాకరించవచ్చా? లేదా? అన్న విషయాన్ని పరిశీలిస్తామని తెలిపింది. పశ్చిమ బెంగాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్)పై వచ్చిన అభ్యంతరాలపై దాఖలైన పిటిషన్ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు ఎన్నికల సంఘంతో పాటు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితాలో తమ పేరు కోల్పోయిన వారి అప్పీళ్లను ప్రత్యేక ట్రైబ్యునళ్లు పరిష్కరిస్తున్నాయి. ఈ క్రమంలో తిరస్కరణకు గురైన వ్యక్తులకు సంక్షేమ పథకాలు నిరాకరించకుండా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రసేన్జిత్ బోస్ అనే వ్యక్తి సుప్రీం కోరులో పిటిషన్ దాఖలు చేశారు. ఓటరు జాబితాలో పేరు తొలగించిన వెంటనే.. ప్రజా పంపిణీ వ్యవస్థ, అన్నపూర్ణతోపాటు ఆర్థిక సాయం, సంక్షేమ పథకాల ప్రయోజనాలు సంబంధిత వ్యక్తికి అందకుండా బెంగాల్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆరోపించారు. దాదాపు 34లక్షల అప్పీళ్లు ట్రైబ్యునళ్ల ముందు పెండింగు దశలోనే ఉన్నాయని, ఇప్పటివరకు కేవలం 38 వేల అప్పీళ్లకు మాత్రమే పరిష్కారం లభించిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.


