విశాలాంధ్ర పుట్టపర్తి: – రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సత్య సాయి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.ఉమ్మడి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరగనున్న భక్త కనకదాస జయంతి ఉత్సవాలలో పాల్గొనేందుకు మంత్రి నారా లోకేష్ బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో శ్రీ సత్యసాయి విమానాశ్రయానికి చేరుకోగా జిల్లాకు చెందిన మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పి సతీష్ కుమార్ జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఎంపీలు పార్థసారథి, అంబిక లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు ఎమ్మెస్ రాజు, బండారు శ్రావణి, కందికుంట వెంకటప్రసాద్, దగ్గుపాటి వెంకటప్రసాద్, అమిలినేని సురేంద్రబాబు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు చౌదరి కూటమి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన కళ్యాణదుర్గం బయలుదేరి వెళ్లారు.కూటమి ప్రభుత్వం భక్త కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఈ వేడుకలను ఘనంగా జరపాలని నిర్ణయించింది. రాష్ట్ర స్థాయి ప్రధాన ఉత్సవాన్ని అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో నిర్వహించనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అధిక జనాభా ఉన్న కురుబలు భక్త కనకదాసనం ఆరాధ్య దైవంగా కొలుస్తారు. భక్త కనకదాస ఒక సామాజిక తత్వవేత్తగా, స్వరకర్తగా తన రచనలు, కీర్తనల ద్వారా సమాజంలో నెలకొన్న అసమానతలు, కుల వ్యవస్థపై ప్రజల్లో చైతన్యం రగిలించారని , అటువంటి మహనీయుడి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడం, రాష్ట్రస్థాయి వేడుకలు జిల్లాలోనే నిర్వహించడం పట్ల కురుబ ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
విమానాశ్రయం వద్ద స్వల్ప ఉద్రిక్తత.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన సందర్భంగా శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయం వద్ద స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ నాయుడు విమానాశ్రయం లోపలికి వెళ్లే క్రమంలో పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. మా నేతను చూసేందుకు వస్తే మీరు అడ్డుకోవడం ఏంటని ప్రకాష్ నాయుడు లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేయగా ప్రోటోకాల్ పాటించాలని నిబంధనలు విరుద్ధంగా మేము ఎవరిని లోపలికి అనుమతించమన్నారు. ఈ క్రమంలో ప్రకాష్ నాయుడు కోపోద్రిక్తుడై పోలీసులపై మండిపడ్డారు. ఏ ఒక్కరైనా నిబంధనలు పాటించాల్సిందేనంటూ పోలీసులు కూడా అంతే స్థాయిలో జవాబు ఇచ్చారు. విమానాశ్రయం లోపలికి అనుమతించే విషయంలో మీ పేరు లేదని పేరు ఉంటే తప్పకుండా లోపలికి పంపించేవారమని పోలీసులు స్పష్టం చేశారు.


