తనపై కూడా హత్యాయత్నం జరిగిందని వెల్లడి
ప్రస్తుతం ఇండియాలో ఆశ్రయం పొందుతున్న హసీనా
బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆ దేశ ప్రధాని పదవిని షేక్ హసీనా కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. తాజాగా ఆమె కీలక విషయాలను వెల్లడించారు. గత ఏడాది ఆగస్ట్ లో అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయని… ఆ ఘటనల్లో 600 మందికి పైగా మరణించారని హసీనా చెప్పారు. తనపై కూడా హత్యాయత్నం జరిగిందని… తాను, తన సోదరి రెహానా 20 నుంచి 25 నిమిషాల వ్యవధిలో చావు నుంచి తప్పించుకున్నామని తెలిపారు. మృత్యువు నుంచి తప్పించుకుని భారత్ కు చేరుకున్నామని చెప్పారు. ఈ మేరకు అవామీ లీగ్ పార్టీ ఫేస్ బుక్ ఖాతాలో ఆడియో సందేశంలో ఆమె ఈ మేరకు వ్యాఖ్యానించారు. గతంలో కూడా తనపై పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయని హసీనా తెలిపారు. 2000 ఏడాదిలో కోటలీపర బాంబు దాడి నుంచి బయటపడ్డానని… 2004లో మరోసారి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డానని చెప్పారు.
2000లో బాంబు పెట్టి హసీనాను హతమార్చాలని హర్కతుల్ జీహాద్ బంగ్లాదేశ్ కు చెందిన ఉగ్రవాదులు చూశారు. అయితే బాంబు నిర్వీర్య బృందాలు వాటిని తొలగించడంతో ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. 2004 ఆగస్టులో ఉగ్రవాద వ్యతిరేక ర్యాలీలో దాడి జరిగింది. ఇందులో 24 మంది మృతి చెందగా… 500 మంది గాయపడ్డారు. ఈ దాడిలో హసీనా కూడా గాయపడ్డారు.