- చిట్టినగర్ లో కొందరు నేతల భారీ హోర్డింగ్
- ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం, భవానీలకు ఇక్కట్లు
- సమస్యను గుర్తించి మధ్యాహ్నానికి హోర్డింగ్ తొలగించిన పోలీసులు
విశాలాంధ్ర – విజయవాడ (వన్ టౌన్): కొందరు నాయకుల అత్యుత్సాహం భవానీమాల ధరించిన భక్తులతోపాటు సామాన్య ప్రజలకు కష్టాలు తప్పలేదు. భవానీ దీక్షల విరమణ సందర్భంగా గిరిప్రదక్షణ చేసే భక్తులకు స్వాగతం పలుకుతూ గురువారం ఉదయం విజయవాడ చిట్టినగర్ లో భారీ స్వాగత హోర్డింగ్ పెట్టారు. దాదాపు 2 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తులో ఉన్న ఈ హోర్డింగ్ వల్ల రోడ్డు కుచించుకుపోయింది. ఒకవైపు హోర్డింగ్ రోడ్డు మధ్యలో పెట్టడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. భవానీలు నడిచి వెళ్లేందుకు స్థలం సరిపోవడం లేదు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ విషయాన్ని అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు, మీడియా ప్రతినిధులు గుర్తించి ఫొటోలు తీసి టూటౌ సీఐ కొండలరావు దృష్టికి తీసుకెళ్లడంతో మధ్యాహ్నం ఆ హోర్డింగ్ ను తొలగించారు.


