విశాలాంధ్ర, కళ్యాణదుర్గం ..కళ్యాణదుర్గం పురపాలక సంఘం చైర్ పర్సన్ ఎన్నిక ఉత్కంఠ పరిస్థితుల మధ్య కొనసాగింది. గురువారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో 22 మంది కౌన్సిలర్లు, ఇద్దరు ఎక్స్ అఫిషియో సభ్యులు పాల్గొనగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా టి. గౌతమి కి మద్దతుగా 13 మంది చేతులు ఎత్తి తమ మద్దతు తెలుపగా, వైఎస్ఆర్సీ పార్టీ అభ్యర్థి ఎం.లక్ష్మన్న కి 11 మంది చేతులు ఎత్తి మద్దతు ఇచ్చారు. మెజారిటీ సాధించిన టీడీపీ అభ్యర్థి టి. గౌతమి విజయం సాధించినట్లు ఆర్డీవో మరియు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి వసంత బాబు విజేతగా ప్రకటించారు. ఇద్దరు కౌన్సిలర్లు సదరు ప్రత్యేక సమావేశానికి గైర్హాజరయ్యారు. అనంతరం చైర్ పర్సన్ గా ఎన్నికైన టి.గౌతమి కి ధృవీకరణ పత్రాన్ని ప్రిసైడింగ్ అధికారి అందించి ప్రమాణ స్వీకారం చేయించారు. ఇందులో ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ, ఎంఎల్ఏ అమిలినేని సురేంద్ర బాబు ఎక్స్ అఫిషియో సభ్యులుగా హాజరయ్యారు. ఉదయం నుండి ఎన్నిక పూర్తి అయ్యే వరకు క్షణ క్షణం ఉత్కంఠ కొనసాగింది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీ మరియు మున్సిపల్ కమిషనర్ కళ్యాణదుర్గం వంశీ కృష్ణ భార్గవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి డీఎస్పీ రవిబాబు ఆధ్వర్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. విజయం సాధించిన టీడీపీ సభ్యులు భారీ ర్యాలీతో ప్రజావేదిక కు చేరుకున్నారు.


