అమెరికా-ఇరాన్ మధ్య సంవత్సరాలుగా కొనసాగుతున్న విభేదాలు గత వారం నుంచి మరింత తీవ్రమయ్యాయి. ఇజ్రాయెల్‌తో చేతులు కలిపి ఇరాన్‌పై అమెరికా దాడులు ప్రారంభించడంతో పశ్చిమాసియా మొత్తం యుద్ధ వాతావరణంలోకి వెళ్లింది. ఈ ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకీ పెరుగుతుండటం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్‌పై యుద్ధం నాలుగు నుంచి ఐదు వారాలు సాగవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.ఈ వ్యాఖ్యలతో వాషింగ్టన్ దీర్ఘకాలిక సైనిక చర్యలకు సిద్ధమవుతోందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.ఇలాంటప్పుడు ఈ యుద్ధం అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఎంత భారం మోపుతుంది అనే చర్చ మొదలైంది.
ఒక్క రోజులోనే రూ.7 వేల కోట్ల వ్యయం
ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దళాలు ఇరాన్‌పై విస్తృత స్థాయి దాడులు ప్రారంభించాయి.ఇప్పటివరకు వందలాది లక్ష్యాలను చేధించామని, టెహ్రాన్‌కు చెందిన 11 నౌకలను ధ్వంసం చేశామని అమెరికా సైన్యం ప్రకటించింది.గగనతల, భూభాగం, సముద్ర మార్గాల్లో దాడులు కొనసాగుతున్నాయి. ఈ చర్యల్లో 20కి పైగా ఆధునిక ఆయుధ వ్యవస్థలను వినియోగిస్తున్నట్లు సమాచారం.దాడులు ఇంకా కొనసాగుతున్నందున మొత్తం ఖర్చును ఖచ్చితంగా అంచనా వేయడం కష్టమే.అయితే ఆపరేషన్ ప్రారంభమైన తొలి 24 గంటల్లోనే అమెరికా సుమారు 779 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు అంచనాలు సూచిస్తున్నాయి.భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.7 వేల కోట్లకు సమానం.
ఇక దాడులకు ముందు నుంచే అమెరికా పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ విమానాలు, నౌకలు, సైనిక దళాలను మోహరించింది.ఈ ముందస్తు ఏర్పాట్లకే మరో 630 మిలియన్ డాలర్లు, అంటే సుమారు రూ.5,700 కోట్లకు పైగా ఖర్చై ఉండొచ్చని రక్షణ నిపుణులు భావిస్తున్నారు.సెంటర్ ఫర్ న్యూ అమెరికన్ సెక్యూరిటీ గణాంకాల ప్రకారం, యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ వంటి యుద్ధ విమాన వాహక నౌకను రోజుకు నిర్వహించడానికి 6.5 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ.59 కోట్లు వెచ్చించాల్సి వస్తుంది.
యుద్ధ సమయంలో ధ్వంసమవుతున్న ఆయుధ పరికరాల నష్టం కూడా అమెరికాపై అదనపు భారంగా మారుతోంది.ఇటీవల కువైట్‌లో అమెరికాకు చెందిన మూడు యుద్ధ విమానాలు కూలిపోయాయి.
ఇవి ఫ్రెండ్లీ ఫైర్ కారణంగానే కూలినట్లు అమెరికా వెల్లడించినా, సాంకేతిక సామర్థ్యం,ఆర్థిక పరంగా ఇది ఆందోళన కలిగించే అంశమే.రక్షణ వ్యయం పరంగా చూస్తే అమెరికాకు ఇది పెద్ద సవాలు కాకపోవచ్చు.
ప్రస్తుతం ఆ దేశ రక్షణ బడ్జెట్ ట్రిలియన్ డాలర్లకు మించినదే. దాన్ని 1.5 ట్రిలియన్ డాలర్ల వరకు పెంచే అవకాశమున్నట్లు కూడా సమాచారం.అయితే ప్రధాన సమస్య ఏమిటంటే యుద్ధాల్లో కీలకమైన ఆయుధ వ్యవస్థలను కోల్పోవడమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉద్రిక్తతలు ఎక్కువకాలం కొనసాగితే క్షిపణి నిరోధక వ్యవస్థల సామర్థ్యం తగ్గే ప్రమాదం ఉంది.
ప్రస్తుతం అమెరికా-ఇజ్రాయెల్ దళాల వద్ద ఈ వ్యవస్థలు పరిమితంగానే ఉన్నాయి. కొన్నింటిని అమెరికా ఇప్పటికే ఉక్రెయిన్‌కు పంపింది.మరికొన్నివి ఆసియా,ఇండో-పసిఫిక్ ప్రాంతాల్లో మోహరించారు.
దీంతో ఈ ఘర్షణల్లో ఆయుధ వ్యవస్థలు నష్టపోవడం వ్యూహాత్మకంగా కూడా ఆందోళనకరమని స్టిమ్సన్ సెంటర్‌కు చెందిన సీనియర్ నిపుణుడు క్రిస్టోఫర్ అభిప్రాయపడ్డారు.
2023 అక్టోబర్ 7న హమాస్ దాడి జరిగిన తర్వాత నుంచి అమెరికా ఇజ్రాయెల్‌కు భారీ స్థాయిలో సైనిక సాయం అందిస్తోంది.బ్రౌన్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం ఇప్పటివరకు 21.7 బిలియన్ డాలర్ల విలువైన సైనిక సహాయం అందించింది.అదనంగా యెమెన్, ఇరాన్ మరియు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా చేపడుతున్న ఆపరేషన్ల కోసం మరో 9.65 నుంచి 12.07 బిలియన్ డాలర్లు ఖర్చవుతున్నాయి.
పెరుగుతున్న ఆర్థిక భారం
ఈ మొత్తాలన్నింటినీ కలిపి చూస్తే, గత రెండేళ్లుగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అమెరికాకు ఇప్పటివరకు 31.35 బిలియన్ డాలర్ల నుంచి 33.77 బిలియన్ డాలర్ల వరకు వ్యయం అయ్యింది.భారత కరెన్సీలో ఇది సుమారు రూ.3.1 లక్షల కోట్లకు పైగా ఉంటుంది.
ఇప్పుడు ఇరాన్‌తో ఘర్షణలు మరింత కాలం కొనసాగితే ఈ ఆర్థిక భారం ఇంకా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.


