నవీన్ నిశ్చల్ కు మళ్లీ పార్టీ పగ్గాలు రానున్నాయా..?
నవీన్ కావాలంటూ క్యాడర్ కోరుకుంటుందా….?
విశాలాంధ్ర : చిలమత్తూరు : హిందూపురం నియోజకవర్గంలో వైసీపీని నడిపే సమర్ధుడు ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హిందూపురంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి గత 40 ఏళ్లుగా ఇక్కడ టిడిపి తప్ప మరో పార్టీ జెండా ఎగిరింది లేదు. వరస ఓటములతో కాంగ్రెస్, వైసిపి ఇతర పార్టీల నుండి పోటీ చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు ఆయా పార్టీల అభ్యర్థులు. వరుసగా మూడుసార్లు ఓటమిని మూట కట్టుకున్న వైసీపీ సీనియర్ నాయకుడు నవీన్ నిశ్చల్ మాత్రం తనదైన స్టైల్ లో రాజకీయం నడుపుతున్నారు. పార్టీలో ఉన్న వెన్నుపోటు దారుల నుండి వరుసగా మూడుసార్లు ఓడిపోయిన నవీన్ ఇప్పటికీ ఒక్కసారైనా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని పట్టు వీడని విక్రమార్కుడిలా పోరాటం చేస్తున్నాడు. 2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తొలిసారిగా టికెట్ సాధించుకొని టిడిపి అభ్యర్థి రంగనాయకులపై ఓటమిపాలయ్యారు. 2009లో కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా టిడిపి అభ్యర్థి అబ్దుల్ గని పై పోటీ చేసి కేవలం 3600 స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు నవీన్ . అప్పట్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ మూడో స్థానానికి పరిమితమయ్యారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా సినీ నటుడు బాలకృష్ణపై నవీన్ నిశ్చల్ ను బరిలోకి దింపింది అధిష్టానం. బాలకృష్ణకు గట్టి పోటీ ఇచ్చి 14 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు నవీన్. 2019లో బాలకృష్ణ దూకుడుకు కళ్లెం వేయాలని నవీన్ తన కేడర్ ను సిద్ధం చేసుకుంటే వైసిపి అధిష్టానం ఆయనకు టికెట్ నో చెప్పింది. ఎక్కడో మాజీ ఐపీఎస్ గా ఉన్న ఇక్బాల్ కు టికెట్ ఇచ్చి బరిలోకి దింపింది వైసిపి. 2024 లో నైనా తనకు టికెట్ వస్తుందని ఆశించిన నవీన్ కు నిరాశే ఎదురయింది. బెంగళూరులో నివాసం ఉంటున్న దీపికా అనే మహిళా అభ్యర్థిని అనూహ్యంగా రాజకీయ తెరమీదకి తీసుకొచ్చి ఆమెకు టికెట్ ఇచ్చేసింది వైసిపి అధిష్టానం. మహిళా అభ్యర్థి అనే కనీస సెంటిమెంట్ కూడా లేకుండా బాలకృష్ణ మరింత భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించారు, హిందూపురం ఓటర్లు. పార్టీ అధిష్టానం నుండి ఎంత ఎదురుగాలి వేసినప్పటికీ పార్టీని వీడకుండా తన క్యాడర్ను చెక్కుచెదరకుండా కాపాడుకుంటూ వస్తున్నారు నవీన్ నిశ్చల్. ఎమ్మెల్యే బాలకృష్ణపై పోటీ పడాలంటే అంత ఈజీ కాదు అంటున్నారు లోకల్ రాజకీయ విశ్లేషకులు. మరి బాలకృష్ణకు దీటైన వ్యక్తి వైసీపీలో ఎవరు ఉంటారన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. వైసిపి అధిష్టానం సీరియస్ గా తీసుకుని బలమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న నవీన్ కు ఇంచార్జ్ పదవి బాధ్యతలు అప్పగిస్తారన్నది ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ గా ప్రచారంలోకి వచ్చింది. మూడుసార్లు ఓడిపోయి రెండుసార్లు టికెట్ లేకపోయినా అలాంటి నాయకుడికి వైసిపి ప్రాధాన్యత కల్పిస్తుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హిందూపురంలో వైసిపి బలోపేతం కావాలంటే మంచి
మాస్ ఫాలోయింగ్ ఉన్న నవీన్ నిశ్చల్ లాంటి నాయకుడు అవసరమని పలువురు రాజకీయ విశ్లేషకులు మేధావులు సూచనప్రాయంగా తెలియజేస్తున్నారు. వైసిపి అధిష్టానం ఎటువైపు అడుగులేస్తుందో వేచి చూడాల్సిందే
పురంలో వైసీపీని నడిపే సమర్ధుడు , ఎవరు?
RELATED ARTICLES