. కార్పొరేట్ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
. నేడు పఠాన్చెరువులో ఇంటిగ్రేటెడ్ భవనానికి శంకుస్థాపన
. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
విశాలాంధ్ర – హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు వేగవంతంగా, పారదర్శకంగా అత్యుత్తమ సేవలు అందిం చాలనే లక్ష్యంతో రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత పదేళ్లలో ఆనాటి పాలకుల స్వార్థపూరిత నిర్ణయాల వల్ల రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టిపోయిందని విమర్శించారు. రెండేళ్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాలు, సూచనల మేరకు భ్రష్టుపట్టిన వ్యవస్థను సంస్కరిస్తూ రెవెన్యూ సేవలను ప్రజలకు చేరువ చేస్తున్నామని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల ఏర్పాటుపై మంగళవారం సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 11 క్లస్టర్లుగా విభజించి ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ప్రైవేటు నిర్మాణ రంగ సంస్థలతో నిర్మాణం చేపట్టడంతో పాటు ఐదు సంవత్సరాల నిర్వహణ బాధ్యతను కూడా ఆ సంస్థలే తీసుకున్నాయని తెలిపారు. మూడు నుంచి ఐదు ఎకరాల స్థలంలో కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వివాహ రిజిస్ట్రేషన్ల కోసం మినీ హాలు, గర్భిణులు, వద్ధులకు ప్రత్యేక వసతులు, విశాలమైన వెయిటింగ్ ఏరియా, మహిళల కోసం ఫీడింగ్ రూమ్, చిన్నపిల్లల కోసం క్రెచ్, వద్ధులు, దివ్యాంగుల కోసం ఆధునిక లిఫ్ట్ సౌకర్యం తదితరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మిగిలిన కార్యాలయాలకు శంకుస్థాపనలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రెండవ విడతలో జిల్లా కేంద్రాల్లో ఇంటిగ్రేటెడ్ భవనాలను నిర్మిస్తామని ఇందుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేయాలని సూచించారు. ఇప్పటికే తాలిమ్లో ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, జూన్ 2 నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇటీవల మేడ్చల్ జిల్లాలో భవనానికి శంకుస్థాపన చేయడం జరిగిందని, పఠాన్ చెరువు-శంకరపల్లి ప్రధాన రహదారి సమీపంలో రాజపుష్ప కన్స్ట్రక్షన్ నిర్మించే ఇంటిగ్రేటెడ్ భవనానికి బుధవారం శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖలో స్లాట్ బుకింగ్, ఈ ఆధార్ సంతకం వంటి సౌకర్యాలతో ప్రజల సమయాన్ని ఎంతో ఆదా చేశామని అన్నారు. రెవెన్యూ శాఖలో తీసుకుంటున్న ఈ సంస్కరణలు కేవలం కార్యాలయాల మార్పు మాత్రమే కాకుండా, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే సంస్కరణలుగా నిలుస్తాయని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
జర్నలిస్టుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత
రాష్ట్రంలో పాత్రికేయుల సంక్షేమం, భద్రత, వృత్తి గౌరవాన్ని కాపాడేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పాత్రికేయుల అక్రిడిటేషన్ అంశంపై అన్ని పాత్రికేయ సంఘాల సూచనలు, సలహాలు పరిగణనలోకి తీసుకుని గతంలో విడుదల చేసిన జీవోలో మార్పులు చేర్పులు చేసి కొత్త జీవోను జారీ చేశామని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని అన్నారు. మంగళవారం సచివాలయంలో అనేక జరల్నిస్టు సంఘాల ప్రతినిధులు మంత్రికి కతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వం ఎలాంటి భేషజాలకు పోకుండా అందరికీ న్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు.


