Homeఆలయంలోతొక్కిసలాట

ఆలయంలోతొక్కిసలాట

- Advertisement -

9 మంది దుర్మరణం – మరో ఇద్దరి పరిస్థితి విషమం

. పలాస కాశీబుగ్గలో దుర్ఘటన
. మోదీ, ముర్ము, చంద్రబాబు దిగ్భ్రాంతి
. కేంద్రం రూ.2 లక్షలు…క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం

విశాలాంధ్ర-పలాస: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో శనివారం ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆలయంలో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది దుర్మరణం చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో చిన్న తిరుపతిగా ప్రచారమవుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కార్తీక ఏకాదశి కావడంతో భక్తులు వేల సంఖ్యలో దర్శనానికి వచ్చారు. ఈ క్రమంలో ఆలయంపై మెట్లకు ఏర్పాటు చేసిన రెయిలింగ్‌ విరిగిపోవడంతో ఒక్కసారిగా భక్తులు ఒకరిపై ఒకరు పడిపోవడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో 9 మంది భక్తులు మృతి చెందారు. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు ఉండగా, 13 ఏళ్ల బాలుడు ఉన్నాడు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాచారం తెలిసిన వెంటనే మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్‌, జిల్లా కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ కేవీ మహేశ్వర్‌ రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష తదితరులు పలాస చేరుకుని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందేలా చూశారు. ప్రధాన మంత్రి మోదీ ఈ ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం ప్రకటించారు. కాశీబుగ్గకు చెందిన హరిముకుంద పండా తన సొంత నిధులతో ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించారు. నాలుగు నెలల క్రితం ఆలయానికి భక్తులు రావడం ప్రారంభమైంది. దేవాలయం నిర్మాణం జరిగిన తీరుపై సామాజిక మాధ్యమాలలో చిన్న తిరుపతిగా ప్రచారం కావడంతో భక్తుల తాకిడి అధికమైంది. గత శనివారం కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నప్పటికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే ఈ శనివారం ఏకాదశి కావడం… మహిళలకు ఉచిత బస్సు కావడంతో భక్తులు పోటెత్తారు. దర్శనానికి క్యూలో నిలబడిన భక్తులు స్టీల్‌ గ్రిల్‌ ఊడిపోవడంతో ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాట జరిగింది. ప్రమాద స్థలం వద్ద ఏడుగురు మంది మృతి చెందగా…మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతదేహాలకు స్థానిక పలాస ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో శవ పంచనామా చేసి… కుటుంబ సభ్యులకు అప్పగించారు. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు భక్తులు నందిగాం మండలం, రౌతుపురం గ్రామానికి చెందిన బాకి కళావతి (50), మందస మండలం బెల్లుపటియ గ్రామానికి చెందిన దువ్వు కుమారి (25)ని మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం జెమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.సమాచారం తెలిసిన వెంటనే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష చేరుకున్నారు. ప్రమాద ఘటనపై ఆరా తీశారు. మాజీమంత్రి, వైసీపీ నాయకులు సీదిరి అప్పలరాజు ఘటనా స్థలానికి చేరుకుని గాయాల పాలైన భక్తులకు వైద్య సేవలు అందించారు. మెరుగైన వైద్యం కోసం వివిధ ఆసుపత్రులకు పంపారు. మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్‌ పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. కాగా ఇక్కడి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వేల సంఖ్యలో భక్తులకు ప్రవేశం కల్పించడం వల్లే ఈ ఘటన జరిగినట్టు పరిశీలకులు అంటున్నారు. ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉందని పోలీసులకు సమాచారం అందించినా… వారు చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మృతుల వివరాలు…
మృతులను ఎడూరి చిన్నమ్మి (50), రాపాక విజయ (48), మురిపింటి నీలమ్మ (60), దువ్వు రాజేశ్వరి (60), చిన్ని యశోదమ్మ (56), రూప (వయసు వివరాలు అందుబాటులో లేవు), లొట్ల నిఖిల్‌ (13), డొక్కర అమ్మడమ్మ (వయసు వివరాలు అందుబాటులో లేవు), బోర బృందావతి (62)గా గుర్తించారు.
విచారణకు కలెక్టర్‌ ఆదేశం
కాశీబుగ్గ పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై సమగ్ర విచారణ జరిపి తక్షణమే నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్‌కర్‌… ముగ్గురు అధికారులతో కూడిన విచారణ బృందాన్ని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. టెక్కలి ఆర్‌డీవో ఎం.కృష్ణమూర్తి, శ్రీకాకుళం ఏఎస్పీ కెేవీ రమణ, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ ప్రసాద్‌ పట్నాయక్‌ ఈ బృందంలో ఉన్నారు. వీరు ఈ దుర్ఘటనకు సంబంధించి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వనున్నారు. కాగా, కాశీబుగ్గలోని వెంకటేశ్వరస్వామి దేవాలయంతో దేవాదాయ శాఖకు సంబంధం లేదని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ తెలిపారు. ఇది ప్రైవేటు వ్యక్తులకు చెందినదని, సొంత నిధులతో ఓ వ్యక్తి ఆలయం నిర్మించారని అన్నారు.
భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక నుంచి ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. కాగా, కాశీబుగ్గ ఘటనపై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్‌ పండా స్పందించారు. సాధారణంగా ఆలయానికి రెండు వేల మంది వరకు భక్తులు వస్తుంటారని, ఇంత పెద్దసంఖ్యలో వస్తారని ఊహించలేదని తెలిపారు. ‘భక్తులకు ప్రసాద వితరణ చేసి పంపిస్తాను. ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఇంతమంది వస్తారని తెలియక పోలీసులకు సమాచారం ఇవ్వలేదు’ అని అన్నారు. ఆలయంలోనే హరిముకుంద్‌ పండాతో కలెక్టర్‌, ఎస్పీ మాట్లాడారు. ప్రస్తుతం ఆలయ పరిసరాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు