. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సిబ్బందికి అందని వేతనం
. మొరాయిస్తున్న కొత్త పోర్టల్
. సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు
విశాలాంధ్ర-సచివాలయం: రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకత కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ‘నిధి’ పోర్టల్ ప్రస్తుతం లక్షలాది మంది ఉద్యోగుల పాలిట ‘కన్నీటి వ్యధ’గా మారింది. పరిపాలనను సరళతరం చేయాలని భావించిన ఈ కొత్త సాఫ్ట్వేర్ సాంకేతిక సమస్యలతో లక్షల సంఖ్యలో ఉన్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పాలిట శాపంగా పరిణమించింది. కేవలం సాంకేతిక కారణాల సాకుతో గడిచిన రెండు, మూడు నెలలుగా సుమారు లక్షల మంది ఉద్యోగులకు జీతాలు అందకపోవడంతో వారి కుటుంబాలు పస్తులుండాల్సిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న లక్షల మందికి పైగా సిబ్బంది జీతాలు రాక అల్లాడిపోతున్నారు. కొన్ని కీలక శాఖల్లో జనవరి నెల జీతం కూడా నేటికీ జమ కాలేదు. అద్దెలు కట్టలేక, పిల్లల ఫీజులు చెల్లించలేక, నిత్యావసరాల కోసం అప్పులు చేయలేక లక్షల కుటుంబాలు తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నాయి. పాత సీఎఫఎంఎస్ వ్యవస్థ నుంచి డేటాను కొత్త ‘నిధి’ పోర్టల్‌కు తరలించే క్రమంలో తీవ్రమైన మ్యాపింగ్ లోపాలు తలెత్తాయి. ఈ సంక్షోభానికి క్యాడర్ స్ట్రెంగ్త్ వివరాలు పోర్టల్‌లో అప్డేట్ కాకపోవడమే ప్రధాన కారణం. ఆయా శాఖల్లో మంజూరైన పోస్టుల వివరాలు పోర్టల్‌లో కనిపించడం లేదు. దీంతో డేటా ఎంట్రీ ప్రక్రియ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. డేటా నమోదు చేసే సమయంలో ఫోన్లకు ఓటీపీలు రాకపోవడం, సర్వర్లు మొరాయించడంతో యూడీసీలు, అకౌంట్స్ సిబ్బంది గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చున్నా ఫలితం లేకుండా పోతోంది. ప్రస్తుత సమాచారం ప్రకారం, కొత్త పోర్టల్‌లో డేటా ఎంట్రీ ప్రక్రియ కనీసం సగం కూడా పూర్తి కాలేదని తెలుస్తోంది. అయితే పాత సీఎఫఎంఎస్ వ్యవస్థలో ప్రతి శాఖకు ఒక నిర్దిష్టమైన హెడ్ ఆఫ్ అకౌంట్, డిపార్ట్మెంట్ కోడ్ ఉండేవి. నిధి పోర్టల్‌లోకి డేటాను బదలాయించినప్పుడు కొత్త కోడింగ్ విధానంతో పాత పోస్టులు సరిపోలడం లేదు. దీనివల్ల సాఫ్ట్వేర్ దృష్టిలో ఆ పోస్టులు అసలు ఉనికిలో లేనట్లు చూపిస్తోంది. ఉదాహ రణకు, ఒక ప్రభుత్వ కార్యాలయంలో 20 కాంట్రాక్టు పోస్టులు మంజూరైతే… పోర్టల్‌లో మాత్రం కేవలం 5 లేదా 10 పోస్టులే కనిపిస్తు న్నాయి. మిగిలిన 10-15 మంది ఉద్యోగుల వివరాలను పోర్టల్‌లోకి ఎక్కించడానికి వీలు పడటం లేదు. పోస్టు ఖాళీగా లేదని సాఫ్ట్వేర్ ఎర్రర్ చూపిస్తోంది. వైద్యారోగ్య శాఖలో వేలాది మంది కాంట్రాక్టు నర్సులు, పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. వీరిలో చాలా మంది పోస్టులు ‘నిధి’లో సెర్చ్ చేసినా దొరకడం లేదు. విద్యా శాఖలో సమగ్ర శిక్షా వంటి విభాగాల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ సిబ్బంది వివరాలు ‘నో రికార్డ్ ఫౌండ’ అని వస్తున్నాయి. ?మున్సిపల్ శాఖలో పారిశుధ్య కార్మికులు, ఇతర ఫీల్డ్ స్టాఫ్ వివరాలు నమోదు చేయబోతే, వారు పనిచేసే వార్డులు, సెక్షన్లు పోర్టల్‌లో మ్యాప్ కాలేదు. చాలా శాఖల్లో పాత హోదాల పేర్లు మారాయి. అయితే నిధి పోర్టల్ పాత హోదాలను గుర్తించడం లేదు. ఉదాహరణకు, ఒకే రకమైన పని చేసే ఉద్యోగిని ఒక చోట ‘జూనియర్ అసిస్టెంట’ అని, మరో చోట ‘డేటా ప్రాసెసింగ్ ఆఫీసర’ అని పిలుస్తు న్నారు. ఈ గందరగోళం వల్ల పోస్టుల మంజూరు పత్రాలు పోర్టల్‌తో సరిపోలడం లేదు. కాంట్రాక్టు ఉద్యోగుల రెన్యువల్ ఉత్తర్వులు, వారి సర్వీస్ వివరాలు అప్లోడ్ చేయాల్సి ఉన్నా… వెనక నుంచి క్యాడర్ స్ట్రెంగ్త్ అనుమతి లేకపోవడంతో “అన్ ఆథరైజ్డ్ పోస్ట” అనే మెసేజ్ వస్తోంది. డేటా ఎంటర్ చేద్దామన్నా, స్క్రీన్ మీద పోస్టులే కనిపించకపోతే ఎవరి పేరు మీద బిల్లు పెట్టాలని కార్యాలయ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్య లపై ట్రెజరీ కార్యాలయాలకు వెళ్తే… అది ‘పై స్థాయి’ నుంచి పరిష్కారం కావాలని, తమ చేతుల్లో ఏమీ లేదని అధికారులు చేతులెత్తేస్తు న్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40 శాతం కార్యాలయాల్లో క్యాడర్ స్ట్రెంగ్త్ వివరాలు ఇంకా గాలిలోనే ఉన్నాయి. ‘పారదర్శకత ఉండాల్సిందే, కానీ అది మా పొట్ట కొట్టేలా ఉండకూడదని తాత్కాలిక, కాంటాక్ట్ ఉద్యోగులు మండిపడుతు న్నారు. పండుగలు వచ్చాయి, వెళ్ళాయి.. సెలవులు కూడా వచ్చాయి.. కానీ చేతిలో పైసా లేదు. అద్దెలు కట్టలేక ఇళ్లు ఖాళీ చేసే పరిస్థితి దాపురించింది’ అని బాధిత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత విధానంలోనైనా జీతాలు ఇచ్చే ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నా… ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. సాంకేతిక సమస్యలను పరిష్కరించ డంలో ఐటీ విభాగం విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తక్షణమే ప్రభుత్వం స్పందించి ‘నిధి’ పోర్టల్‌లోని సాంకేతిక లోపాలను సరిచేయకపోతే, రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమయ్యే అవకాశం కనిపిస్తోంది.


