- ఎన్టీఆర్ భరోసాతో పేదలకు అండ
- అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
- ముఖ్యమంత్రి చంద్రబాబు
విశాలాంధ్ర నరసాపురం/:మొగల్తూరు: అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రజా వేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్డీఏ కూటమికి తిరుగులేదని ధీమా వ్యక్తం చేశారు. గొడ్డలి పార్టీ అడుగడుగునా అభివృద్ధిని అడ్డుకుంటోందని ప్రతిపక్ష వైసీపీపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తుంటే కోర్టు కేసులతో గొడ్డలి పార్టీ అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదన్న భయంతోనే స్థానిక ఎన్నికల ప్రక్రియకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. గ్రామాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావాలంటే సర్పంచులు, వార్డు సభ్యులు సహా స్థానిక ప్రజాప్రతినిధులు ఉండటం అత్యవసరమన్నారు. గ్రామాల్లో గొడవలు కాకుండా ఐకమత్యం ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర వర్గాలకు పెన్షన్లు అందిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. సెప్టెంబరు నెలకు రాష్ట్రవ్యాప్తంగా 61,92,396 మంది లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.2,693.90 కోట్లు విడుదల చేసిందన్నారు.
31 ఏళ్ల క్రితం ఇదే రోజు…
మొగల్తూరు సభలో చంద్రబాబు తన రాజకీయ ప్రస్థానంలోని కీలక ఘట్టాన్ని గుర్తుచేసుకున్నారు. 1995 సెప్టెంబరు 1న తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశానని…ఈ రోజు తనకు ప్రత్యేకమని తెలిపారు. 48 ఏళ్ల రాజకీయ జీవితంలో మొగల్తూరుతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, ప్రజలు తనపై చూపుతున్న ఆప్యాయ తకు ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకో లేనని భావోద్వేగంతో పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభి వృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నా మని చంద్రబాబు స్పష్టం చేశారు. డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం, స్వయం బ్రాండ్ ద్వారా వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం, దీపం 2.0 ద్వారా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడం వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా మన పంటలు కూడా మారాలని కోరారు. కోస్తాలో ఆక్వా ఉత్పత్తి, రాయలసీమలో హార్టికల్చర్ ఎక్కువగా పండుతోందన్నారు. ఆక్వా రైతులపై నష్ట భారం పడకూడదని ఆక్వా రైతుకు రూ.1.5 కే యూనిట్ విద్యుత్తును అందిస్తున్నామని తెలిపారు. ఇతర దేశాలతో పోటీగా మన ఆక్వా ఉత్పత్తి కూడా అంతర్జాతీయ మార్కెట్లకు వెళ్లే విధంగా రైతులకు సహకరిస్తామని తెలిపారు. పెద్ద ఎత్తున పెట్టుబడులని రాష్ట్రానికి తెస్తున్నామని, వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కరవు నేలకు కృష్ణా జలాలు చేర్చామన్నారు. గోదావరి నీళ్లను ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు తీసుకువెళ్లి అక్కడ చరిత్రను తిరగరాస్తున్నామన్నారు. గోదావరి తన దిశ మార్చుకుని రేపు అనకాపల్లి, ఆ వచ్చే ఏడాదికి విశాఖకు తద్వారా వంశధారకు వెళుతుందని తెలిపారు. నదుల అనుసంధానంతో దేశంలో నీటి సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజా పాలనలో సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. విద్యార్థులకు ఏఐ ట్యూటర్, ప్రజల ఆరోగ్య పర్యవేక్షణకు ఏఐ డాక్టర్ వంటి సాంకేతిక సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.సంక్షేమ పథకాలు కేవలం తాత్కాలిక ఉపశమనంగా కాకుండా పేదలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, ఐజి జీవీజీ అశోక్ కుమార్, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నసీమూన్ అస్మి, జాయింట్ కలెక్టర్ కె.ఆర్ కల్పశ్రీ, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, మత్స్యకార సంస్థ కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు, శాసనసభ్యులు పాల్గొన్నారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు హెలిపాడ్ వద్ద కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు తదితరులు స్వాగతం పలికారు.


