Homeఆంధ్రప్రదేశ్జూన్ 1న విశాఖ రైల్వే జోన్

జూన్ 1న విశాఖ రైల్వే జోన్

- Advertisement -

విశాలాంధ్ర బ్యూరో – విశాఖపట్నం: ఈ ఏడాది జూన్ ఒకటో తేదీన విశాఖ రైల్వే జోన్‌ను అధికారికంగా ప్రకటించనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం “డబుల్ ఇంజిన్ సర్కార” కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే బడ్జెట్‌లో ప్రత్యేకంగా రూ.10,134 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేవలం రూ.886 కోట్లు మాత్రమే లభించేవని, ప్రస్తుతం రాష్ట్రంలో అపూర్వమైన రైల్వే అభివృద్ధి జరుగుతోందని అన్నారు. విశాఖ పట్నంలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రూ.1.06 లక్షల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని చెప్పారు. ఇవి రాష్ట్రాన్ని ప్రధాన ఆర్థిక కారిడార్లతో అనుసంధానం చేస్తూ లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నాయని పేర్కొన్నారు. అమృత్ భారత్ / నవ నిర్మాణ్ కార్యక్రమం కింద రాష్ట్రంలోని 74 రైల్వే స్టేషన్లు ఆధునికీకరణ జరుగుతున్నాయని, దేశంలోనే ఇది అతిపెద్ద ప్రాజెక్టుగా నిలుస్తుం దని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 832 ఫ్లైఓవర్లు, అండర్ పాసులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. మొత్తం 1,039 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ల నిర్మాణం కొనసాగుతోందని, ఆంధ్రప్రదేశ్‌లో 100 శాతం రైల్వే విద్యుద్దీ కరణ పూర్తి అయినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రధాన రైల్వే హబ్‌గా ఎదుగుతోం దని, ప్రస్తుతం రాష్ట్రానికి 16 వందే భారత్ రైలు సేవలు, 22 అమృత్ భారత్ రైలు సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. కొత్త తరం రైళ్ల రూపకల్పన, తయారీ ప్రమాణాల్లో అత్యంత జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ముఖ్య హామీలలో ఒకటైన విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసిందని, జూన్ ఒకటిన అధికారికంగా ప్రకటిస్తారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు హైస్పీడ్ రైల్వే కనెక్టివిటీ దిశగా వేగంగా చర్యలు కొనసాగుతున్నాయని, ఇందులో భాగంగా అమరావతిహైదరాబాద్ చెన్నయ్ బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదన ఉందన్నారు. దీనివల్ల అమరావతి నుంచి హైదరాబాద్ వరకు బుల్లెట్ ట్రైన్ ప్రయాణ సమయం కేవలం 70 నిమిషాలు, అమరావతి నుంచి చెన్నై వరకు 112 నిమిషాల్లో ప్రయాణం పూర్తవుతుందని తెలిపారు. తూర్పు తీర రైల్వే కారిడార్‌లో కోల్‌కతా-చెన్నై మధ్య ప్రస్తుతం ఉన్న డబుల్ లైన్లను నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఈ కారిడార్ ద్వారా కంటైనర్ రవాణా, సరుకు రైళ్లు, ప్రయాణికుల రవాణా మరింత మెరుగుపడటంతో పాటు సుమారు 500 కొత్త రైలు సేవలు ప్రారంభించే అవకాశముందని చెప్పారు. దక్షిణ రాష్ట్రాలకు అభివృద్ధి, సంక్షే మంలో కేంద్ర ప్రభుత్వం న్యాయం చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. కేంద్రం అభివృద్ధి, మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తుంటే ప్రతిపక్షాలు ప్రతి అంశాన్ని రాజకీయంగా మలుస్తున్నాయని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, ఆర్థిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు కొనసాగిస్తుందని అశ్విని వైష్ణవ్ పునరుద్ఘాటించారు.
విశాఖపట్నం ఇక ఏఐ పట్నంగా…
గూగుల్ ఏఐ డేటా సెంటర్‌తో విశాఖపట్నం ఇక ఏఐ పట్నంగా మారుతుందని కేంద్ర మంత్రి అన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్ర బాబు విజన్‌కు సెల్యూట్ చేస్తున్నానన్నారు. విద్య, వైద్యం, ఏరోస్పేస్, లాజిస్టిక్స్, వ్యవసాయం ఇలా వేర్వేరు రంగాల్లో ఏఐ విప్లవం వస్తోందన్నారు. గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ ద్వారా విశేషమైన సేవలు అందుతాయన్నారు. సెమీ కండక్టర్లు, చిప్, ల్యాప్ టాప్, మొబైల్ వంటి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో వెనుకబడ్డామని, ఇప్ప్పుడు ప్రధాని మోదీ చొరవతో మొబైల్ ఉత్పత్తి రంగంలో ముందడుగు వేశామన్నారు. భారత్ నుంచి ఇ|్ప్పుడు మొబైల్ ఫోన్‌లు అత్యధికంగా ఎగుమతి అవుతున్నాయన్నారు. దేశీయంగా అవసరమైన 50 శాతం ఎలక్ట్రానిక్ పరికరాలను మన దేశంలోనే ఉత్పత్తి చేసుకుంటున్నామన్నారు. ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్ మీదుగా యూరప్‌కు, అఫ్రికా మీదుగా అమెరికాకు వెళ్లేలా ఈ సబ్ సీ కేబుల్స్ వేస్తున్నారని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు