ట్రంప్‌నకు అమెరికా పౌరుల డిమాండ్
న్యూయార్క్: సుంకాల విధింపు చెల్లదంటూ అమెరికా సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వానికి కొత్త చిక్కులు మొదలయ్యాయి. సుంకాల వల్ల ఇప్పటివరకూ అధిక ధరలు చెల్లించిన అమెరికా వినియోగదారులు తమకు రీఫండ్స్ కావాలని పట్టుబడుతున్నారు. ఈ జాబితాలో ట్రంప్ రాజకీయ ప్రత్యర్థులతో పాటు కార్పొరేట్ కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే, ఈ ప్రక్రియ అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. తాను విధించిన సుంకాల భారం విదేశీ ఎగుమతిదారులపై తప్ప సామాన్య అమెరికన్లు, అమెరికా దిగుమతిదారులపై లేదని ట్రంప్ ఇప్పటివరకూ చెబుతూ వచ్చారు. అయితే, ఆయన రాజకీయ ప్రత్యర్థులు మాత్రం ఈ వాదనతో మొదటి నుంచీ విభేదిస్తున్నారు. అధిక సుంకాల భారాన్ని సామాన్య అమెరికన్లే భరించాల్సి వచ్చిందని మండిపడ్డారు. సుప్రీం తీర్పు తరువాత ఇల్లినాయ్ రాష్ట్ర గవర్నర్ సుంకాల రీఫండ్స్ కోరుతూ ట్రంప్‌నకు బిల్లులు పంపించారు. సుంకాల కారణంగా తమ రాష్ట్రం 9 బిలియన్ డాలర్లు అధికంగా చెల్లించాల్సి వచ్చిందని అన్నారు. తమ రాష్ట్రంలోని ఒక్కో కుటుంబంపై సగటున 1,700 డాలర్ల అదనపు భారం పడిందని అన్నారు. కార్పొరేట్ కంపెనీలు కూడా రీఫండ్స్‌కు సిద్ధమవుతున్నాయి. కాస్ట్కో, రెవ్లాన్ వంటి పలు సంస్థలు ఇప్పటికే కేసులు దాఖలు చేశాయి. ఇప్పటివరకూ ట్రంప్ ప్రభుత్వం సుంకాల పేరిట 133 బిలియన్ల నుంచి 175 బిలియన్ డాలర్ల మేర వసూలు చేసి ఉంటుందని అమెరికా వర్గాలు భావిస్తున్నాయి. సుంకాల డబ్బులో ఎంతో కొంత తిరిగిస్తామని ట్రంప్ వర్గం ఇప్పటికే పలుమార్లు తెలిపింది. అయితే, ఇది అంత ఆషామాషీ వ్యవహారం కాదని నిపుణులు చెబుతున్నారు. సామాన్య ప్రజలకు నేరుగా రీఫండ్స్ అందే అవకాశాలు తక్కువని ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ బెస్సెంట్ కూడా పేర్కొన్నారు. రీఫండ్స్లో అధికభాగం దిగుమతిదారులు, అమెరికా కంపెనీలకే వెళుతుందని చెబుతున్నారు. విదేశీ ఉత్పత్తుల దిగుమతి సమయంలో వీరే కస్టమ్స్ శాఖకు నేరుగా సుంకాల రూపంలో అధిక ధరలు చెల్లించారని వివరిస్తున్నారు.
డబ్బు తిరిగివ్వండి
- Advertisement -
RELATED ARTICLES


