సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విశాలాంధ్ర – బ్యూరోఅమరావతి : కేంద్రం పంటలకు ప్రకటించిన కనీస మద్దతు ధరలపై పున:సమీక్ష జరపాలని, పంట పెట్టుబడి ఖర్చును పరిగణనలోకి తీసుకుని మద్దతు ధరలు పెంచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ గురువారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. 202526 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి వరితోసహా 14 పంటలకు కేంద్రం మద్దతు ధరలను ప్రకటించిందని, అత్యధిక విస్తీర్ణంలో పండిరచే ధాన్యానికి కంటితుడుపు చర్యగా క్వింటాకు రూ.69 మాత్రమే పెంచిందని వివరించారు. మొక్కజొన్నకు రూ.175, కందులు రూ.450, మినుములు రూ.400, పెసలు రూ.86, వేరుశనగ రూ.480, పొద్దుతిరుగుడు రూ.441, పత్తి రూ.589 చొప్పున మద్దతు ధరలు పెంచిందని పేర్కొన్నారు. పెట్టుబడి ఖర్చులతో పోల్చుకుంటే ఈ కనీస మద్దతు ధరలు నామమాత్రమేనని, ఈ మద్దతు ధరల ప్రకటనబట్టి చూస్తే కేంద్ర ప్రభుత్వం మరోమారు రైతులకు అన్యాయం చేసినట్లు గోచరిస్తున్నదన్నారు. ముఖ్యంగా ధాన్యం రైతులపట్ల కేంద్రం మరింత చిన్నచూపు ప్రదర్శిస్తోందని అన్నారు. గతేడాది ఒక ఎకరా సాగు ఖర్చు దాదాపు రూ.30 వేల వరకుకాగా, ఈ ఏడు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, నూర్పిళ్లు, కూలీల వేతనాలు తదితరాలు పెరిగి ఎకరాకు రూ.40 వేలకుపైగా ఖర్చవ్వనుందని వివరించారు. ప్రధాన పంటలకు గతేడాది కంటే పంట ఉత్పత్తి ఖర్చులు 15 శాతం పెరిగాయని, గత సంవత్సరం ధాన్యానికి రూ.117 పెంచగా, ఈ ఏడాది కేవలం రూ.69 మాత్రమే పెంచి కేంద్రం చేతులు దులుపుకుందని పేర్కొన్నారు. ఇది రైతుల నెత్తిన గుదిబండ మోపడమేనని, పెరిగిన ఖర్చుల మేరకు కూడా మద్దతు ధరలు పెంచే పరిస్థితి లేకపోవడం విచారకరమన్నారు. కేంద్ర మంత్రివర్గ సమావేశం తదుపరి కేంద్రమంత్రి ప్రెస్‌మీట్‌లో డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తున్నట్లుగా, పంట ఉత్పత్తి ఖర్చుకు 50 శాతం కలిపి ఇస్తున్నట్లుగా అబద్ధపు ప్రకటనలు చేయడం రైతాంగాన్ని మోసగించడమేనని తెలిపారు. పంట పెట్టుబడి విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో అరకొరగా మద్దతు ధర ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిరచారు. తక్షణమే కనీస మద్దతు ధరలపై పున:సమీక్ష చేయాలని, రైతుల పంటల పెట్టుబడి ఖర్చును పరిగణనలోకి తీసుకుని మద్దతు ధరలను పెంచాలని డిమాండ్ చేశారు.
పెట్టుబడికి అనుగుణంగా ధరలు
- Advertisement -
RELATED ARTICLES


