Homeబెంగాల్ తుది పోరు నేడు

బెంగాల్ తుది పోరు నేడు

- Advertisement -

కోల్‌కతా:పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రెండవ, తుది దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఏప్రిల్ 29 వ తేదీ బుధవారం 142 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. 294 స్థానాలు కలిగిన బెంగాల్ అసెంబ్లీకి ఈ రెండవ దశ పోలింగ్ అత్యంత కీలకంగా మారింది. ఈ దశలో పోలింగ్ జరుగుతున్న అత్యంత ముఖ్యమైన స్థానాల్లో భవానీపూర్ ఒకటి. మమతా బెనర్జీకి కంచు కోటగా భావించే ఈ స్థానంలో బీజేపీ నాయకుడు సువేందు అధికారి నుంచి బెంగాల్ సీఎం గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. తొలి దశలో ఏప్రిల్ 23న 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగిన విషయం విదితమే. రెండవ దశలో పోటీలో ఉన్న కీలక నాయకులలో టీఎంసీ నుంచి మమతా బెనర్జీ, చంద్రికా భట్టాచార్య, శశి పాంజా, అరూప్ విశ్వాస్ వంటి వారు ఉండగా, బీజేపీ తరపున సువేందు అధికారి, స్వపన్ దాస్‌గుప్తా, రూపా గంగూలీ వంటి వారు బరిలో నిలిచారు. ఈ దశ పోలింగ్ జరిగే ప్రాంతాల్లో కోల్‌కతా, హౌరా, ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ, నాడియా, పూర్బ బర్ధమాన్ జిల్లాలున్నాయి. 2021లో ఈ జిల్లాల్లోని 142 స్థానాలకు గాను టీఎంసీ 123 స్థానాలను గెలుచుకుంది. అయితే ఈ జిల్లాల్లో స్వల్ప మెజారిటీతో విజయాలు నమోదైన నియోజక వర్గాలున్నాయి. గణనీయ సంఖ్యలో ముస్లిం ఓటర్లు కూడా ఉన్నారు. రెండో విడత పోలింగ్ కోసం ఎన్నికల సంఘం 2,321 కంపెనీల కేంద్ర బలగాలను వినియోగిస్తోంది. మొత్తం 41,001 పోలింగ్ కేంద్రాలలో సీసీటీవీలు, డ్రోన్‌లతో నిఘా ఏర్పాటు చేసింది. మొదటి దశలో రికార్డు స్థాయిలో 93.19 శాతం ఓటింగ్ నమోదైన నేపథ్యంలో ఈసారి కూడా అంతేస్థాయిలో పోలింగ్ నమోదవుతుందని భావిస్తున్నారు. కేరళ, అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి సంబంధించిన ఓట్ల లెక్కింపు మే 4న జరగనుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు