Homeవిశ్లేషణమారుతున్న భారత రాజకీయ ముఖచిత్రం

మారుతున్న భారత రాజకీయ ముఖచిత్రం

- Advertisement -

యండి. ఉస్మాన్ ఖాన్

క్షేత్రస్థాయిలో ఆర్థిక ఇబ్బందులు, సామాజిక అశాంతి స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, అధికారపక్షం ఎన్నికల్లో విజయాన్ని ఎలా సొంతం చేసుకోగలుగుతోంది అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉంది. 2014 తర్వాత దేశ రాజకీయాల్లో వచ్చిన పరిణామాలు కేవలం ఒక ప్రభుత్వ మార్పిడికో, ముఖాల మార్పిడికో పరిమితం కాలేదు. అవి దేశ రాజకీయ చర్చల సరళిని, ప్రజాస్వామ్య విలువల ప్రాధాన్యతలను, ఓటర్ల ప్రాథమిక ఆలోచనా విధానాన్ని సమూలంగా మార్చేశాయి. ఒకప్పుడు ఎన్నికలు అంటే నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, విద్య, వైద్యం, రైతాంగ సంక్షేమం, మౌలిక వసతుల కల్పన వంటి ప్రజాసమస్యల చుట్టూ తిరిగేవి. దైనందిన జీవితాల్లో పాలకులు తెచ్చిన గుణాత్మక మార్పుల ఆధారంగానే ప్రజలు ఓటు వేసేవారు. కానీ నేడు, రాజకీయాలకు కేంద్రబిందువు లాంటి ప్రజా సమస్యలను పక్కనబెట్టి, మతపరమైన గుర్తింపు, నకిలీ జాతీయవాదం, సాంస్కృతిక అహంకారం, నెరవేరని భావోద్వేగ నినాదాల చుట్టూ చర్చను కేంద్రీకరించడంలో అధికార పక్షం విజయం సాధించింది. ఈ వ్యూహాత్మక మార్పును వారు కేవలం గమనించడమే కాదు, తమ రాజకీయ ఉనికికి తిరుగులేని బ్రహ్మాస్త్రంగా మలచుకున్నారు. అధికార పక్షం సాధిస్తున్న విజయాల రహస్యం పోలింగ్ బూత్‌లలో పడే ఓట్లలో లేదు, అంతకుమించి ప్రజాచైతన్య దిశనే మార్చేయడంలో ఉంది. దేశంలో నిరుద్యోగ రక్కసి కోరలు చాచినప్పుడు, ధరల పెరుగుదలతో సామాన్యుడి బతుకు భారమైనప్పుడు, ఆర్థిక మందగమనం దేశాన్ని అతలాకుతలం చేస్తున్నప్పుడల్లా మీడియా వేదికలపైకి, రాజకీయ క్షేత్రంలోకి ఏదో ఒక మతపరమైన చిచ్చు లేదా భావోద్వేగ అంశాన్ని హఠాత్తుగా తెరపైకి రావడం వెనుక ఒక పక్కా వ్యూహం దాగి ఉంది. రామమందిర ప్రతిష్ఠాపన నుండి కాశీ, మధుర వివాదాల వరకు, చరిత్ర పుటలను తారుమారు చేసి మొఘల్ కాలపు నిర్ణయాలను నేటి తరంతో ముడిపెట్టడం దాకా అన్నీ ఈ ఎజెండాలో భాగమే. ప్రజలు ఆకలి గురించి, బతుకు దెరువు గురించి ప్రశ్నించకుండా, నిరంతరం సాంస్కృతిక రక్షణ అనే ఒక కృత్రిమ భయంలో బతికేలా చేయడంలో వారు సఫలమయ్యారు. బహుళత్వ సమాజంలో మెజారిటీ వర్గం అభద్రతా భావాన్ని, సుప్త చేతనావస్థలో ఉన్న మత్ఙాóమానాన్ని రెచ్చగొట్టి, దాన్నొక వ్యవస్థీకృత రాజకీయ ఓటు బ్యాంకుగా మార్చడం ఈ వ్యూహంలో కీలక అంకం. గత పాలకుల కాలంలో మెజారిటీ వర్గం వివక్షకు గురైందనే ఒక అవాస్తవ కథనాన్ని నిరంతరం ప్రచారం చేసి దాన్ని రాజకీయ పెట్టుబడిగా మార్చుకున్నారు. అదే సమయంలో, మైనారిటీల హక్కుల గురించి వారి రక్షణ గురించి ఎవరు మాట్లాడినా, దానిని ‘ఓటు బ్యాంక్ రాజకీయం’ గానో లేక ‘సంతుష్టీకరణ’ గానో ముద్ర వేయడంతో సమాజంలో ‘వాళ్ళు’, ‘మనం’ అనే విభజన రేఖలు ఏర్పడ్డాయి. ఎన్నికలు రాగానే లవ్ జిహాద్, జనాభా నియంత్రణ, పౌరసత్వ సవరణ చట్టాల వంటి వివాదాలను ఉద్దేశపూర్వకంగా రగిల్చి, అంతర్గత కుల విభేదాలను, ప్రాంతీయ అస్తిత్వాలను తొక్కిపెట్టి, ఒకే ఒక్క హిందూ రాజకీయ గుర్తింపును బలోపేతం చేశారు. ఈ మొత్తం నయా రాజకీయ నమూనాలో మోదీ వ్యక్తిగత ఇమేజ్ ఒక రక్షణ కవచం అయితే, దాని చుట్టూ నిర్మించిన జాతీయవాద కథనం అంతకంటే బలమైనది. ఆయన్ను ఒక ప్రధానమంత్రిగా కాకుండా, శతాబ్దాల నాటి సాంస్కృతిక దాస్యాన్ని పోగొట్టే ఒక ఆధునిక ‘రక్షకుడిగా’, అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్టను పెంచిన ఏకైక ‘ నాయకుడిగా’ ప్రదర్శించడంలో ఐటీ సెల్స్‌, సోషల్ మీడియా నెట్‌వర్క్‌లు రాత్రింబవళ్లు శ్రమించాయి. చర్చల నియంత్రణను తమ గుప్పిట్లోకి తీసుకోవడం ద్వారా ప్రజలు ఏం ఆలోచించాలి, ఏ అంశాలపై స్పందించాలనే విషయాన్ని పాలకులే నిర్దేశించే స్థాయికి దేశం చేరుకుంది. అందుకే, రైతుల సుదీర్ఘ పోరాటాలు, కార్పొరేట్ శక్తుల దోపిడీ, పడిపోతున్న రూపాయి విలువ వంటి వాస్తవాలు ప్రధాన స్రవంతి మీడియాలో అప్రధాన అంశాలుగా మారిపోయాయి. పైగా, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అంటే శత్రుపక్షం కాదు, అదొక ప్రత్యామ్నాయం అనే ప్రాథమిక సూత్రాన్‌ని విస్మరించి, రాజకీయ విమర్శలను ఏకంగా దేశద్రోహంతో ముడిపెట్టే ప్రమాదకర సంస్కృతికి తెరలేపారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం దేశాన్ని అవమానించడమనే భావనను ప్రజా బాహుళ్యంలోకి బలంగా తీసుకెళ్లారు. దీనికి తోడు, విపక్షాల అసమర్థత కూడా వారికి వరంగా మారింది. కాంగ్రెస్‌తో సహా ఏ ప్రాంతీయ పార్టీ కూడా తాము అధికార పక్షానికి ఎందుకు ప్రత్యామ్నాయమో, తమకున్న స్పష్టమైన జాతీయ లేదా ఆర్థిక విజన్ ఏమిటో ప్రజల నమ్మకాన్ని చూరగొనేలా చెప్పడంలో ఘోరంగా విఫలమయ్యాయి. ఈ పుష్కర కాల పరిపాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థల నిర్వీర్యం, రాజ్యాంగ విలువల పతనం ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయని విశ్లేషకులు ఘాటుగానే విమర్శిస్తున్నారు. ఒకవైపు ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అనే ఆకర్షణీయమైన నినాదాలు ఇస్తూనే, క్షేత్రస్థాయిలో భయాందోళనల వాతావరణాన్ని, అసమ్మతిపై ఉక్కుపాదాల్ని మోపారు. పెగాస్స వంటి అధునాతన నిఘా సాఫ్ట్‌వేర్లను ఉపయోగించి పౌరుల, ప్రతిపక్ష నాయకుల, జర్నలిస్టుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం, పాలకులకు సన్నిహితంగా ఉన్న కార్పొరేట్ వర్గాలకు ప్రయోజనం చేకూర్చే ఆర్థిక విధానాలతో కొద్దిమంది శతకోటీశ్వరులకే దేశ సంపదను కట్టబెట్టడం బహిరంగ రహస్యమే. ఇక ఎన్నికల బాండ్ల ఉదంతం ద్వారా రాజకీయ నిధుల సమీకరణలో సృష్టించిన అసమతుల్యత, ఎన్నికల పోటీ రంగంలో ఆర్థిక సమానత్వాన్ని పూర్తిగా దెబ్బతీసింది. అపరిమితమైన ఆర్థిక బలంతో ఈడీ, సీబీఐ, ఆదాయపన్ను వంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలను, విపక్షాలను బ్లాక్మెయిల్ చేయడానికి, లొంగదీసుకోవడానికి సాధనాలుగా వాడుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్ష నేతలపై అవినీతి కేసులు మోపడం, అదే నేతలు అధికార పార్టీలో చేరగానే వారిపై కేసులు మాయమైపోవడం లేదా విచారణలు నత్తనడకన సాగడం ద్వారా ‘అవినీతిపై పోరాటం’ అనే నినాదం ఎంతటి బూటకమో స్పష్టమైంది. మణిపూర్ లాంటి సున్నితమైన సరిహద్దు రాష్ట్రంలో నెలల తరబడి జాతి నిర్మూలన హింస, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నా, జాతీయ మీడియాలో గానీ, ప్రధాన రాజకీయ చర్చల్లో గానీ దానికి కనీస ప్రాధాన్యత దక్కకపోవడం పాలకుల క్రూరమైన నిశ్శబ్దానికి, మీడియా లొంగుబాటుకు నిదర్శనం. ప్రస్తుత రాజకీయాల్లో అత్యంత ప్రమాదకరమైన అంశం ఏమిటంటే, భారతదేశం బహుళత్వానికి, వైవిధ్యానికి ప్రతీకలైన రాష్ట్రాల స్వయంప్రతిపత్తిపై, సమాఖ్య స్ఫూర్తిపై జరుగుతున్న నిరంతర దాడులు. ముఖ్యంగా ఉత్తరదక్షిణాది రాష్ట్రాల మధ్య ఆర్థిక, సామాజిక వ్యత్యాసాలను కేంద్ర ప్రభుత్వ విధానాలు మరింతగా ప్రభావితం చేస్తున్నాయి. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలుచేసి, అక్షరాస్యతలో, పారిశ్రామికాభివృద్ధిలో దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాల పన్నుల ఆదాయాన్ని కేంద్రం దోచుకుంటూ, జనాభాను పెంచుకుంటూ పోతున్న ఉత్తరాది రాష్ట్రాలకు భారీగా నిధులు మళ్లించడం ద్వారా దక్షిణాదిపై తీవ్ర వివక్ష చూపుతోంది. రాబోయే రోజుల్లో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన ద్వారా దక్షిణాది పార్లమెంటు స్థానాల సంఖ్య తగ్గిపోయి, రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాలు తమ ఉనికిని, ప్రాధాన్యతను కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. దీనికి తోడు, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ, ఎన్నికైన ప్రభుత్వాల నిర్ణయాలను అడ్డుకుంటూ సమాంతర పాలన సాగించడం సమాఖ్య స్ఫూర్తిని నిలువునా పూడ్చిపెట్టడమే. ప్రజాస్వామ్యానికి నాల్గవ స్తంభంగా నిలవాల్సిన మీడియా, పాలకుల భజన బృందంగా మారి ‘గోదీ మీడియా’ గా రూపాంతరం చెందడం ఈ శతాబ్దపు అతిపెద్ద విషాదం. నిరుద్యోగి అయిన యువకుడు ఉపాధి గురించి, కష్టాల్లో ఉన్న రైతు మద్దతు ధరల గురించి ప్రశ్నించకుండా, వారి అసంతృప్తిని మతపరమైన ఉన్మాదంతో ముడిపెట్టి నిరంతరం గుర్తింపు రాజకీయాల మత్తులోనే మునిగిపోయేలా సోషల్ మీడియా నెట్‌వర్క్‌లను వాడుకుంటున్నారు. అయితే, ఏ రాజకీయ అజేయత, ఆధిపత్యం కూడా చరిత్రలో శాశ్వతం కాదనేది జగద్విదితమే. ప్రజా బాహుళ్యాన్ని తాత్కాలికంగా భావోద్వేగాల మాయాజాలంతో, దేశభక్తి ముసుగులో కట్టిపడేసినప్పటికీ, చివరికి ఏ మనిషైనా తన దైనందిన జీవనానికి అవసరమైన కూడు, గూడు, గుడ¦, ఉద్యోగం, పిల్లల చదువుల వైపు మరలక తప్పదు. కేవలం ఎన్నికలలో గెలవడమే ప్రజాస్వామ్యానికి ఏకైక కొలమానం కాదు వ్యవస్థల స్వతంత్రత, పౌర హక్కుల రక్షణ, భిన్నత్వంలో ఏకత్వం మాత్రమే దేశానికి అసలు ఆత్మ. మత ఆధారిత విభజన రాజకీయాల వల్ల వచ్చే తాత్కాలిక ఎన్నికల లాభాల కంటే, సమాజంలో ఏర్పడే సామాజిక చీలికలు తరాల తరబడి దేశ ప్రగతిని వెనక్కి నెట్టేస్తాయి. భారతదేశం ప్రస్తుతం ఒక చారిత్రక సంధి యుగంలో నిలబడింది. ఒకవైపు నిరంతర మత వివాదాలు, ద్వేషపూరిత ఉపన్యాసాలు, ఏకఛత్రాధిపత్యం వైపు నడిపించే బాట ఉంటే, మరోవైపు ఉపాధి, సమాఖ్య స్ఫూర్తి, సామాజిక సమరసత, నిజమైన ప్రజాస్వామ్య పునరుద్ధరణ వైపు నడిపించే దారి ఉంది. ప్రజాస్వామ్య అంతిమ శక్తి ఎప్పుడూ ప్రజా కోర్టులోనే ఉంటుంది. ఈ రోజు అజేయంగా, తిరుగులేని శక్తిగా కనిపిస్తున్న పాలకులు రేపు ప్రజల తీర్పు ముందు సాగిలపడక తప్పదు. నేడు బలహీనంగా, చెల్లాచెదురుగా ఉన్న శక్తులు రేపు ఒక నూతన రాజకీయ ప్రత్యామ్నాయంగా, ప్రజాస్వామ్య ఆశాకిరణంగా ఎదగవచ్చు. భారతదేశ భవిష్యత్తు చివరికి ప్రజల తీర్పుతోనే లిఖించబడుతుంది. అదే ఈ మట్టిలోని ప్రజాస్వామ్య ఆత్మ.
సీనియర్ ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు