Homeవామపక్షాల ఐక్యత చారిత్రక అవసరం

వామపక్షాల ఐక్యత చారిత్రక అవసరం

- Advertisement -

ఫాసిజంపై పోరులో నిర్ణయాత్మక పాత్ర

. ఇండియా పార్టీల్లో అలసత్వం సరికాదు
. ఇది వందేళ్ల కమ్యూనిస్టు పార్టీ జాతీయ మహాసభ
. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా

(చండీగఢ్‌ నుంచి ఏబీ కూన)
కామ్రేడ్‌ సురవరం సుధాకర్‌ రెడ్డి నగర్‌ (చండీగఢ్‌): వామపక్షాల ఐక్యత సౌలభ్యం కోసం కాదని, అది చారిత్రక అవసరమని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. వామపక్ష ఐక్యత మాత్రమే విస్తృత ప్రతిపక్షానికి సైద్ధాంతిక స్పష్టత, నైతిక సమ్మతి, నిర్మాణ బలాన్ని అందజేస్తుందని స్పష్టంచేశారు. ప్రత్యామ్నాయ కోణం, సమానత్వం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సోషలిజంతో కూడిన ప్రత్యామ్నాయ దృష్టి కోణాన్ని అందిస్తుందని తెలిపారు. పంజాబ్‌ రాష్ట్ర రాజధాని చండీగఢ్‌లో సీపీఐ 24వ జాతీయ మహాసభలో భాగంగా ప్రతినిధుల సభ సోమవారం ప్రారంభమైంది. కామ్రేడ్‌ సురవరం సుధాకర్‌ రెడ్డి నగర్‌ (కిసాన్‌ భవన్‌)లో జరిగిన ప్రారంభోత్సవ సభకు సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య, ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ ప్రధాన కార్యదర్శి జి.దేవరాజన్‌, ఆర్‌ఎస్‌పీ ప్రధాన కార్యదర్శి మనోజ్‌ భట్టాచార్య హాజరై సౌహార్థ్ర సందేశాలిచ్చారు. తొలుత ప్రతినిధుల సభలో డి.రాజా ప్రారంభోపన్యాసం చేస్తూ ఇది సాధారణ పార్టీ మహాసభ లాంటిది కాదని, భారత కమ్యూనిస్టు పార్టీ నూరు వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జరుగుతున్నదని అన్నారు. వలసవాద వ్యతిరేక పోరాటమనే జ్వాలలో జన్మించి… తరతరాల త్యాగాలతో ఎదిగి… సామ్రాజ్యవాదం, మతతత్వవాదం, దోపిడి, అణిచివేతకు వ్యతిరేకంగా వందేళ్లుగా పోరాడుతున్న పార్టీ సీపీఐ అని అన్నారు. ఫాసిజంతో జరిగే పోరాటంలో వామపక్షాలది నిర్ణయాత్మక పాత్ర అని అన్నారు. ఫాసిస్టు పథాన్ని అత్యంత నికరంగా, రాజీలేని శక్తిగా వ్యతిరేకించేది వామపక్షమేనని చెప్పారు.
2024 సార్వత్రిక ఎన్నికలు ప్రతిఘటన సాధ్యమని నిరూపించాయని, బీజేపీ సంఖ్యాబలాన్ని 240కి తగ్గించి…సొంతంగా మెజారిటీ రాకుండా ఇండియా ఐక్యసంఘటన అడ్డుకున్నదని రాజా చెప్పారు. ఇది ఫాసిస్టు శక్తులకు ఎదురుదెబ్బ అని, దీనిని చూసి ‘ఇండియా’ నిశ్చింతగా ఉండరాదన్నారు. ఎన్నికల లెక్కలకు మించి ఇండియా ఐక్యసంఘటనకు ఐకమత్యం, లక్ష్యాలపై స్పష్టత, ఉమ్మడి ఎజెండా లోపించిందని చెప్పారు. కూటమి భాగస్వాముల నడుమ స్పష్టమైన సిద్ధాంతాల ప్రాతిపదికన రాజకీయ ఐక్యత అవసరమని ఉద్ఘాటించారు. కూటమికి లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమమే కేంద్రంగా ఉండాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఈ సందర్భంలోనే వామపక్షానిది నిర్ణయాత్మక పాత్ర అని స్పష్టంచేశారు. స్వాతంత్య్ర పోరాటంలో ఎన్నడూ పాల్గొనని… భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన ఆర్‌ఎస్‌ఎస్‌కు తన రాజకీయ విభాగం బీజేపీ ద్వారా 2014 నుంచి కేంద్ర ప్రభుత్వంపై పూర్తి నియంత్రణ వచ్చిందని రాజా అన్నారు. భారతదేశ లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రాన్ని క్రమానుగణత, మతతత్వ, ఫాసిస్టు హిందూ రాజ్యంగా మార్చేందుకు ఏ మాత్రం వెనుకాడకుండా బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ పథకం రచిస్తోందని రాజా విమర్శించారు. రాజ్యాంగ పరిషత్తులో అంబేడ్కర్‌ ఆందోళన చెందినట్లుగానే బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ భారతదేశాన్ని విపత్తు వైపు నెట్టివేస్తున్నాయని చెప్పారు. అత్యంత దూకుడుగా మతతత్వ రాజకీయాలకు, అత్యంత నిర్దయతో కూడిన ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని జోడిరచి ఆ పని చేస్తున్నాయని విమర్శించారు. ఫాసిజాన్ని ప్రతిఘటిస్తామని, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని, ఉద్యోగం, విద్య, ఆరోగ్యం, ఆహారం, గృహం, గౌరవం కోసం పోరాటాలు చేస్తామనే స్పష్టమైన సందేశాన్ని భారతదేశ ప్రజలకు సీపీఐ మహాసభ ద్వారా అందిస్తామని రాజా అన్నారు.
మరోవైపు అంతర్జాతీయంగా తీవ్రమైన సంక్షోభం కొనసాగుతోందని, పలస్తీనా ప్రజల బాధలు కొనసాగుతున్నాయని రాజా అన్నారు. గాజాలో తరాలకు తరాలను ఇజ్రాయిల్‌ తుడిచిపెడుతున్నదని, దానికి అమెరికా సామ్రాజ్యవాదం సంపూర్ణ మద్దతునిస్తున్నదని విమర్శించారు. టారిఫ్‌లను వివిధ దేశాలను భయపెట్టే ఆయుధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మార్చుకున్నారని, దిగజారుతున్న అమెరికా, పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని కోల్పోకుండా ప్రయత్నిస్తున్నాడని అన్నారు. ప్రజల మధ్య తీవ్ర ఆదాయ అంతరాలు పెరుగుతున్నాయని, కార్మికులను దోచుకోవడం పెరిగిందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు