. కర్తవ్‌్యపథ్‌లో భారత సైనికశక్తిని చాటేలా పరేడ్
. ‘ఆపరేషన్ సిందూర్’ ఆయుధ వ్యవస్థను ప్రదర్శించిన త్రివిధదళాలు
. పరేడ్‌లో పాల్గొన్న ఈయూ సైనిక బృందం
. జాతీయ జెండా ఎగురవేసిన రాష్ట్రపతి ముర్ము
. ముఖ్య అతిథులుగా హాజరైన ఈయూ నేతలు
న్యూదిల్లీ: దేశ రక్షణ సామర్ధ్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెబుతూ దిల్లీలోని కర్తవ్య పథ్‌లో భారత 77వ గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. తొలుత రాష్ట్రపతి భవన్ నుంచి విదేశీ అతిథులతో కలిసి రాష్ట్రపతి సంప్రదాయ గుర్రపు బగ్గీలో అశ్విక దళంతో కలిసి కర్తవ్యపథ్‌కు చేరుకున్నారు. కర్తవ్య పథక్‌కు చేరుకున్న రాష్ట్రపతికి, విదేశీ అతిథులు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్‌కు ఉపరాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు స్వాగతం పలికారు. వేదికపైకి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. వెంటనే సైనికులు గౌరవ సూచకంగా శతఘ్నులు పేల్చారు. అనంతరం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగిడిన తొలి భారతీయుడు శుభాంశు శుక్లాకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అశోక్ చక్రను ప్రదానం చేశారు. తర్వాత జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో మొదట కళాకారులు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల కళాకారులు తమ వాద్య పరికరాలతో వన్ ఇండియా స్ఫూర్తిని చాటారు. నాలుగు ఎంఐ`17 హెలికాఫ్టర్లు సభికులపై పూల వర్షం కురిపించాయి. సైన్యంలో వివిధ విభాగాలకు నాయకత్వం వహిస్తున్నసైనిక ఉన్నతాధికారులు రాష్ట్రపతికి వందనం సమర్పించారు. అనంతరం కర్నల్ ఫ్రెడరిక్ సైమన్ నేతృత్వంలో యూరోపియన్ యూనియన్‌కు చెందిన సైనికులు వందనం సమర్పించారు. తర్వాత భారత సైనిక సామర్థ్యాన్ని చాటుతూ జరిగిన పరేడ్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఆశ్విక దళం తర్వాత వివిధ ఆయుధాలను ప్రదర్శించారు. ఇదే సమయంలో మూడు ధ్రువ్ హెలికాప్టర్లు ఆపరేషన్ సిందూర్ జెండాను ప్రదర్శించాయి. ఒక పక్క టీ-90 అర్జున యుద్ధ ట్యాంకులు, టీ-90 భీష్మ యుద్ధ ట్యాంకులు పరేడ్‌లో ప్రదర్శనకు రాగా అదే సమయంలో గగన తలంలో అపాచీ హెలికాఫ్టర్లు దూసుకెళ్లాయి. బీఎంపీ-3 ఇన్ ఫాంట్రీ యుద్ధ వాహనం, నాగ్ మిసైల్ వ్యవస్థను ప్రదర్శించారు. అన్ని రకాల ఉపరితలాలపైనా ప్రయాణించే వాహనాలు, మనుషులు లేకుండానే నియంత్రించే యుద్ధ వాహనాలను ప్రదర్శించారు. పైలెట్లు అవసరం లేకుండానే లక్ష్యాలను కచ్చితంగా మానవ రహిత విమానాలైన దివ్యాస్త్ర, శక్తిబాన్‌లు ఆకట్టుకున్నాయి. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ధనుష్, అమోఘ్ గన్ వ్యవస్థలు పరేడ్‌లో పాల్గొన్నాయి. 52 కాలిబర్ ఆర్టిలరీ గన్‌్స, దేశ రక్షణకే తలమానికమైన బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ, సూర్యస్త్ర క్షిపణి వ్యవస్థలు ఆకట్టుకున్నాయి. శత్రులక్ష్యాలను చేధించడమే కాకుండా ప్రత్యర్థులు ప్రయోగించే ఆయుధాలను నిర్వీర్యం చేసే శక్తి ఉన్న ఆకాశ్ గగనతల రక్షణ వ్యవస్థ, అభ్ర ఆయుధ వ్యవస్థలను పరేడ్‌లో ప్రదర్శించారు. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాల కోసం అభివృద్ధి చేసిన మీడియా రేంజ్ మిసైల్ వ్యవస్థ కూడా పరేడ్‌లో పాల్గొంది. భారత సైన్యానికి చెందిన డ్రోన్ శక్తిని ‘ఈగల్ ఆన్ ఆర్‌్మ’ పేరుతో ప్రదర్శించారు.
‘ఆపరేషన్ సిందూర్’ గర్జన
గణతంత్ర పరేడ్‌లో భాగంగా పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారత్ చేపట్టిన భారీ సైనిక చర్య ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంతో రూపొందించిన త్రివిధ దళాల శకటం అందరినీ ఆకట్టుకుంది. ఈ శకటం దేశ సైనిక పటిమను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. త్రివిధ దళాల ఏకీకృత పోరాట పటిమను ప్రతిబింబిస్తూ ‘విక్టరీ త్రూ జాయింట్‌నెస్’ అనే ఇతివృత్తంతో ఈ శకటాన్ని తీర్చిదిద్దారు. యుద్ధ సమయంలో వ్యూహాత్మక ప్రణాళికలు, క్షేత్రస్థాయిలో వాటి అమలు, దళాల మధ్య సమన్వయం ఎలా ఉంటుందో ఈ శకటం కళ్లకు కట్టింది. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్‌లోని నిర్ణయాత్మక సైనిక పోరాటంలో వాయుసేన జరిపిన కచ్చితమైన దాడులు, సముద్ర రంగంలో నౌకాదళం చూపిన తిరుగులేని ఆధిపత్యం, పదాతి దళం శత్రు స్థావరాలను ధ్వంసం చేసిన తీరును ఇందులో అద్భుతంగా ప్రదర్శించారు. భారత రక్షణ దళాలు భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మిషన్-ఓరియెంటెడ్ ఫోర్‌్సగా ఎలా రూపాంతరం చెందాయో ఈ ప్రదర్శన చాటిచెప్పింది. మరోవైపు ఆయుష్ మంత్రిత్వ శాఖ రూపొందించిన శకటం భారత సాంప్రదాయ వైద్య గొప్పతనాన్ని, దానిని ప్రజారోగ్య వ్యవస్థలోకి ఎలా విలీనం చేస్తున్నారో వివరించింది. వందేమాతరం, ఆత్మనిర్భర్ భారత్, ప్రధానమంత్రి పిలుపునిచ్చిన ‘పంచ ప్రాణ్’ స్ఫూర్తితో ఈ శకటాన్ని తీర్చిదిద్దారు.
అమరవీరులకు ప్రధాని నివాళి
అంతకుముందు గణతంత్ర దినోత్సవం వేళ దేశం కోసం పోరాడిన అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. తొలుత దిల్లీలోని వార్ మెమోరియల్ వద్దకు వెళ్లిన ప్రధానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు స్వాగతం పలికారు. అనంతరం వార్ మెమోరియల్ వద్దకు చేరుకున్న ప్రధాని మోదీ పుష్పాంజలి సమర్పించారు. దేశం కోసం పోరాడిన వీరులకు, త్రివిధ దళాల అధిపతులతో కలిసి వందనం చేశారు. తర్వాత అక్కడి పుస్తకంలో తన సందేశం రాశారు.
వేడుకలను వీక్షించిన రాహుల్‌గాంధీ
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ గణతంత్ర వేడుకలకు హాజరయ్యారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, దిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా పక్కనే రాహుల్ గాంధీ నిలబడి పరేడ్‌ను వీక్షించారు. తెల్లటి టీ-షర్‌్ట ధరించిన రాహుల్ గాంధీ కవాతును నిశితంగా గమనిస్తూ కనిపించారు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ సహా అనేకమంది కేంద్ర మంత్రులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.


