Homeఅజిత్‌ పవార్‌ దుర్మరణం

అజిత్‌ పవార్‌ దుర్మరణం

- Advertisement -

బారామతిలో కుప్పకూలిన విమానం

. మరో నలుగురు మతి
. ముంబై నుంచి బయలుదేరిన డిప్యూటీ సీఎం
. ల్యాండింగ్‌ సమయంలో దుర్ఘటన
. ఉన్నతస్థాయి విచారణకు డీజీసీఏ ఆదేశం
. ప్రముఖుల సంతాపం

మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్‌ పవార్‌ (66) విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. బుధవారం ఉదయం బారామతి విమానాశ్రయంలో ల్యాండింగ్‌ సమయంలో ఆయన ప్రయాణిస్తున్న చార్టర్‌్డ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. కింద పడిన విమానం రెండు ముక్కలైంది. విమానం శకలాలు చెల్లాచెదురుగా పడగా… మంటలు, దట్టమైన పొగలు వ్యాపించాయి.

ముంబై: మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్‌ పవార్‌ (66) విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. బుధవారం ఉదయం బారామతి విమానాశ్రయంలో ల్యాండింగ్‌ సమయంలో ఆయన ప్రయాణిస్తున్న చార్టర్‌్డ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. కింద పడిన విమానం రెండు ముక్కలైంది. విమానం శకలాలు చెల్లాచెదురుగా పడగా… మంటలు, దట్టమైన పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే అంబులెన్సులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ హఠాత్పరిణామంతో మహారాష్ట్ర రాజకీయ వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. ప్రమాదంలో అజిత్‌ పవార్‌తో పాటు విమానంలో ఉన్న మరో నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఇద్దరు అజిత్‌ పవార్‌ వ్యక్తిగత సిబ్బంది కాగా, మరో ఇద్దరు పైలెట్లు ఉన్నారు. భౌతికకాయాలు గుర్తు పట్టడానికి వీలులేకుండా కలిపోయాయి. చేతి గడియారం ఆధారంగా అజిత్‌ పవార్‌ భౌతికకాయాన్ని గుర్తించారు.
స్థానిక ఎన్నికల ప్రచారం నిమిత్తం అజిత్‌ పవార్‌ తన భద్రతా సిబ్బందితో కలిసి ముంబై నుంచి సొంత నియోజకవర్గం బారామతికి ‘లియర్‌ జెట్‌ 45’ అనే ప్రైవేట్‌ చార్టర్‌్డ విమానంలో బయలుదేరారు. ఉదయం 8:48 గంటల ప్రాంతంలో బారామతి విమానాశ్రయంలో ల్యాండ్‌ అవుతున్న సమయంలో విమానం రన్‌వే పక్కకు దూసుకెళ్లి ఒక్కసారిగా పేలిపోయింది. మంటలు భారీగా ఎగిసిపడటంతో విమానం పూర్తిగా ధ్వంసమైంది. బారామతి ఎయిర్‌ పోర్‌్ట మేనేజర్‌ శివాజీ తవారే ఈ ప్రమాదాన్ని ధృవీకరిస్తూ ‘విమానం ల్యాండింగ్‌ సమయంలో నియంత్రణ కోల్పోయి రన్‌వే పక్కకు వెళ్లిపోయింది. ప్రమాద తీవ్రతకు విమానం ముక్కలై మంటలు అంటుకున్నాయి’ అని తెలిపారు. ఈ క్రమంలోనే విమానంలో ఉన్న వారంతా ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు భావిస్తున్నారు. ముంబై నుంచి బయల్దేరిన గంట తర్వాత విమానంలో సమస్య తలెత్తింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ సమయంలో విమానం అదుపుతప్పి కూలిపోయింది. ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద తీవ్రతకు విమానం రెండు ముక్కలైంది. ప్రమాదంలో అజిత్‌ పవార్‌తో పాటు ముంబై పీఎస్‌ఓ వదీప్‌జాదవ్‌, కెప్టెన్‌ సుమిత్‌ కపూర్‌, కెప్టెన్‌ శాంభవి పాఠక్‌, ఫ్లైట్‌ అటెండెంట్‌ పింకీ మాలి మరణించినట్లు డీజీసీఏ తెలిపింది.
అజిత్‌ పవార్‌ 1959 జులై 22న జన్మించారు. ఆయన తండ్రి అనంత్‌రావ్‌ పవార్‌… సీనియర్‌ రాజకీయ నాయకుడు, మహారాష్ట్ర మాజీ సీఎం శరద్‌పవార్‌కు సోదరుడు. బాబాయి శరద్‌పవార్‌ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అజిత్‌పవార్‌… 1982లో తొలిసారి కార్పొరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీ బోర్డుకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 16 ఏళ్ల పాటు పూణే జిల్లా సెంట్రల్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ చైర్మన్‌గా వ్యవహరించారు. 1991లో తొలిసారి బారామతి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అనంతరం బాబాయి శరద్‌ పవార్‌ కోసం ఆ సీటు త్యాగం చేసి…రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. 1991 ఉప ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్లు మహారాష్ట్ర ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. అజిత్‌ పవార్‌కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. భార్య సునేత్ర పవార్‌ రాజ్యసభ సభ్యురాలుగా కొనసాగుతున్నారు.
మేడే కాల్‌్స రాలేదు: డీజీసీఏ
అజిత్‌ పవార్‌ ప్రయాణిస్తున్న విమానం కూలిపోయిన ఘటనపై డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) స్పందించింది. ల్యాండింగ్‌ సమయంలో రన్‌వేను గుర్తించడంలో పైలట్లకు ఇబ్బందులు ఎదురైనట్లు పేర్కొంది. మొదటిసారి రన్‌వేపై విమానం ల్యాండింగ్‌కు పైలట్‌ ప్రయత్నించారని, కానీ సరిగ్గా కనిపించకపోవడంతో గాల్లోనే చక్కర్లు కొట్టినట్లు వెల్లడించారు. రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించే ముందు గో అరౌండ్‌ పాటించినట్లు సమాచారం ఉందని, ఈ సమయంలో పైలట్ల నుంచి ఆపదలో ఉన్నామని తెలియజేసే ఎలాంటి మేడే కాల్‌్స రాలేదని డీజీసీఏ వెల్లడించింది. ఈ ప్రమాదంపై డీజీసీఏ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగిందా లేక ల్యాండింగ్‌ సమయంలో ఏదైనా పొరపాటు జరిగిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. బారామతి విమానాశ్రయం ఇటీవల మహారాష్ట్ర ఎయిర్‌పోర్‌్ట డెవలప్‌మెంట్‌ కంపెనీ (ఎంఏడీసీ) పరిధిలోకి వచ్చింది.
వెలుతురు లోపమే కారణం: మంత్రి రామ్మోహన్‌ నాయుడు
అజిత్‌ పవార్‌ ప్రయాణిస్తున్న విమాన ప్రమాదానికి వెలుతురు సరిగా లేకపోవడమే కారణమని ప్రాథమిక నిర్ధారణ జరిగిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు ప్రకటించారు. రన్‌వే కనిపిస్తుందా లేదా అని పైలట్లను బారామతి ఏటీసీ అధికారులు అడిగారని, కనిపించడం లేదనే సమాధానం వచ్చిందన్నారు. దాంతో విమానం గాల్లో కొంతసేపు చక్కర్లు కొట్టినట్లు కేంద్ర మంత్రి వివరించారు.
రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించే సమయంలో రన్‌వే కనిపిస్తుందా? అని ఏటీసీ అడిగినప్ప్పుడు పైలట్లు సానుకూలంగా స్పందించినట్లు తెలిసిందన్నారు. దీంతో ల్యాండింగ్‌ కోసం ఏటీసీ క్లియరెన్‌్స ఇచ్చిందని, ఆ వెంటనే విమానం కూలిపోయిందన్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం కోసం చూస్తున్నామని, దీనిపై పారదర్శకంగా పూర్తిస్థాయి దర్యాప్తు చేపడతామన్నారు. ఇందుకోసం ఇప్పటికే డీజీసీఏ, ఏఏఐబీ బృందాలు పూణే చేరుకున్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఘటనా స్థలాన్ని మంత్రి పరిశీలించారు.
రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల సంతాపం
విమాన ప్రమాదంలో అజిత్‌ పవార్‌ మృతి చెందడంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివిధ రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులు స్పందించారు. ‘బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో అజిత్‌ పవార్‌ సహా పలువురు మరణించడం చాలా బాధాకరం. అజిత్‌ పవార్‌ మరణం కోలుకోలేని నష్టం. మహారాష్ట్ర, సహకార రంగం అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబ సభ్యలు, మద్దతుదారులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా’ అని రాష్ట్రపతి ట్వీట్‌ చేశారు. ‘అజిత్‌ పవార్‌ ప్రజల నాయకుడు, అట్టడుగు స్థాయి నుంచి బలమైన సంబంధాలు కలిగి ఉన్నారు. మహారాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి ముందంజలో ఉండి కష్టపడి పనిచేస్తారు. పరిపాలనా విషయాలపై అవగాహన, పేదలు, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించాలనే మక్కువ ఎక్కువ. ఆయన అకాల మరణం చాలా దిగ్భ్రాంతికరమైనది, విచారకరం. ఆయన కుటుంబానికి, అభిమానులకు నా సంతాపం’ అని మోదీ ట్వీట్‌ చేశారు.
సమగ్ర దర్యాప్తు చేపట్టాలి: మమత
అజిత్‌ పవార్‌ ఆకస్మిక మరణం గురించి తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని పశ్చిమ బంగాల్‌ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. పవార్‌ కుటుంబానికి, ఆయన అనుచరులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాన్నారు. ఈ ప్రమాద ఘటనపై సుప్రీంకోర్టు నేతత్వంలో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులను కోరుతున్నానని మమత సంతాపాన్ని తెలియజేశారు. అజిత్‌ పవార్‌ మృతి వార్త చూడగానే దిగ్భ్రాంతికి గురయ్యానని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది విచారం వ్యక్తం చేశారు. పార్టీల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ ప్రజల కోసం తామంతా కలిసే పని చేశామన్నారు. ఆయన నిరంతరం రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసమే ఆలోచించేవారన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు