Friday, March 6, 2026
Homeక్రీడలుఅభిషేక్‌పై అమీర్ విమర్శలు… అశ్విన్ కౌంటర్

అభిషేక్‌పై అమీర్ విమర్శలు… అశ్విన్ కౌంటర్

- Advertisement -

నేటి మ్యాచ్
శ్రీలంక x పాకిస్తాన్రా త్రి 7 గంటలకు

న్యూదిల్లీ: టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ శైలిపై పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ చేసిన ‘స్లాగర’ విమర్శలను భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తిప్పికొట్టాడు. వరుస వైఫల్యాల తర్వాత జింబాబ్వేపై అద్భుత అర్ధ సెంచరీతో ఫామ్‌లోకి వచ్చిన అభిషేక్‌కు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కూడా మద్దతుగా నిలిచాడు. టీ20 ప్రపంచకప్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లలో డకౌట్ కావడంతో అభిషేక్ శర్మపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మహ్మద్ అమీర్ స్పందిస్తూ, అభిషేక్ కేవలం ఒక స్లాగర్ అని, అతని వద్ద డిఫెన్సివ్ టెక్నిక్ లేదని వ్యాఖ్యానించాడు. ఈ విమర్శలపై తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన అశ్విన్, అమీర్ కు దీటుగా బదులిచ్చాడు. “అభిషేక్ శర్మను స్లాగర్ అంటూ అమీర్ చేసిన వ్యాఖ్యల వీడియో ఒకటి చక్కర్లు కొడు తోంది. నేను ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. అతని ఆట గురించి ఎవరైనా ఏమైనా చెప్పొచ్చు, కానీ అతను స్లాగర్ మాత్రం కాదు. ప్రస్తుతం క్రికెట్‌లో అత్యంత ఆకర్షణీయమైన బ్యాట్ స్వింగ్ ఉన్న ఆటగాళ్లలో అతను ఒకడు. మనందరికీ తెలుసు యువరాజ్ సింగ్ అతని మెంటార్ అని. బహుశా యువరాజ్ కంటే కూడా అభిషేక్‌కు మెరుగైన బ్యాట్ స్వింగ్ ఉంది” అని అశ్విన్ అన్నాడు. ప్రతి బంతిని బలంగా బాదాలనే ఉద్దేశంతో ఆడటం వల్లే కొందరు అతన్ని స్లాగర్‌గా పొరబడుతు న్నారని వివరించాడు.
మరోవైపు జింబాబ్వేతో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో అభిషేక్ కేవలం 30 బంతుల్లో 55 పరుగులు చేసి ఫామ్‌లోకి వచ్చాడు. ఈ ఇన్నింగ్స్‌పై సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు. “ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో అభిషేక్ తనపై వస్తున్న సందేహాలను పటాపంచలు చేశాడు. అతను చాలా పద్ధతిగా తన ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఈ మ్యాచ్‌లో అతను డిఫెన్సివ్ షాట్ ఆడటం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే సాధారణంగా అభిషేక్ అలా ఆడడు” అని గవాస్కర్ విశ్లేషించాడు.
సంజు శాంసన్‌ను నిందించలేం: గవాస్కర్
చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జింబాబ్వేతో జరిగిన కీలక మ్యాచ్‌లో టీమఇండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మతో కలిసి సంజుశాంసన్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. 15 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌ల సాయంతో సంజు 24 పరుగులు సాధించాడు. మొదటి వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. వేగంగా ఆడే క్రమంలో బ్లెస్లింగ్ ముజారబానీ బౌలింగ్‌లో ర్యాన్‌బర్ల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో తనకు దక్కిన ఆరంభాన్ని పెద్ద స్కోర్‌గా మలచలేక పోయాడు. ఈ నేపథ్యంలో సంజుశాంసన్‌కు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మద్దతుగా నిలిచాడు. పవర్‌ప్లేలో వేగంగా పరుగులు రాబట్టే క్రమంలో అతడు అవుటయ్యాడ న్నాడు. ‘మనం అతడిని నిందించలేం. పవర్‌ప్లేలో ఫీల్డింగ్ నిబంధనల నుంచి ప్రయోజనం రాబట్టే క్రమంలో అతడు అవుటయ్యాడు’ అని సునీల్ గవాస్కర్ అన్నాడు.
ఈ మ్యాచ్‌లో సంజుశాంసన్, అభిషేక్ శర్మ ఇద్దరూ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్‌తో అదరగొట్టారు. వీరు ఇచ్చిన మంచి ఆరంభం… టీమఇండియా భారీ స్కోర్ సాధించేందుకు పునాదిలా పనికి వచ్చింది. ఈ మ్యాచ్‌లో 72 పరుగుల తేడాతో టీమఇండియా విజయం సాధించడంతో నెట్ రన్‌రేట్ -3.800 నుంచి -0.100కు మెరుగైంది. ఇక ఆదివారం విండీస్‌తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తే నేరుగా సెమీస్‌కు వెళుతుంది.
ఇదే జోరు కొనసాగించండి: సచిన్
జింబాబ్వేపై టీమిండియా భారీ విజయం సాధించడంపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ… భారత జట్టును ప్రశంసించాడు. ‘ఎక్స’ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. “తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లు ఆటగాళ్ల స్వభావాన్ని బయటపెడతాయి. 256 పరుగుల భారీ స్కోర్ బాదారు. ఈ ప్రపంచకప్‌లో ఇదే అత్యధిక స్కోరు. మ్యాచ్ ఆద్యంతం జట్టు కనబరిచిన పట్టుదల అద్భుతం. బాగా ఆడారు, ఇదే జోరును తర్వాతి మ్యాచ్‌లోనూ కొనసాగించండి. ఈ టోర్నీలో అద్భుతంగా ఆడుతున్న జింబాబ్వే జట్టుకు కూడా అభినందనలు” అని సచిన్ పేర్కొన్నాడు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు