Wednesday, February 18, 2026
Homeఆంధ్రప్రదేశ్అమరావతిలో శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్

అమరావతిలో శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్

- Advertisement -

డబ్ల్యూఈఎఫ్ సదస్సులో మంత్రి నారా లోకేశ్
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : క్వాంటమ్ కంప్యూటింగ్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగమని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. నైపుణ్యాలు, కొలాబరేషన్ ద్వారా క్వాంటం ఆవిష్కరణలను వేగవంతం చేయడం అనే అంశంపై వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా జరిగిన సదస్సులో మంత్రి లోకేశ్ ప్రసంగిస్తూ… క్వాంటం ఇండెక్స్ 2025 ప్రకారం 2018 నుంచి క్వాంటం నైపుణ్య అవసరాలు దాదాపు మూడు రెట్లు పెరగ్గా… 2020 నుంచి క్వాంటం ఉద్యోగాలు 180శాతానికి పెరిగాయన్నారు. ప్రస్తుత ప్రపంచ క్వాంటమ్ మార్కెట్ కు అవసరమైన అభ్యర్థుల్లో మూడోవంతు (30వేలమంది) మాత్రమే అర్హత కలిగిన నిపుణులు ఉన్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా 176 విశ్వవిద్యాలయాలు క్వాంటం ప్రోగ్రామ్‌లలో విద్యను అందిస్తుండగా, 29 మాత్రమే గ్రాడ్యుయేట్ డిగ్రీలను అందిస్తున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జులై 2026 నాటికి దక్షిణాసియాలో మొట్టమొదటి, అత్యంత శక్తివంతమైన క్వాంటం కంప్యూటర్ – 133-క్విట్ హెరాన్ ప్రాసెసర్‌తో కూడిన ఐబీఎం క్వాంటం సిస్టమ్ 2ను ఐబీఎం, టిసీఎస్ భాగస్వామ్యంతో ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. ఇది భారతదేశంలోని మొట్టమొదటి డెడికేటెడ్ క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ కేంద్రం అవుతుందన్నారు. 50 ఎకరాల్లో గ్లోబల్ క్వాంటం ల్యాబ్‌లతో పరిశ్రమ-ఎంబెడెడ్ పరిశోధన కేంద్రాలు, ప్రముఖ కంపెనీలతో ఉమ్మడి పీహెచ్ డీ, పోస్ట్-డాక్టోరల్ ప్రోగ్రామ్‌లు, 50వేలకు పైగా అభ్యాసకుల కోసం క్వాంటం-రెడీ స్కిల్లింగ్ పైప్‌లైన్‌లు ఇందులో అంతర్భాగంగా ఉంటాయని తెలిపారు. మూడు దశల్లో క్వాంటం నైపుణ్య పైప్‌లైన్‌ను నిర్మిస్తున్నామపి తెలిపారు.
విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయండి
టెక్నాలజీ, డిజిటల్, కన్సల్టింగ్ సేవల్లో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన యాక్సెంచర్ సంస్థ చీఫ్ స్ట్రాటజీ సర్వీస్ ఆఫీసర్ మనీష్ శర్మతో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ దావోస్ లో భేటీ అయ్యారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో మౌలిక సదుపాయాలు, ప్రతిభ లభ్యత, పెరుగుతున్న సాంకేతిక పర్యావరణ వ్యవస్థను ఉపయోగించుకుని ఏఐ, క్లౌడ్, డిజిటల్ కార్యకలాపాలపై దృష్టిసారించడానికి విశాఖలో గ్లోబల్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు.
కేంబ్రిడ్జి యూనివర్సిటీ వీసీ డెబ్బీ ప్రెంటిస్ తో మంత్రి లోకేష్ భేటీ
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ డెబ్బీ ప్రెంటిస్ తో మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో 8-10 తరగతుల విద్యార్థులకు కెపాసిటీ బిల్డింగ్ లో భాగంగా వాతావరణ మార్పులపై అవగాహన, సుస్థిరత, భవిష్యత్ నైపుణ్యాలపై కేంబ్రిడ్జి సర్టిఫైడ్ ఆన్ లైన్ కోర్సులను ప్రారంభించాలని కోరారు. ఏపీలోని యూనివర్సిటీలతో కలిసి జాయింట్ రీసెర్చి, కరిక్యులమ్ డెవలప్ మెంట్, ఫ్యాకల్టీ ఎక్స్ చేంజీలపై నిర్మాణాత్మక ఒప్పందానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
డబ్ల్యూఈఎఫ్ గవర్నమెంట్ ఎఫైర్స్ హెడ్ మరూన్ ఖైరౌజ్ తో భేటీ
వరల్డ్ ఎకనమిక్ ఫోరం గవర్నమెంట్ ఎఫైర్స్ హెడ్ మరూన్ ఖైరౌజ్ తో భేటీ సందర్భంగా పైలట్ లు, పాలసీ అవుట్ పుట్ లకు వ్యూహాత్మక మార్గదర్శకత్వం అందించడానికి ఇంధన సంస్థలు, సైబర్ సెక్యూరిటీ సంస్థలు, బీమా సంస్థలు, మల్టీలేటరల్ సంస్థల అధినేతలతో కూడిన గ్లోబల్ నిపుణుల అడ్వయిజరీ ప్యానల్ ఏర్పాటుపై లోకేశ్ చర్చించారు. ఏపీలో బ్యాంకబుల్ ఎనర్జీ ట్రాన్సిషన్, సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్టుల స్థాపనపై దృష్టి సారించేలా ప్రధాన పెట్టుబడిదారులతో డబ్ల్యూఈఎఫ్ ఆధ్వర్యాన భారత్ లేదా దావోస్ లో రౌండ్ టేబుల్ నిర్వహించాల్సిందిగా కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు