. కరిగిపోతున్న కన్వీనర్ కోటా
. డీమ్డ్ వర్సిటీలతో విద్యార్థులకు ఎసరు
. ప్రైవేట్ కళాశాలల్లో విచ్చలవిడి దోపిడీ
. ఉన్నత విద్యామండలి నిర్లక్ష్యం
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: ఏపీఈఏపీసెట్
2025 కౌన్సెలింగ్‌కు షెడ్యూలు రాకముందే…అంగట్లో సరుకులా ఇంజినీరింగ్ సీట్లు విక్రయిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలల్లో బ్రాంచికి ఒక ధర చొప్పున యాజమాన్యాలు సీట్లు భర్తీ చేస్తున్నాయి. ఆలస్యం చేస్తే సీట్లు ఉండవు… త్వరప డండంటూ విద్యార్థులు… వారి తల్లిదండ్రులను మభ్యపెడుతున్నారు. ఇందుకోసం ఒక ప్రత్యేక పీఆర్వో వ్యవస్థను పెట్టి..ప్లేస్‌మెంట్ల పేరుతో వారిని ఆకర్షిస్తూ, భారీ ఫీజుల దందాకు పాల్పడుతున్నారు. 2025`26 విద్యా సంవత్సరానికిగాను సీఎస్‌ఈ, దాని అనుబంధ ఏఐ, ఎంఎల్, డేటాసైన్స్ బ్రాంచీలకు కొద్దిగా పేరొందిన ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలల్లో రూ.మూడు లక్షల నుంచి రూ.ఏడు లక్షలకుపైగా ఏడాదికి నిర్ధారిస్తున్నారు. ఆ తర్వాత కేటగిరీలో రూ.మూడు లక్షల నుంచి రూ.నాలుగు లక్షల వరకు ఫీజులు దండుకుంటున్నారు. ఒక విద్యార్థి ఇంజినీరింగ్ కోర్సు పూర్తి చేయాలంటే… కంప్యూటర్ కోర్సులకు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పైగా ఖర్చవుతోంది. దానికితోడు హాస్టల్, బస్సు ఫీజులు అదనం. ఉన్నత విద్యామండలి పర్యవేక్షణ లేకపోవడం, ప్రభుత్వం నుంచి కఠినమైన చర్యలకు ఆదేశించకపోవడమే దోపిడీకి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జేఎన్టీయూ కాకినాడ, విజయనగరం, అనంతపురం పరిధిలో మొత్తం 317 ఇంజినీరింగ్ కళాశాలలు న్నాయి. వాటితోపాటు డీమ్డ్, ప్రైవేట్ యూనివర్సిటీలు మరో తొమ్మిది ఉన్నాయి. కొత్తగా డీమ్డ్ కోసం మరో 10 ఇంజి నీరింగ్ కళాశాలలు దరఖాస్తు చేసుకు న్నాయి. గతేడాది కౌన్సెలింగ్ నాటికి ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలల్లో కలిపి లక్షా 43 వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది వాటి సంఖ్య పెరగనుంది. ప్రతిఏటా ఇంజినీరింగ్ కళాశాలలు లేదా ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు సైతం డీమ్డ్‌గా ఉన్నతీకరణకు దరఖాస్తు చేసుకోవడం, వాటికి అనుమతులు రావడం పరిపాటిగా మారింది. ఒక్కసారి డీమ్డ్‌గా విస్తరించాక… ఆయా ఇంజినీరింగ్ కళాశాలలు ఇక పూర్తిగా యాజమాన్యం పరిధిలోకి వెళ్లిపోతాయి. దీంతో ఏపీఈఏపీసెట్ వెబ్ కౌన్సెలింగ్‌లోకి అవి రాకపోవడంతో కన్వీనర్ సీట్లు కుదించుకుపోతాయి. ఏపీఈఏపీసెట్ ద్వారా 70 శాతం కన్వీనర్ కోటా (ఏ`కేటగిరి) కింద అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కళాశాలలు భర్తీ చేయాలి. మరో 30 శాతం కోటా ఆయా ప్రైవేట్ ఇంజినీరింగ్ యాజమాన్యానికి సొంతగా బి.కేటగిరీ కింద భర్తీ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దీన్ని అదునుగా తీసుకుని ఏపీఈఏపీసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కాకముందే… యాజమాన్య కోటా భర్తీకి తెరదీశారు. ఒక్కో సీటుకు లక్షల్లో బేరం పెట్టి ముందస్తుగా అడ్వాన్సులు తీసుకుని భర్తీ చేస్తున్నారు. ఎవరైనా ఏపీఈఏపీసెట్ ద్వారా తమ కళాశాలను ఎంచుకుని సీటు సాధిస్తే ఆ తర్వాత కన్వీనర్ కోటా కింద పరిగణిస్తామనే హామీలిస్తున్నారు.
కన్వీనర్ కోటాకు డీమ్డ్ గండి
కన్వీనర్ కోటా సీట్లకు డీమ్డ్ విశ్వవిద్యాలయాలు గండికొడుతున్నాయి. ప్రతేటా కొత్తగా డీమ్డ్ విశ్వవిద్యాలయాల ఉన్నతీకరణతో ఏపీఈఏపీసెట్ కన్వీనర్ సీట్లు తగ్గిపోతున్నాయి. దీంతో కొద్దిగా పేరొందిన కళాశాలల్లో పేద, మధ్యతరగతి వర్గాల విద్యార్థులు ప్రవేశించడం కష్టతరంగా మారింది. గత వైసీపీ హయాంలో 2019 నుంచి ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లోను 35 శాతం కన్వీనర్ కోటా సీట్లను ప్రవేశపెట్టింది. ఇలా సీట్లు సాధించిన వారికి ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలులో ఉండేది. ఫీజు రీయింబర్స్‌మెంట్ లేని వారికి కన్వీనర్ కోటా కింద నిర్ధారించిన ఏడాడికి రూ.70 వేల ఫీజు కడితే సరిపోయేది. ఈ క్రమంలో గత విద్యా సంవత్సరం నుంచి ఈ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో కన్వీనర్ కోటా ఫీజును రూ.70 వేల నుంచి రూ.లక్షా 10 వేలకుపైగా పెంచారు. గతేడాది నుంచి విజయవాడ కానూరు వీఆర్ సిద్ధార్థ కళాశాల డీమ్డ్ విశ్వవిద్యా లయంగా విస్తరించింది. దీంతో అక్కడ కన్వీనర్ కోటా కింద ఉన్న 70 శాతం సీట్లు కౌన్సెలింగ్ పరిధిలోకి రావడం లేదు. నంబూరులో వీవీఐటీ ఇంజినీరింగ్ కళాశాల డీమ్డ్‌గా ఉన్నతీకరణ అయింది. ఇదే జరిగితే… అక్కడ గతంలో ఉన్న 70 శాతం కన్వీనర్ సీట్లు గల్లంతై పోతాయి. దీంతో పాటు పేరొందిన మరో ప్రైవేట్ విశ్వవిద్యాలయం డీమ్డ్‌గా అనుమతులు పొందినట్లు తెలిసింది. దానివల్ల అక్కడ కన్వీనర్ కోటా కింద ఇచ్చే 35 శాతం సీట్లు కుదించుకుపోనున్నాయి. ఇలా… ప్రతి సంవత్సరం రాష్ట్రంలో డీమ్డ్ విశ్వవిద్యాలయాలు పెరగడంతో విద్యార్థులకు ఏపీఈఏపీసెట్‌లో మెరుగైన ఇంజినీరింగ్ కళాశాలలు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్ని ఎంచుకునే అవకాశం లేకుండా పోతోంది. ఏపీఈఏపీసెట్‌లో మంచి ప్రతిభ చూపిన విద్యార్థులు సైతం అరకొర మౌలిక సౌకర్యాలు, బోధనా సిబ్బంది లేకుండా కొనసాగుతున్న ప్రైవేట్ కళాశాలల్లో చేరుతున్నారు. ఆర్థికంగా స్థిరపడిన వారంతా పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నారు.
నాసిరకం విద్యబోధన… సిబ్బంది కొరత
చాలా ఇంజినీరింగ్ కళాశాలల్లో బోధనా సిబ్బంది కొరత పీడిస్తోంది. దీంతో అక్కడ చేరిన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలేదు. ప్లేస్‌మెంట్ల పేరుతో రూ.20 వేలు అదనంగా వసూలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఏఐసీఈటీ నిబంధనల ప్రకారం ప్రతి ఇంజినీరింగ్ కళాశాలలో ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక బోధనా సిబ్బంది ఉండాలి. అదీ ఇంజినీరింగ్ కళాశాలలో అయితే ఎంటెక్ చదవాలి. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ ఉన్న వారికే ప్రాధాన్యతిస్తారు. కొన్ని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో బి.టెక్ విద్యార్థులకు… బి.టెక్ పూర్తయిన సీనియర్లతోనే బోధన కొనసాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. మరికొన్ని కళాశాలల్లో ఎంటెక్ ప్రస్తుతం చదువుతున్న వారితో పాఠాలు చెప్పిస్తున్నట్లు ప్రచారం.
గుంటూరు యూనివర్శల్ ఇంజినీరింగ్ కళాశాలతోపాటు చాలా చోట్ల సీఎస్‌ఈ బ్రాంచికి ఈ తరహా పరిస్థితులున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే ఉన్నత విద్యామండలికి ఫిర్యాదు చేసినా స్పందన కరువైంది. ప్రతి ఇంజినీరింగ్ కళాశాలకు సొంతంగా వెబ్‌సైట్‌లో వారి బోధనా సిబ్బంది, సీట్లు, విద్యార్థుల సంఖ్యతో ఉన్న తాజా డేటాను అందుబాటులో ఉంచడంలేదు. ఇంజినీరింగ్ కళాశాలల్లో ఉన్నత విద్యామండలి అధికారులు తనిఖీలు లేకపోవడంతోనే విచ్ఛలవిడిగా బోధన నెలకొందని, తద్వారా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. గతేడాది తరహాగానే ఈ విద్యా సంవత్సరం కౌన్సెలింగ్ జాప్యం అయ్యే పరిస్థితులున్నాయి.