Homeఇంధన ధరల పెంపుకు వ్యతిరేకంగాదేశవ్యాప్త పోరు: సీపీఐ

ఇంధన ధరల పెంపుకు వ్యతిరేకంగాదేశవ్యాప్త పోరు: సీపీఐ

- Advertisement -

న్యూదిల్లీ: ప్రజా వ్యతిరేక విధానాలపై మోదీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సీపీఐ పోరుబాటకు సిద్ధమైంది. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండట్టేందుకు దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను పది రోజులలో నాలుగు సార్లు పెంచడాన్ని మంగళవారం ఒక ప్రకటనలో ఆక్షేపించింది. కార్పొరేట్ ఆధారిత మోదీ ప్రభుత్వ నిజరూపం ఈ ధరల పెంపుదలతో బహిర్గతమైందని వ్యాఖ్యానించింది. ‘రోజుల వ్యవధిలో ఇంధన ధరలు లీటరుకు రూ.8 మేర పెరిగాయి. దిల్లీలో పెట్రోల్ లీటరు ధర రూ.102కు పెరుగగా, ముంబైలో రూ.111 పలుకుతోంది. పెరిగిన పెట్రో ధరలతో ఆహార ధరలు, వ్యవసాయ వ్యయం, రవాణా ఖర్చు మొత్తంగా జీవన వ్యయమే ప్రభావితమవుతోంది. ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన కార్మికులు, రైతులు, వేతన జీవులు, పేద వర్గాలను ఈ నిర్విరామ ద్రవ్యోల్బణం మరింతగా ఇబ్బంది పెడుతోంది’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గం పేర్కొంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలను సాకుగా చూపుతూ ధరలను పెంచుతూ మోదీ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోందని విమర్శించింది. కేవలం యుద్ధం ఇందుకు కారణం కాదని సీపీఐ నొక్కిచెప్పింది. మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాల వైఫల్యం, రూపాయి మారక విలువ స్థిరంగా పడిపోవడం, దిగుమతులపై ఆధారం పెరగడం, స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అమెరికా` ఇజ్రాయిల్‌కు దాసోహం చేయడం వంటివన్నీ ఈ పరిస్థితికి దారితీశాయని సీపీఐ వ్యాఖ్యానించింది. సామాన్యుల జీవితాలను పణంగా పెట్టేస్తూ కార్పొరేట్ల లాభాలకు రక్షణ కల్పించడం దుర్మార్గమని విమర్శించింది. ద్రవ్యోల్బణం, ఆర్థిక కష్టాల నుంచి ప్రజలకు విముక్తి కల్పించడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టింది. పెంచిన ధరలు తగ్గించేందుకుగాను సర్కారు మెడలు వంచుదాం కలిసి రండి అంటూ అన్ని వర్గాలకు సీపీఐ పిలుపునిచ్చింది. ప్రతిఘటన పోరాటాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దామని పేర్కొంది. చమురు కంపెనీలకు నష్టం పేరిట ధరలను పెంచుకుంటూ పోతోందని విమర్శించింది. వాస్తవాలకు భిన్నంగా ప్రభుత్వ ప్రకటనలు ఉంటున్నాయని పేర్కొంది. 2014 నుంచి అంతర్జాతీయ ముడి చమురు ధరలు తక్కువగా ఉన్నాగానీ బీజేపీ ప్రభుత్వం ఎక్పైజ్ సుంకాలు పెంచిందని సీపీఐ విమర్శించింది. ప్రస్తుత పెంపు విదేశీ పరిణామాల వల్ల కాదని… దీర్ఘకాలికంగా ప్రజా సంక్షేమాన్ని విస్మరించి… కార్పొరేట్ల లాభాలకు ప్రాధాన్యతిచ్చే విధానపరమైన కార్యాచరణ వల్లేనని పేర్కొంది. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలు, ఇంధన ధరల పెంపుదలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు