. మొరాయిస్తున్న సర్వర్లు
. నమోదు కోసం విద్యార్థుల పడిగాపులు
. వెబ్ కౌన్సెలింగ్‌లోకి 74 బ్రాంచీలు
. 13 నుంచి ఆప్షన్లు ప్రారంభం
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: ఏపీఈఏపీసెట్2025 వెబ్‌కౌన్సెలింగ్ నమోదులో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. అర్హత సాధించిన విద్యార్థులు తమ వివరాలను నమోదు చేసుకుని, ఫీజు చెల్లించేందుకు యత్నించినప్పటికీ..వెబ్‌సైట్ ఓపెన్ కావడంలేదు. కొంతసేపు సేవలు కొనసాగి, ఆ తర్వాత సర్వర్ మొరాయిస్తున్నట్లు విద్యార్థులు వాపోతున్నారు. తొలుత ఏపీఈఏపీసెట్ హాల్ టికెట్ నంబరు, పుట్టిన తేదీతో ప్రారంభం కావాల్సి ఉంది. ఆ ప్రక్రియ పూర్తయ్యాక ఫీజు చెల్లించాలి. ఈ ఫీజు చెల్లింపు కోసం అభ్యర్థులు చాలా సార్లు ప్రయత్నించాల్సి వస్తోంది. ఒక్కోసారి చెల్లించిన ఫీజు తిరిగి వారి ఖాతాలోకి వస్తోంది. దీంతో గంటల తరబడి ఇంటర్నెట్ సెంటర్లు, వ్యక్తిగత కంప్యూటర్ల ముందు విద్యార్థులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. ఆ తర్వాత సాయంత్రం నుంచి వెబ్‌సైట్ సేవలు అందుబాటులోకొచ్చాయి. హెల్ప్‌లైన్ నంబర్లకు విద్యార్థులు ఫోన్లు చేసినప్పటికీ సిబ్బంది స్పందించడం లేదని చెబుతున్నారు. ఈనెల 13వ తేదీ నుంచి వెబ్‌కౌన్సెలింగ్ ఆప్షన్లు ప్రారంభం కానుండగా… వెబ్ ఆప్షన్ల సమయం ముందుకు రావడంతో ఈలోగా తమ ఫీజు చెల్లింపు పరిస్థితేమిటని ఆందోళన చెందుతున్నారు. ఈనెల 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఫీజు చెల్లింపు నమోదు ప్రక్రియకు గడువు విధించారు. తొలి రెండు రోజులపాటు అనేక సమస్యలు ఎదురయ్యాయి. తాజాగా బుధవారం వెబ్‌సైట్ గంటల కొద్దీ ఓపెన్ కాలేదు.
కంప్యూటర్‌పైనే ఆశలు…
తొలి విడత ఏపీఈఏపీసెట్ కౌన్సెలింగ్‌లోకి 74 ఇంజినీరింగ్ బ్రాంచిలు అందుబాటులోకి రానున్నాయి. అందులో అత్యధికంగా కంప్యూటర్స్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్‌ఈ) బ్రాంచి, అనుబంధ కోర్సులు అధికంగా ఉన్నాయి. దాదాపు రెండు లక్షల సీట్లు కౌన్సెలింగ్‌లోకి అందుబాటులోకి రానున్నాయి. అటు ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యం కూడా విద్యార్థుల డిమాండ్లకు అనుగుణంగా కంప్యూటర్స్, వాటి అనుబంధ కోర్సుల కోసం దరఖాస్తు చేశాయి. ఇవన్నీ వెబ్ కౌన్సెలింగ్ ఆప్షన్ల నాటికి అనుమతి పొందాల్సి ఉంది. ఇక కోర్ ఇంజినీరింగ్ బ్రాంచీలుగా ఉన్న ఈసీఈ, మెకానికల్, సివిల్, ఈఈఈ, ఆటో మొబైల్ ఇంజినీరింగ్‌పై విద్యార్థులు అంతగా ఆసక్తి చూపడంలేదు. ఏపీఈఏపీసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులంతా అత్యధికంగా కంప్యూటర్ ఇంజినీరింగ్ సీట్లపైనే మొగ్గు చూపుతున్నారు. కంప్యూటర్స్‌లో సీఎస్‌ఈతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ), ఏఐడేటా సైన్స్, ఏఐమెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా అనలసిస్ట్, బ్లాక్ చైన్, ఐఓటీఆటోమేషన్, ఐఓటీ విత్ సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్ నెట్ వర్క్, కంప్యూటర్ సైన్స్‌బిజినెస్ సిస్టమ్, కంప్యూటర్ సైన్స్ డిజైన్, ఐటీ, ఐఓటీ, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ తదితర కంప్యూటర్, అనుబంధ రంగాల బ్రాంచిలతో సీట్లు అందుబాటులోకి రానున్నాయి. కంప్యూటర్ బ్రాంచిల తర్వాత ఈసీఈ, ఈఈఈ ఆప్షన్లను విద్యార్థులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇక తప్పనిసరి అయి, మంచి విశ్వవిద్యాలయం/కళాశాల అయితే చివరగా మెకానికల్, సివిల్ తదితర బ్రాంచిలను పెడుతున్నారు. గత విద్యా సంవత్సరాల నుంచి కంప్యూటర్, అనుబంధ బ్రాంచీలపైనే విద్యార్థులు మొగ్గుచూపుతున్నారు. దీంతో మిగిలిన కోర్ బ్రాంచీలకు నిరాదరణ ఎదురవుతోంది.


