Homeసంపాదకీయంకర్నాటక రైతుల విజయం

కర్నాటక రైతుల విజయం

- Advertisement -

దాదాపు గత నలభై నెలలుగా కర్నాటకలోని చెన్నరాయపట్న, మరో 13 గ్రామాల ప్రజలు చేస్తున్న పోరాటం చివరకు సుఖాంతమైంది. ప్రభుత్వం రైతుల భూమిని సేకరించాలనుకుంది. కానీ తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమిని అమ్మబోమని రైతులు దృఢ నిశ్చయంతో ఉన్నారు. అందువల్ల సమ్మె కట్టారు. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య రైతుల కోర్కెలను బేషరతుగా అంగీకరించినందు వల్ల రైతులు సమ్మె విరమించాలని నిర్ణయించారు. ముందుగా అనుకున్న ప్రకారమైతే జులై 25 న దేవనహళ్ల్లి చలో కార్యక్రమం తలపెట్టారు. ముఖ్యమంత్రి హామీవల్ల ఈ యాత్ర కూడా విరమించుకోవలసి వచ్చింది. కర్నాటక రైతుల ఆందోళనకు వివిధ పౌర సమాజం నుంచి సంపూర్ణమద్దతు సమకూరింది. సినీ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ లాంటి వారు రైతులకు అండగా నిలబడ్డారు. సుదీర్ఘ కాలం సమ్మె కొనసాగినా ప్రభుత్వానికి, ప్రభుత్వాధికారులకు రైతుల గోడు ఏమిటో అర్థం చేసుకునే తీరిక, ఓపిక లేకపోయింది. రైతుల నాడీ నిదానంలో ఇంతకాలం ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రైతుల ఆందోళనను బలప్రయోగంతో అణచి వేయాలని చూశారు. ఈ అణచివేతను ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, పౌర సమాజం ఉమ్మడిగా గట్టిగా ఎదుర్కొన్నాయి. ఈ వర్గాల మధ్య సంపూర్ణమైన ఐక్యత వ్యక్తమైంది. ఫ్రీడం పార్క్‌ వద్ద నిరంతరం భూమి సత్యాగ్రహ కొనసాగించారు. రైతుల సమస్యలను చర్చించడం కోసం సిద్ధ రామయ్య జులై నాల్గో తేదీన సమావేశం ఏర్పాటు చేశారు. ఆ రోజు వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నుంచి అపూర్వమైన మద్దతు లభించింది. సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) జాతీయ నాయకత్వం కూడా కర్నాటక రైతులకు అండగా నిలబడిరది. కర్నాటక శ్రామికులు, పేద, బడుగు రైతులు అపూర్వమైన సహకారం అందించారు. నాల్గో తేదీన జరిగిన సమావేశంలో రైతుల సమస్య పరిష్కరించడానికి పది రోజుల సమయం కావాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రభుత్వం రైతులకు అన్యాయం చేయదన్న ఉద్దేశంతో రైతులు ఈ గడువుకు అంగీకరించారు. ఈ పది రోజుల సమయాన్ని రైతుల సమస్య పరిష్కారానికి ఆలోచించిన దానికన్నా సమైక్యంగా పోరాడుతున్న రైతులలో చీలిక ఎలా తీసుకురావాలన్న అంశం మీదే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం ఓ వైపరీత్యం. రైతులు సమైక్యంగా పోరాడినందువల్ల ఈ కుట్రలన్నీ ఛేదించగలిగారు. ప్రతి గ్రామంలోనూ గ్రామ సంకల్ప సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలు రైతుల సమైక్యత ఎంత పటిష్టంగా ఉందో రుజువు చేసింది. ‘‘మా ప్రాణాలు పోయినా మా భూములు వదులుకోం’’ అని రైతులు భీష్మించారు. గత 15 వ తేదీన జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య వివేకవంతంగా వ్యవహరించారు. కర్నాటక ముఖ్యమంత్రితో రైతుల సమావేశం ఎక్కడికి దారి తీస్తుందోనని దేశమంతటా ఆందోళన వ్యక్తమైంది. ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ఎలాంటి శషభిషలకు పోకుండా రైతుల భూములు సేకరించాలన్న సంకల్పాన్ని విరమిస్తున్నామని ప్రకటించారు.
వివిధ వర్గాలవారు రైతుల ఆందోళనకు అండగా నిలబడడంవల్లే సిద్ధ రామయ్య హేతుబద్ధమైన నిర్ణయం తీసుకున్నారు. సిద్ధ రామయ్య రైతుల కోర్కెలను అంగీకరించడంలో రాహుల్‌గాంధీ పాత్ర కూడా ఉందంటున్నారు. కర్నాటక ప్రభుత్వం రైతుల నుంచి భూములు లాక్కోవాలని చేసిన ప్రయత్నాన్ని చివరకు ఉపసం హరించుకోవడం ఉమ్మడి విజయం కిందే లెక్క. సమైక్యంగా ప్రశ్నిస్తే ఏ ప్రభుత్వమైన దిగి రాక తప్పదని కర్నాటక రైతుల ఉద్యమం రుజువు చేసింది. భూ వినియోగం ఎలా ఉండాలి, దానికి అనుసరించవలసిన విధానం ఏమిటి అన్న అంశంపై ఏ రాష్ట్రంలోనూ నిర్దిష్ట విధానం ఏమీ లేదు. రైతులు ఆందోళనకు దిగితే మొదట బల ప్రయోగంతో ఆ ఉద్యమాన్ని విఫలం చేయడానికి ప్రయత్నిస్తారు. అదీ కుదరనప్పుడు ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న సంఘాల మధ్య తంపులు పెట్టి విడదీయాలని చూస్తారు. ఈ ఒత్తిడులన్నీ తట్టుకుని ఉద్యమకారులు నిలబడగలిగితేనే 2020 లో దిల్లీలో రైతుల ఆందోళన సుఖాంతమైంది. ఈ లోగా 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. జగమొండిగా పేరుపడ్డ ప్రధానమంత్రి మోదీ కూడా ఆ సమయంలో దిగిరాక తప్పలేదు. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోక తప్పలేదు. రైతులకు క్షమాపణ కూడా చెప్పవలసి వచ్చింది. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య అంత మొండిగా వ్యవహరించకపోవడం అభినందనీయం. కర్నాటక రైతుల నుంచి 1777 ఎకరాల భూమి సేకరించాలన్న కర్నాటక ప్రభుత్వ సంకల్పం వీగిపోక తప్పలేదు. కర్నాటక రైతుల విజయం నిజానికి దేశవ్యాప్తంగా రైతుల విజయం కిందే లెక్క. ప్రస్తుతానికి ఉద్యమం ఆగిపోయి ఉండవచ్చు. కానీ ఏ రాష్ట్రంలోనైనా అభివృద్ధి కార్యక్రమాల కోసం భూమి అవసరమైతే అనుసరించవలసిన విధానం గురించి ఇప్పటిదాకా ఏకాభిప్రాయం ఎలా కుదరాలో ఎవరూ ఆలోచించడం లేదు. అభివృద్ధి అవసరమే. రైతుల భూమి లాక్కోవడం అంటే వారి సంవేదనలను దెబ్బ తీయడమే కాక, వారి జీవనోపాధికీ విఘాతం కలుగుతుంది. ఇవి సమాజంలో అనివార్యమైన అంతర్‌ వైరుద్ధ్యాలు. వీటిని పరిష్కరించడానికి ప్రయత్నం జరగవలసిందే. విస్తృత వర్గాలతో చర్చలు జరిపి సంయమంతో నిర్ణయానికి వస్తే తప్ప సర్వ జనామోదయోగ్యమైన పరిష్కార మార్గం కనిపించడు. రైతులు ఉద్యమించినప్పుడు దాన్ని చల్లార్చడం వీలు కానప్పుడు మాత్రమే ప్రభుత్వాలు లొంగి వస్తున్నాయి. ఒక సమగ్ర విధానం రూపొందించే అంశాన్ని ఆ తరవాత అన్ని ప్రభుత్వాలు అటకెక్కిస్తున్నాయి. అన్ని రైతు సంఘాలు, కార్మికులు, విద్యార్థులు, యువజనులు, మహిళలు, దళిత సంఘాలు సమైక్యంగా మద్దతుగా నిలిచాయి. 40 నెలలపాటు పోరాటాన్ని నిలబెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. దేవనహళ్లి రైతులది పరిహారం కోసం సాగిన పోరాటం కాదు. సారవంతమైన వ్యవసాయ భూములను కాపాడుకోవడానికే సకల శక్తులు కూడదీసుకుని రైతులు పోరాడవలసి వచ్చింది. జూన్‌ 26 వ తేదీన శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల మీద పోలీసులు దౌర్జన్యానికి దిగారు. పోలీసుల దాష్టీకానీకి వ్యతిరేకంగా రాష్ట్రమంతటా నిరసన వ్యక్తమైంది. కవులు, రచయితలు కూడా రైతులకు సంఫీుభావం తెలియజేశారు. సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకులు రాకేశ్‌ తికైత్‌, యుధ్వీర్‌ సింఫ్‌ు, సునీలం, దర్శన్‌ పాల్‌ సింగ్‌, విజూ కృష్ణన్‌ లాంటి వారు కర్నాటక రైతులకు మద్దతిచ్చారు. కర్నాటక రైతులు విజయం సాధించినంత మాత్రాన భూసేకరణకు ప్రభుత్వం ప్రయత్నించడం, రైతులు ప్రతిఘటించడం లాంటివి భవిష్యత్తులో కూడా కొనసాగకుండా ఉండవు. ఈ భవిష్యత్‌ పోరాటాలలో పాల్గొనే వారు కర్నాటక రైతుల ఆందోళన నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. ఈ పోరాట విజయాలను దేశంలోని మూల మూలల రైతులకు తెలియజెప్పాలి. సమైక్యత ఉంటే సాధించలేనిది ఏమీ ఉండదని వివిధ వర్గాల ప్రజలు గ్రహించేట్టు చేయాలి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు