డాక్టర్ కొత్వాలు అమరేంద్ర,
సెల్: 9177732414
ఎన్నెన్నో అందాల కలబోతగా, ఎన్నెన్నో ప్రణయాల నెలవుగా అలరించే భూతలస్వర్గం కశ్మీరం ఇప్పుడు మళ్ళీ ఉగ్రవాదం తూటాలకు గాయపడి భయంతో వణికిపోతూనే వుంది. యుద్ధం ముగిసినా ఇంకా తీరని దుఃఖం దాని గుండెల్లో తొణికిసలాడుతూనే వుంది. కకావికలమైన ఇక్కడి జనజీవనం ఇంకా కుదుటపడనేలేదు. కుదేలైన పర్యాటకరంగం ఇంకా నిలదొక్కుకోనేలేదు…ఇప్పుడిక్కడ మతమౌఢ్యం చిందించిన నెత్తుటి బిందువుల్ని చూసి వెన్నెల వేదనతో వెలవెలబోతోంది…మానవ ప్రళయానికి ప్రత్యక్ష సాక్షి అయిన ప్రతి చెట్టూ కార్చే అశ్రుధారలు అనునిత్యపు మంచుధారల్ని మించిపోతున్నాయి… అంతవరకూ పూల పరిమళమైన ప్రణయం విడిపోయిన బంధాలను వీడిపోయి మనిషి భీకర కర్కశత్వానికి మూర్ఛనలు పోయింది…తొలకరి రాగాలు పలకాల్సిన చోట మనిషి వైపరీత్యాల అల్ప పీడన ప్రభావంతో ఇక్కడి మేఘాలు చేష్టలుడిగి బిక్కుబిక్కుమంటున్నాయి.
పహల్గాం ఉదంతం నాటి ఈ దృశ్యాలు ఉగ్రవాదాన్ని నిరసించే ప్రతి భారతీయుడి హృదయం మీద చెరగని ముద్ర వేశాయి. అందుకే ఈ దృశ్యాలు కవిత్వపు తడి అయ్యాయి. ఆ కవితాక్షరాలు అంతులేని ఆర్ద్రతను నింపుకున్నాయి. ‘ఈ కాటుక రాత్రి లాగానే/ఘనీభవించిన డాల్ సరస్సుపై కదలని షికారాలో/మానని గాయాలు విసురుకుంటున్న కన్నీటి కాలకన్యా/నా పగిలిన సౌందర్యపాత్రవు నువ్వే/చెరచబడిన స్వప్నానివి నువ్వేనా’ అంటూ పాపినేని శివశంకర్ మానవ మారణ హోమం చేసిన గాయాలతో సతమతమవుతూ అందాల్ని కోల్పోయిన కశ్మీరును వర్ణిస్తూ దాని దుఃఖంలో పాలుపంచుకుంటాడు. ‘కశ్మీరులోనే పువ్వెందుకు పూస్తుందో నాకర్థమైపోయింది/అక్కడ వున్నట్టుండి పాకేపాకే పసిబిడ్డ/నెత్తుటి ముద్దైపోతుంది/సామగానం చేసే కశ్మీర పండితుల కంఠాల్లోంచి/వేదం ఆగి రుధిరం బైటికొస్తుంది/అక్కడ రేపు పల్లకీ లెక్కి/ఊరేగాల్సిన పెళ్లికొడుకులు/ఇలాగే పాడికెక్కుతారు/ఆ లోయలో హిమాలయాలు సైతం/మూర్తీభవించిన వైధవ్యాల్లా వుంటాయి’ (కుంకుమపువ్వు)అంటూ తనికెళ్ల భరణి నలభైఏళ్ల క్రితమే అప్పటికీ, ఇప్పటీకీ ఒకేలా వున్న కశ్మీరు హృదయ వేదనను కవిత్వం చేశాడు.
‘రాత్రి యిక నిశ్శబ్దంగా లేదు/పెదవులు ఆశతో ప్రార్థనలు చేస్తాయి/చర్మం భయానకస్థితిలో వణుకుతుంది’ అంటూ కశ్మీర కవి బరియా హమీద్ ఒకప్పటి కశ్మీరులోని భయానకస్థితికి కారణమైన మానవ మృగత్వానికి కవిత్వ రూపమిస్తాడు. పహల్గాం ఉదంతంలో ప్రణయంతో పాటు కుంకుమనూ పోగొట్టుకున్న నిండు యవ్వన స్త్రీమూర్తి వేదన ప్రపంచం మొత్తాన్ని కదిలించివేసింది. అది కవిత్వమూ అయిపోయి ఆమె వేదనకు అక్షర రూపమిచ్చింది.
‘ఆమెకేం తెలుసు/రాబోయే గన్నుల గడియల గురించి
తడి ఆరని పారాణి పాదాలకు
చిలిపి చక్రాలను కట్టుకొని
కొత్త ఊపిరులకు రెక్కలు తొడిగి
కొన్ని ఆశలకు ఉయ్యాల కట్టడానికి
ఇంకొన్ని కోరికలను ముడేయడానికి
ఒకరి మనసును ఒకరు గెలుచుకోవడానికి
భూతలస్వర్గంలో ప్రేమపక్షులై విహరిస్తున్నారు……
ఆరురోజులు నిండిన వాళ్ల ఏడు అడుగులు
ఇప్పుడు అందమైన భరతమాత తిలకం సాక్షిగా
రేపటి అడుగుకై ఎన్నో ప్రమాణాలను లిఖించుకుంటున్నాయి
ఎన్నో ఊహలను చిత్రించుకుంటున్నాయి
లేలేత ప్రేమగులాబీలై అల్లుకుపోతున్నాయి
కానీ, వాళ్లిద్దరే వున్న వాళ్ల ప్రపంచంలో
మత ప్రపంచం ఒక ఆయుధమై ఎదురుపడతాదని
ఊహించని నవజాత దంపతులు వాళ్లు
ఉగ్రవాద కత్తులగాయాలకు
ఆ స్వర్గం ఎరుపెక్కుతాదని అనుకోలేదు
ఇప్పుడు ఆమె కంటిలో
అతడు రక్తపుటేరులో నిద్రపోతున్న ఒక తడిచిత్రం
ఆమె అరుపులు అతిశ్రావ్యాలై/ఆకాశం పగిలిపోతాంది
బులియన్ సరస్సులో కలిసిపోతాంది
ఆమె పాపిట నుంచి రాలిపడుతున్న
ఒక్కో కుంకుమరేణువు బరువును మోయలేక
బైసరన్ లోయ లౌకికతత్వాన్ని ప్రశ్నిస్తోంది
ఆమె ముఖంలో మాయమైపోయిన పసుపుఛాయలను
చూడలేని నీలిపావురాలన్నీ
పెహల్గాం గుండెను ప్రశ్నిస్తున్నాయి
నీ అస్తిత్వం లోతెంతని
కుంకుమపువ్వును కొంగున కట్టుకు పోవాలనుకున్న ఆమెకి
కుంకుమే లేకుండా చేసిన/ఈ మతతత్వం ఒక సరళ రేఖేనా?
దాన్నిబిందువుగా మార్చలేమా
దానినిబిందువుగా ముగించలేమా/ఒకసారి గట్టిగా ఆలోచిద్దాం
దశాబ్దాల రక్తచరిత్రలు ఎరులై ఎండిపోయేంతగా
మనసుపెట్టి ఆలోచిద్దాం
మనం ఇప్పుడు మాతాలకు మాత్రమే నమస్కరించి
కరడుగట్టిన తత్వాలను బొందబెట్టి
మన భుజాలపై ఈ దేశాన్ని నిలబెట్టుకుందాం’
(రాలిన కుంకుమపువ్వు)
తడియారని తన పాదాల పారాణి తన ప్రణయోత్సాహాన్ని చెబు తుంటే అంతవరకూ ప్రేమ సామ్రాజ్యంలో తేలిపోతూ ఒక్కసారిగా ఉగ్రమూకల దాడిలో తన ఆశలవారథి కూలిపోయి భర్తను కోల్పోయి నిశ్చేష్టురాలైన ఆ యువతి వేదనలో ఈ దేశ రక్తచరిత్రను స్మరించుకుంది వర్తమాన కవయిత్రి గట్టు రాధికామోహన్ కవిత్వం. రెండు మనసుల ప్రేమైక జీవనంలోని ఆర్ద్రత ఒక్కసారిగా ఆందోళనగా మారిపోవడానికి గల కారణాలను అన్వేషించింది. ఆ రెండు ప్రపంచాల మధ్య ఉపద్రవంగా వచ్చిన ఉగ్ర ప్రపంచాన్ని ప్రశ్నించింది. రక్తపుమడుగులో ఆమె భర్త ఒక తడిచిత్రంగా మారిపోవడాన్ని నిరసించింది. దుఃఖపు తెరలమధ్య ఆ యువతి పాపిట నుంచి రాలే కుంకుమ పువ్వుల్లాంటి వేదన అంతకుంతకూ బరువై కవిత్వం బైసరన్ లోయకు ఆ వేదనను మోయలేని తనాన్ని ఆపాదించింది. కుంకుమ చెరిపేసిన ముగింపు లేకుండా సాగిపోయే సరళరేఖ లాంటి మతతత్వాన్ని ముగిసిపోయే బిందువులా మార్చివేయాలని, అది మనిషికే సాధ్యమని తహతహలాడిరది. ఎప్పుడూ నదులైసాగే ఈ దేశపు రక్తచరిత్రలు ఎరులై
ఎండిపోవాలని అభిలషించింది.
‘అదో భూతలస్వర్గం/ప్రేమికుల ప్రణయకావ్యం
జంటల్ని గుండెలకు హత్తుకునే
మన్మధుడి అంబులపొది
కశ్మీరం నెత్తుటిరంగుపులుము కుంటోంది/మనిషే మతమైనప్పుడు
నిలువనీడ కూడా
మీపైకి తుపాకీ గురిపెడుతుంది
నిషిద్ధ స్థలమైపోతుంది…. పర్వతాలు చావుకేకలై ప్రతిధ్వనిస్తున్నాయి
మంచుపూలనేమీ అనకండి
తూటాలవర్షంలో రక్తసిక్తమైనాయి
కుంకుమపువ్వులపై నిందలు మోపకండి
తమ ఇంటికే నిప్పుపెట్టుకునే విద్య వాటికింకా తెలియదు
బతుకుతెరువు కడుపునింపుతుంది కానీ
సాటి మనుషుల్ని కడతేర్చడం నేర్పదు
అన్నం ముద్ద మీద ఒట్టు
కావాలంటే పసిపిల్లలా గుక్కపట్టి ఏడుస్తున్న కశ్మీరును అడగండి
మారణాయుధాలకు మాటలొస్తే
ఆకలి ఎంత భయంకరంగా వుంటుందో/విడమర్చి చెప్పేవి
ఆకాశాన్నంటిన పైన్ వృక్షాలకు/ఉన్మాదం ఊసు తెలియదు
రాజకీయ వ్యూహాల దుర్గంధం వాటిని సోకదు
మతాల మార్మిక విద్య వాటికి అబ్బదు
ఎండకు కరిగినమంచులా/కశ్మీరు గుండె ఆర్ద్రమైపోతున్నది…….
తనను ప్రేమగా తడిమే స్పర్శ కోసం కశ్మీరు ఎదురుచూస్తున్నది
ఏకత్వమనే సౌందర్యాన్ని పెనవేసుకుందామా మరి!’ (కుంకుమపువ్వు)
అంటూ తన వొంటినిండా ఉగ్రవాద ఉన్మాదం రక్తపుటేరులై పారుతుంటే పసిబిడ్డలా గుక్కపట్టి ఏడ్చే కశ్మీర దుఃఖాన్ని కవిత్వీ కరించింది వర్తమాన కవయిత్రి వైష్ణవిశ్రీ కలం. మతం మహమ్మారి మిగిల్చిన మహా విషాదం ఇక్కడ కవిత్వమైంది. ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో తాను కప్పుకున్న మంచుతోపాటు గడ్డకట్టిన బులియన్ సరస్సు కన్నీరూ, ఆక్రందనలై ప్రతిధ్వనించే పర్వతాలూ ఇక్కడ కవితాపార్శ్వాలయ్యాయి. మతానికి దాసోహమై దాని పడగనీడలో నిలువునా కూలిపోయే మనిషే దానికి కేంద్రబిందు వయ్యాడు. ఉగ్రవాద తూటాల వర్షానికి రక్తసిక్తమైన మంచు పూలకూ, కుంకుమపూలకూ, ఆకాశమంత ఎత్తు ఎదిగినపైన్ వృక్షాలకూ కవిత్వం బోసినవ్వుల తెలియనితనాన్ని ఆపాదించింది. ఎదిగానని విర్రవీగే మనిషి కర్కశత్వాన్ని ప్రశ్నించింది. సాటి మనుషుల్ని కడతేర్చే కర్కోటక జగత్తును ఎత్తిచూపింది. మారణా యుధాలకు భీకర ఆకలిని ఆపాదించింది. రాజకీయ వ్యూహాల దుర్గంధాన్ని వొళ్లంతా పులుముకొని, మతాల మార్మిక విద్యలో ఆరితేరి మనిషి చేసే మారణ హోమాన్ని బట్టబయలుచేసింది. ఎండకు కరిగిపోయే మంచులా కశ్మీరు హృదయం కరుణతో కరిగిపోయే ఆర్ద్రతతో నిండిపోతోంది. మానవత్వపు మంచు స్పర్శ కోసం తహతహలాడే దాని ఎదురుచూపుల భారాన్ని కవిత్వం నిండుగా నింపుకుంది. ఏకత్వ సౌందర్యమే తన సంకల్పంగా ఉగ్రవాద కల్లోలానికి ముగింపు పలికే సుదినం కోసం, మళ్లీ ఇక్కడ కుంకుమపూల సరాగాల కోసం, చెట్ల చిరు దరహాసాల కోసం, ఈ లోయల ఆత్మానందపు తెమ్మెరల కోసం కవిత్వం నిరీక్షిస్తూన వుంటుంది. అవును అదే కవిత్వ పరమావధి.


