. మద్యం విక్రయాల్లో నా జోక్యం లేదు
. ఎప్పుడు పిలిస్తే అప్పుడు సిద్ధం
. కోటరీ వల్లే వైసీపీ వీడా… రాజ్యసభకు పోటీలో లేను
. సిట్ విచారణ అనంతరం విజయసాయిరెడ్డి
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం విక్రయాల్లో తాను ఎప్పుడు జోక్యం చేసుకోలేదని, నాటి మద్యం విక్రయాల్లో కర్మ, కర్త, క్రియ అంతా రాజ్ కసిరెడ్డి అని రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పష్టంచేశారు. ఏపీ మద్యం కుంభకోణం వ్యవహారంపై విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన సిట్ విచారణకు శుక్రవారం విజయసాయిరెడ్డి హాజరయ్యారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ… త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికకు తాను పోటీలోనే లేనన్నారు. ప్రజలు కోరుకుంటే రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. కోటరీ వల్లే తాను వేదన చెంది వైసీపీని వీడానని విజయసాయిరెడ్డి వివరించారు. రాజ్ కసిరెడ్డి మూడు కంపెనీలు ఏర్పాటు చేసి… కొత్త మద్యం బ్రాండ్లను తయారు చేసి విక్రయించిన సంగతి తనకు తెలియదన్నారు. అందులో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి పాత్ర గురించి సైతం తనకు తెలియదని సిట్ అధికారులకు స్పష్టం చేశానన్నారు. తనను అడిగిన ప్రశ్నలన్నింటికీ… రాజ్ కసిరెడ్డి సమాధానం చెప్పగలరని సిట్ అధికారుల ఎదుట చెప్పినట్లు వివరించారు. ఇక మూడు కంపెనీలను రాజ్ కసిరెడ్డి లీజుకు తీసుకున్నారా అని ప్రశ్నించగా తాను పైవిధంగా సమాధాన మిచ్చానన్నారు. రాజ్ కసిరెడ్డి మోసం చేసింది తనను కాదని, పార్టీని… ప్రజలనని విజయసాయిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్, అమరావతిలో జరిగిన భేటీల్లో…జరిగిన విషయాలపై ఉన్నతాధికారులు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పానన్నారు. నాటి సీఎం వైఎస్ జగన్ ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డి, ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి ఈ సమావేశాలకు వచ్చారా అని ప్రశ్నించగా, తనకు గుర్తు ఉన్నంతవరకు వాళ్లెవరూ రాలేదని తెలిపానన్నారు. కిక్ బాక్స్ గురించి తనకు తెలియదని, రాజ్ కసిరెడ్డి వసూలు చేసినవి ఎవరికి వెళ్లాయో తనకు తెలియదని చెప్పినట్లుగా విజయసాయిరెడ్డి వెల్లడిరచారు. అరబిందో వద్ద రూ.100 కోట్లు అప్పుగా ఇప్పించానని… అందుకు 12శాతం వడ్డీకి చెల్లింపులు జరిగేలా అప్పు ఇప్పించానని సిట్ అధికారుల ఎదుట చెప్పినట్లు వివరించారు. డీకార్ట్, అడాన్ కంపెనీలకు అప్పులు సైతం ఇప్పించానన్నారు. ఒకరికి రూ.60 కోట్లు, మరొకరికి రూ.40 కోట్లు ఇచ్చారని వివరించారు. తాను పెట్టించిన ఛానల్‌లో తనపై అనవసరంగా విమర్శలు చేశారని విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం చేసుకుంటానన్న వ్యక్తికి… ఇంకా రాజకీయాలు ఎందుని అంటున్నారని మండిపడ్డారు. దీని వెనుక బిగ్‌బాస్ ఉన్నారా… లేదా… అనేదీ తెలియదన్నారు. మరోసారి పిలిచినా విచారణకు వస్తానని సిట్ అధికారులకు తాను చెప్పినట్లు పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీల్లో నెంబర్ -2 స్థానం ఉండదని, పార్టీ అధికారంలో లేని సమయంలో అన్నీ తానే చూసుకున్నానని ఆయన గుర్తుచేసుకున్నారు. అధికారంలోకి వచ్చాక నెంబర్ -2 అనేది మిథ్యగా భావించానని తెలిపారు. తనను వెన్నుపోటు దారుడనని వైఎస్ జగన్‌కు చెప్పారని, దీంతో రెండవ స్థానం నుంచి తాను రెండువేల స్థానానికి పడిపోయానని విజయసాయిరెడ్డి చెప్పారు. అటు…విచారణలో భాగంగా కసిరెడ్డి తండ్రి సిట్ విచారణకు హాజరయ్యారు.