నిబద్ధత గల అభ్యర్థులను గెలిపించండి
కమ్యూనిస్టులది అక్రమాలకు తావులేని పాత్ర
ప్రలోభాలకు లొంగొద్దు: ప్రచార సభల్లో కూనంనేని
విశాలాంధ్ర బ్యూరో – కొత్తగూడెం: తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన కొత్తగూడెం కార్పొరేషన్ అభివద్ధి చెందాలంటే అది ఒక్క సీపీఐ వల్లనే సాధ్యమౌతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కార్పొరేషన్ పరిధిలో 20, 57, 49, 10, 58. 59. 60 డివిజన్లలో శుక్రవారం భారీ రోడ్ షోలు, సభలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కూనంనేని మాట్లాడుతూ… కొత్తగూడెం అభివృద్ధిలో అక్రమాలకు తావు లేని కమ్యూనిస్టు పార్టీ పాత్ర చిరస్మరణీయమన్నారు. ఎమ్మెల్యేగా తాను గెలిచిన రెండేళ్లలో నియోజకవర్గ వ్యాప్తంగా చేసిన అభివృద్ధి పనులను ప్రజలు స్వాగతిస్తున్నారని గుర్తు చేశారు. సీపీఐ అభివృద్ధి నమూనా చూసి గడచిన పంచాయతీ ఎన్నికల్లోనూ నియోజకవర్గ పరిధిలోని పంచాయతీల్లో అధిక శాతం సర్పంచ్లను గెలిపించినట్టు చెప్పారు. బడుగు బలహీన వర్గాల గొంతుకగా సీపీఐ ఎల్లప్ప్పుడూ నిలబడుతుందని స్పష్టం చేశారు. బస్తీల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యల నుంచి ప్రజలకు సంక్షేమ ఫలాల పంపిణి వరకు ప్రతి అంశంపై తాము పోరాడుతామని హామీ ఇచ్చారు. కార్పొరేషన్ పాలనలో పారదర్శకత ఉండాలంటే ఎర్రజెండా అభ్యర్థుల విజయం అనివార్యమని పేర్కొన్నారు.కార్పొరేషన్ …కమ్యూనిస్టుల సారథ్యంలో ఉన్నప్ప్పుడే ఆదర్శవంతమైన సమగ్రాభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు అవుతాయని వివరించారు. ప్రత్యర్థి పార్టీల ప్రలోభాలకు లొంగకుండా, నిబద్ధత గల సీపీఐ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి అహంకారులకు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి అంటే కేవలం కాంట్రాక్టులు కాదని, సామాన్యుడి ముంగిటకు సంక్షేమ ఫలాలు చేరడమన్నారు. కార్పొరేషన్ సమగ్రంగా అభివృద్ధి సాధించడమే నిజమైన విజయమని ఆయన ఉద్ఘాటించారు. కాగా, దశాబ్దాలుగా సీపీఐ, ఏఐటీయూసీ కార్మిక శక్తికి బలమైన కోటగా ఉన్న కొత్తగూడెం నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం ఎరుపెక్కుతుంది. ఈ నేపథ్యంలో కూనంనేని ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గడపగడపకు వెళుతూ ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. దుర్గరాసి వెంకటేశ్వర్లు, భూక్యా దస్రు, వాసిరెడ్డి మురళి, కంచర్ల జమలయ్య, కందుల భాస్కర్, ఎస్కె ఫహీమ్, అభ్యర్థులు మూడ్ గణేష్, సహేరా మహమ్మద్, బోయిన విజయ్ కుమార్, మహమ్మద్ అబ్దుల్ సల్మా, కొచ్చెర్ల రాకేష్ కాంత్, ఇమ్రాన్ మహమ్మద్, బేత అనంతలక్ష్మి, నాయకులు యూసుఫ్, తుమ్మ నర్సయ్య, పల్నాటి ప్రశాంత్, అస్మత్, జడల ప్రకాష్, అజీజ్, జక్కుల రాములు, హన్మంతరావు పాల్గొన్నారు.


